డాబుసరి దాడులే! | Call Money merchants escaped | Sakshi
Sakshi News home page

డాబుసరి దాడులే!

Published Wed, Dec 16 2015 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

డాబుసరి దాడులే! - Sakshi

డాబుసరి దాడులే!

తప్పించుకున్న కాల్‌మనీ వ్యాపారులు
కంగుతిన్న పోలీసు పెద్దలు
లీక్ చేశారని అనుమానాలు

 
విజయవాడ సిటీ : వందల్లో వ్యాపారులు.. కోట్ల విలువైన ఆస్తుల తాలూకు పత్రాలు.. వేల సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు.. కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల్లో దొరుకుతాయని ఆశించిన పోలీసు పెద్దలకు నిరాశే మిగిలింది. పోలీసు దాడుల్లో ఆశించిన పత్రాలు, వ్యక్తులు పట్టుబడకపోవడంపై  అంతర్మథనం చెందుతున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పరారయ్యారా? లేక దాడుల సమాచారాన్ని అధికారులు లీకు చేశారా? అనే అనుమానాలు పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.

అనుకున్నదొకటి.. అయిందొకటి..
పటమట పంట కాల్వ రోడ్డులోని యలమంచిలి రాము ముఠా కాల్‌మనీ ముసుగులో సెక్స్ దందా నిర్వహించడంపై నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. అప్పు ఇచ్చిన ముసుగులో చట్ట వ్యతిరేక దందాకు దిగుతున్న ముఠాల ఆటకట్టించాలని నిర్ణయించుకొని ప్రత్యేక బృందం ద్వారా కాల్‌మనీ వ్యాపారుల సమాచారం సేకరించారు. సీపీ ప్రత్యేక బృందం నగరంలో 250 మందికి పైగా వ్యక్తులు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. వారిలో రూ.100 కోట్లకు పైబడి ఆస్తులను బాధితుల నుంచి చేజిక్కించుకున్నవారు వంద మందికి పైగా ఉన్నట్టు వారి పరిశీలనలో తెలిసింది. వేల సంఖ్యలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నారనేది పోలీసులకు అందిన సమాచారం. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొందరు పరారైనప్పటికీ.. దాడులు చేస్తామనే విషయం తెలియదు కాబట్టి భారీగానే నోట్లు, చెక్కులు, డాక్యుమెంట్లు పట్టుబడతాయని భావించారు. పైగా పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకోవచ్చని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా నగరంలో నిర్వహించిన దాడుల్లో పోలీసు పెద్దలు ఆశించిన మేర ఫలితాలు రాలేదని తెలుస్తోంది. పట్టుబడిన ఆస్తుల విలువ రూ.500 కోట్లు కూడా ఉండదని అధికార వర్గాల సమాచారం. వేలకోట్లలో ఆస్తులు పట్టుబడతాయని భావించిన అధికారులకు ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు.

లీక్ చేశారా...
దాడుల విషయం ముందుగానే లీకైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పోలీసు దాడులు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఇంట్లో కనిపించిన కాల్‌మనీ వ్యాపారులు ఉదయానికల్లా ఎలా మాయమయ్యారనేది స్థానికుల ప్రశ్న. ముందస్తు సమాచారం లేకుంటే వెళ్లడం సాధ్యపడదనేది పలువురిలో నెలకొన్న అభిప్రాయం. కొన్ని దాడులు మొక్కుబడిగా జరిగినట్టు చెపుతున్నారు. దొరికిన డాక్యుమెంట్లలో కొన్నింటిని స్వాధీనం చేసుకొని మిగిలినవి వదిలేసి వచ్చారనేది బాధితుల ఆరోపణ. దాడులకు చిక్కకుండా పలువురు తప్పించుకోవడాన్ని బట్టి పోలీసు, కాల్‌మనీ మాఫియా లింకులు స్పష్టమవుతున్నాయని నగరవాసులు చెపుతున్నారు.
 
అదుపులో 57 మంది
కమిషనరేట్ పరిధిలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్న 57 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 19 మందిని, సెంట్రల్ జోన్‌లో 52 ప్రాంతాల్లో దాడులు జరిపి 18 మందిని, తూర్పు జోన్‌లోని 20 ప్రాంతాల్లో దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 938 ప్రామిసరీ నోట్లు, 193 ఖాళీ చెక్కులు, 16 అప్పు తాలూకు స్టాంపు పత్రాలు, వివిధ వ్యక్తులు, సంస్థల పేరిట ఉన్న 310 డాక్యుమెంట్లతో పాటు రూ.14.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రముఖులేరీ...
నగరంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతల కాల్‌మనీ వ్యాపారం నగరవాసులకు తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ఏ ఒక్కరిని అడిగినా కాల్‌మనీ ముసుగులో వీరు చేసే ఆగడాలు వెలుగులోకి వస్తాయి. ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న బుద్దా నాగేశ్వరరావు, కార్పొరేటర్ కనకదుర్గ భర్త గుర్రం కొండా మినహా చెప్పుకోదగ్గ కాల్‌మనీ వ్యాపారులెవరూ పోలీసుల దాడుల్లో చిక్కలేదు. అనేక మంది రౌడీషీటర్లు కూడా కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నా అదుపులోకి తీసుకోకపోవడం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు పెద్దలను సంతృప్తి పరిచేందుకు దాడులు చేశారు తప్ప బాధితులకు న్యాయం చేసేందుకు కాదనే అభిప్రాయం నెలకొంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement