బెట్టింగ్ హీట్
► టీ-20 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్
► ‘అనంత’తో పాటు ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరిలో సబ్ బుకీలు
► బుకీలతో సంబంధం లేకుండానూ...భారీగా వడ్డీలు పెంచిన ‘కాల్‌మనీ’ వ్యాపారులు
► దృష్టిసారించని పోలీసులు
టాస్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ ఎవరి సొంతం? ఈ బాల్‌కు సిక్స్ కొడతాడా.. లేదా? ఈ ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి?...సాయంత్రమయితే చాలు బెట్టింగ్ రాయుళ్ల మధ్య జరిగే సంభాషణలివి. టీ-20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరందుకుంటోంది. బుకీల అండతో నడిచే సబ్‌బుకీలతో పాటు కొంతమంది గ్రూపులుగా విడిపోయి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగినా ‘అనంత’లో రూ. 1.5-2కోట్ల దాకా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారు కూడా ‘అనంత’లో మకాం వే స్తున్నారు.
(సాక్షిప్రతినిధి, అనంతపురం) టీ-20 ప్రపంచ కప్ ఈ నెల 15 నుంచి మొదలైంది. అన్ని జట్లు మంచి ఫాంలో ఉండటంతో ప్రతిమ్యాచ్ బిగ్‌ఫైట్‌ను తలపిస్తోంది. ఇదే బెట్టింగ్ రాయుళ్లకు అనువుగా మారింది. క్షణాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి.
‘అనంత’కు మారిన బెట్టింగ్ కేంద్రం
రాయలసీమలో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ఎక్కువగా సాగేది. అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడం, ఏళ్ల తరబడి అరెస్టులు, కౌన్సెలింగ్‌ల నేపథ్యంలో గతంతో పోలిస్తే అక్కడ బెట్టింగ్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో బుకీలు ప్రొద్దుటూరుపై కాస్త ఫోకస్ తగ్గించి అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో బుకీలు ఉంటారు. వారు ఇక్కడ సబ్‌బుకీలను నియమించారు.
వీరు మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకూ బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ధారిస్తారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగ్ ద్వారాజిల్లాలో రోజూ రూ.1.50-2కోట్లు చేతులు మారుతోంది. ఇటీవల ఇండియా-పాకిస్థాన్, ఇంగ్లండ్- సౌతాఫ్రికా మ్యాచ్‌ల సమయంలో రూ.5కోట్ల దాకా బెట్టింగ్ జరిగి ఉంటుందని ఓ అంచనా.
బాల్ టు బాల్ బెట్టింగ్
సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్ లేక ఫోర్ కొడతాడా? బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతిబాల్‌కు బెట్టింగ్ జరుగుతోంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బంతులపై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలను వేదికగా చేసుకుంటున్నారు.
భారీ వడ్డీలకు అప్పులు
ఈ మాయలో పడిన కొందరు బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీకి డబ్బు తెస్తున్నారు. ఇంకొందరు రూ.పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. బెట్టింగ్‌రాయుళ్లు చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ‘అనంత’ పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రపంచకప్ ముందు బెట్టింగ్‌పై ఎస్పీ రాజశేఖరబాబు ఆరా తీయగా.. ‘అబ్బే అనంతలో అంత లేదు సార్’ అని కొందరు తప్పుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎస్పీ దృష్టి సారిస్తేనే బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించవచ్చు.