Call Money traders
-
ఆస్తి కాజేసేందుకు కుట్ర
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హామీగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయకుండా అన్యాయంగా తమ ఆస్తిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అశోక్‌నగర్‌కు చెందిన ఆశాలత మీడియా ఎదుట వాపోయింది. తమ కుటుంబ అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించినా...అప్పు తీరలేదని హామీగా చేసిన రిజస్ట్రేషన్ రద్దు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చి తమపై దాడికి యత్నించారని వాపోయింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబ అవసరాల కోసం భర్త హరికృష్ణతో కలిసి 2016లో నాగమణి, రామకృష్ణల దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నానని చెప్పారు. అప్పు తీర్చడం కోసం ఆస్తిని అడుసుమిల్లి మోహనరామదాసుకు వారిద్దరు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. హామీ పెట్టాలని పటమటలోని 400 చ.గల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. హామీగా మాత్రమే స్థలం రిజిస్ట్రేషన్ జరుగుతుందని, అప్పుతీర్చినవెంటనే రద్దు చేస్తామని నమ్మబలికారని కన్నీటి పర్యంతమయ్యారు. రిజిస్ట్రేషన్ తర్వాత రూ.10 ఆపైన వడ్డీ లెక్కగట్టి కోట్ల రూపాయల విలువచేసే తమ ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నారన్నారు. లక్షల రూపాయలు చెల్లించినా వడ్డీకే చాలలేదంటూ ఒత్తిడికి గురిచేశారన్నారు. మరోచోట ఉన్న 200 చ.గల స్థలాన్ని రిజిస్రేషన్ చేయించుకున్నారన్నారు. నా భర్తను బెదిరించి అశోక్‌నగర్‌లో ఉన్న 195 గజాల ఇంటిని తనఖా చేయించుకున్నారని వాపోయింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసిన స్థలాలు, ఇల్లు ఖాళీచేయాలంటూ రామదాసు కుమారుడు నందు, రామకృష్ణ, నాగమణి దౌర్జన్యం చేస్తున్నారన్నారు. శనివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి గేటు తాళం పగులగొట్టారని, ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని తెలిపింది. భయపడి కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడంతో పటమట పోలీసులు వచ్చి కాపాడారని తెలిపింది. వారినుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకుంది. -
కృష్ణాజిల్లాలో రెచ్చిపోయిన కాల్‌మనీ వ్యాపారులు...
అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న పూజారి అడిగిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడంతో ఇనుప రాడ్లతో దాడికి తెగబడి గాయపరిచారు. మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న బుద్దు పవన్ కొన్ని సంవత్సరాల క్రితం వనవలయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అసలు, చక్రవడ్డీలతో కలిపి అప్పు రూ.4 లక్షలకు చేరుకుంది. పవన్ అప్పుడప్పుడూ కొంత మొత్తం చెల్లిస్తున్నా వడ్డీ రేటు అధికం కావడంతో అప్పు, అప్పుగానే మిగిలింది. కాగా, ఆదివారం రాత్రి పవన్ రేపల్లె నుంచి మోపిదేవి వస్తుండగా మోపిదేవి కాలనీలో వడ్డీ వ్యాపారి వనవలయ్య మరికొందరితో కలసి పవన్‌ను అడ్డగించి బాకీ తీర్చాలని అడిగాడు. దానికి పవన్ ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తప్పకుండా తీరుస్తానని కొంత సమయం కావాలని ఆయన్ను కోరాడు. దీంతో ఆగ్రహించిన వారు ఇనుప రాడ్లతో పవన్‌పై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన పవన్ అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అవనిగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బెట్టింగ్ హీట్
► టీ-20 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్ ► ‘అనంత’తో పాటు ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరిలో సబ్ బుకీలు ► బుకీలతో సంబంధం లేకుండానూ...భారీగా వడ్డీలు పెంచిన ‘కాల్‌మనీ’ వ్యాపారులు ► దృష్టిసారించని పోలీసులు టాస్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ ఎవరి సొంతం? ఈ బాల్‌కు సిక్స్ కొడతాడా.. లేదా? ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి?...సాయంత్రమయితే చాలు బెట్టింగ్ రాయుళ్ల మధ్య జరిగే సంభాషణలివి. టీ-20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరందుకుంటోంది. బుకీల అండతో నడిచే సబ్‌బుకీలతో పాటు కొంతమంది గ్రూపులుగా విడిపోయి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగినా ‘అనంత’లో రూ. 1.5-2కోట్ల దాకా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారు కూడా ‘అనంత’లో మకాం వే స్తున్నారు. (సాక్షిప్రతినిధి, అనంతపురం) టీ-20 ప్రపంచ కప్ ఈ నెల 15 నుంచి మొదలైంది. అన్ని జట్లు మంచి ఫాంలో ఉండటంతో ప్రతిమ్యాచ్ బిగ్‌ఫైట్‌ను తలపిస్తోంది. ఇదే బెట్టింగ్ రాయుళ్లకు అనువుగా మారింది. క్షణాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ‘అనంత’కు మారిన బెట్టింగ్ కేంద్రం రాయలసీమలో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ఎక్కువగా సాగేది. అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడం, ఏళ్ల తరబడి అరెస్టులు, కౌన్సెలింగ్‌ల నేపథ్యంలో గతంతో పోలిస్తే అక్కడ బెట్టింగ్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో బుకీలు ప్రొద్దుటూరుపై కాస్త ఫోకస్ తగ్గించి అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో బుకీలు ఉంటారు. వారు ఇక్కడ సబ్‌బుకీలను నియమించారు. వీరు మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకూ బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ధారిస్తారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగ్ ద్వారాజిల్లాలో రోజూ రూ.1.50-2కోట్లు చేతులు మారుతోంది. ఇటీవల ఇండియా-పాకిస్థాన్, ఇంగ్లండ్- సౌతాఫ్రికా మ్యాచ్‌ల సమయంలో రూ.5కోట్ల దాకా బెట్టింగ్ జరిగి ఉంటుందని ఓ అంచనా. బాల్ టు బాల్ బెట్టింగ్ సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్ లేక ఫోర్ కొడతాడా? బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతిబాల్కు బెట్టింగ్ జరుగుతోంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బంతులపై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలను వేదికగా చేసుకుంటున్నారు. భారీ వడ్డీలకు అప్పులు ఈ మాయలో పడిన కొందరు బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీకి డబ్బు తెస్తున్నారు. ఇంకొందరు రూ.పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. బెట్టింగ్‌రాయుళ్లు చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ‘అనంత’ పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రపంచకప్ ముందు బెట్టింగ్‌పై ఎస్పీ రాజశేఖరబాబు ఆరా తీయగా.. ‘అబ్బే అనంతలో అంత లేదు సార్’ అని కొందరు తప్పుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎస్పీ దృష్టి సారిస్తేనే బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించవచ్చు. -
ఈ పాపం బాబుదే
ఆడిన మాట తప్పిన ముఖ్యమంత్రి రుణ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ అధికారంలోకి వచ్చినా తీరని అప్పులు కొత్తగా రుణాలు ఇచ్చేది లేదని ఛీకొట్టిన బ్యాంకర్లు తప్పక వడ్డీవ్యాపారుల గడపతొక్కిన మహిళలు, రైతులు చివరకు అధిక వడ్డీ కబంధ హస్తాల్లో విలవిల... కాల్‌మనీ వ్యాపారుల అకృత్యాలు, దురాగతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూల కారణమని జిల్లాలోని రైతులు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆడిన మాట తప్పి పాపం మూటగట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేసి ఉంటే నేడు ఈ అఘాయిత్యాలకు అవకాశమే ఉండేది కాదని విశ్లేషిస్తున్నారు. గుంటూరు : కాల్‌మనీ అనర్థాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా రద్దు చేస్తానని, తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదని బాబు ప్రచారం చేశారు. ఆయనకు తోడు పార్టీ కార్యకర్తలు సైతం ఇంటింటికీ తిరిగి ‘బాబు వస్తే జాబు’తోపాటు రుణాలు రద్దవుతాయని ప్రజలను నమ్మించారు. తీరా, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మాట మార్చారు. షరతులు విధించారు. వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర గడిచినా తీసుకున్న రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు కాకపోగా, వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి. పాత అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. తప్పని పరిస్థితుల్లో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు కాల్‌మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అనేక మంది రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ ఆస్తులను పోగొట్టుకున్నారు. జిల్లాలో 11 లక్షల 47 వేల మంది రైతులు రూ.9,600 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తం మాఫీ అవుతుందని భావించారు. అయితే మాఫీకి సంబంధించి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు పట్టాదారు పుస్తకాలు ఉండాలన్నారు. పట్టాదారు పుస్తకాలు లేని రైతులను అనర్హులుగా ప్రకటించారు. మొత్తం రుణం వాయిదాల్లో మాఫీ చేస్తామని, రుణ మాఫీలో ఆలస్యమైనా వడ్డీని తామే చెల్లిస్తామని పాలకులు చెప్పారు. మొదటి దశలో రూ.543 కోట్లు చెల్లించారు. అయితే వడ్డీలు, సర్‌చార్జీలు కలిపి పెరిగిన రుణంలో ఈ మొత్తం 10 శాతం కూడా లేకపోవడంతో రైతుల రుణ మొత్తాలు తగ్గలేదు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు. ప్రతీ ఖరీఫ్‌లో వరి రైతు ఎకరాకు రూ.20 వేల వరకు రుణం తీసుకుంటాడు. ఈ సారి బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రుణాల కోసం రైతులు కాల్‌మనీ, అధిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీనిని అలుసుగా తీసుకున్న కాల్‌మనీ వ్యాపారులు ఇళ్లు, ట్రాక్టర్లు, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకుని రైతులకు రుణాలు ఇచ్చారు. ఒక వైపు పాత అప్పులు కట్టాలని బ్యాంకర్ల ఒత్తిడి, మరో వైపు కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక కొందరు రైతులు అనారోగ్యంతో మృతి చెందితే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మొత్తం 60 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం బాబుదేనని ఆ రైతు కుటుంబాలు ఘోషిస్తున్నాయి. జిల్లాలో 55 వేల డ్వాక్రా గ్రూపుల్లో ఎక్కువ మంది సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన మాటల గారడీతో బురిడీ కొట్టించారు. వారు తీసుకున్న రూ.450 కోట్లను రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులంతా అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చివరకు ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలను బ్యాంకులో జమ చేశారు. అయితే సభ్యులు వడ్డీలు చెల్లించడం లేదని ఆ రూ.3 వేలను బ్యాంకర్లు లాగేసుకున్నారు. చివరకు మహిళలు కూడా బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదని కాల్‌మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలో సకాలంలో చెల్లించని అనేక మంది మహిళలపై కాల్‌మనీ నిర్వాహకులు నియమించిన బౌన్సర్లు దాడులు చేశారు. ఇళ్లల్లో సామాన్లు బయట పడేసిన సంఘటనలు జిల్లాలో లేకపోలేదు. విజయవాడ తరహా సెక్స్‌రాకెట్ అకృత్యాలు గుంటూరులో బయటపడలేదని, అయితే ఆ తరహా దురాగతాలు లేవని చెప్పలేమని కొందరు పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో భారీగా సోదాలు.. పలువురి అరెస్ట్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో భారీగా సోదాలు నిర్వహించారు. టెక్కలి, ఇచ్ఛాపురం, పలాసలలో జరిపిన సోదాల్లో భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో రామిరెడ్డి, సత్తిరెడ్డి, ఇచ్ఛాపురంలో వెంకట్రావు, పలాసలో నాగిరెడ్డి, టెక్కలిలో రమణ అనే వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సోదాల్లో భారీగా ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలు, బ్లాంక్ చెక్‌లు, వివిధ డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల అగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారుల వేధింపులపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
డాబుసరి దాడులే!
తప్పించుకున్న కాల్‌మనీ వ్యాపారులు కంగుతిన్న పోలీసు పెద్దలు లీక్ చేశారని అనుమానాలు విజయవాడ సిటీ : వందల్లో వ్యాపారులు.. కోట్ల విలువైన ఆస్తుల తాలూకు పత్రాలు.. వేల సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు.. కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల్లో దొరుకుతాయని ఆశించిన పోలీసు పెద్దలకు నిరాశే మిగిలింది. పోలీసు దాడుల్లో ఆశించిన పత్రాలు, వ్యక్తులు పట్టుబడకపోవడంపై అంతర్మథనం చెందుతున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పరారయ్యారా? లేక దాడుల సమాచారాన్ని అధికారులు లీకు చేశారా? అనే అనుమానాలు పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. అనుకున్నదొకటి.. అయిందొకటి.. పటమట పంట కాల్వ రోడ్డులోని యలమంచిలి రాము ముఠా కాల్‌మనీ ముసుగులో సెక్స్ దందా నిర్వహించడంపై నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. అప్పు ఇచ్చిన ముసుగులో చట్ట వ్యతిరేక దందాకు దిగుతున్న ముఠాల ఆటకట్టించాలని నిర్ణయించుకొని ప్రత్యేక బృందం ద్వారా కాల్‌మనీ వ్యాపారుల సమాచారం సేకరించారు. సీపీ ప్రత్యేక బృందం నగరంలో 250 మందికి పైగా వ్యక్తులు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. వారిలో రూ.100 కోట్లకు పైబడి ఆస్తులను బాధితుల నుంచి చేజిక్కించుకున్నవారు వంద మందికి పైగా ఉన్నట్టు వారి పరిశీలనలో తెలిసింది. వేల సంఖ్యలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నారనేది పోలీసులకు అందిన సమాచారం. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొందరు పరారైనప్పటికీ.. దాడులు చేస్తామనే విషయం తెలియదు కాబట్టి భారీగానే నోట్లు, చెక్కులు, డాక్యుమెంట్లు పట్టుబడతాయని భావించారు. పైగా పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకోవచ్చని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా నగరంలో నిర్వహించిన దాడుల్లో పోలీసు పెద్దలు ఆశించిన మేర ఫలితాలు రాలేదని తెలుస్తోంది. పట్టుబడిన ఆస్తుల విలువ రూ.500 కోట్లు కూడా ఉండదని అధికార వర్గాల సమాచారం. వేలకోట్లలో ఆస్తులు పట్టుబడతాయని భావించిన అధికారులకు ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు. లీక్ చేశారా... దాడుల విషయం ముందుగానే లీకైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పోలీసు దాడులు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఇంట్లో కనిపించిన కాల్‌మనీ వ్యాపారులు ఉదయానికల్లా ఎలా మాయమయ్యారనేది స్థానికుల ప్రశ్న. ముందస్తు సమాచారం లేకుంటే వెళ్లడం సాధ్యపడదనేది పలువురిలో నెలకొన్న అభిప్రాయం. కొన్ని దాడులు మొక్కుబడిగా జరిగినట్టు చెపుతున్నారు. దొరికిన డాక్యుమెంట్లలో కొన్నింటిని స్వాధీనం చేసుకొని మిగిలినవి వదిలేసి వచ్చారనేది బాధితుల ఆరోపణ. దాడులకు చిక్కకుండా పలువురు తప్పించుకోవడాన్ని బట్టి పోలీసు, కాల్‌మనీ మాఫియా లింకులు స్పష్టమవుతున్నాయని నగరవాసులు చెపుతున్నారు. అదుపులో 57 మంది కమిషనరేట్ పరిధిలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్న 57 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 19 మందిని, సెంట్రల్ జోన్లో 52 ప్రాంతాల్లో దాడులు జరిపి 18 మందిని, తూర్పు జోన్‌లోని 20 ప్రాంతాల్లో దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 938 ప్రామిసరీ నోట్లు, 193 ఖాళీ చెక్కులు, 16 అప్పు తాలూకు స్టాంపు పత్రాలు, వివిధ వ్యక్తులు, సంస్థల పేరిట ఉన్న 310 డాక్యుమెంట్లతో పాటు రూ.14.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులేరీ... నగరంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతల కాల్‌మనీ వ్యాపారం నగరవాసులకు తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ఏ ఒక్కరిని అడిగినా కాల్‌మనీ ముసుగులో వీరు చేసే ఆగడాలు వెలుగులోకి వస్తాయి. ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న బుద్దా నాగేశ్వరరావు, కార్పొరేటర్ కనకదుర్గ భర్త గుర్రం కొండా మినహా చెప్పుకోదగ్గ కాల్‌మనీ వ్యాపారులెవరూ పోలీసుల దాడుల్లో చిక్కలేదు. అనేక మంది రౌడీషీటర్లు కూడా కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నా అదుపులోకి తీసుకోకపోవడం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు పెద్దలను సంతృప్తి పరిచేందుకు దాడులు చేశారు తప్ప బాధితులకు న్యాయం చేసేందుకు కాదనే అభిప్రాయం నెలకొంది.