call money victims
-
మీ పార్టీ నాయకుడి వల్లే నష్టపోయాం
►సీఎం ఎదుట కాల్‌మనీ బాధితుల ఆందోళన ►వారించిన చంద్రబాబు నాయుడు విజయవాడ (పటమట): ‘మీ పార్టీ నాయకుడి వల్లనే నష్టపోయాం, మా ఆస్తిని ఆక్రమించుకున్నారు’ అంటూ కాల్‌మనీ బాధితులు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమావేశంలో ఆందోళన దిగారు. హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, ఫన్‌టైమ్స్ ఆధ్వర్యంలో ఫన్‌టైమ్ క్లబ్లో జరుగుతున్న రాష్ర్టస్థాయి ఫల, పుష్ప ప్రదర్శన-2016 ముగింపు సభ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కాల్‌మనీ బాధితుడు రేలంగి హనుమంతరావు, భార్య బేబి, బంధువులు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఫన్‌టైమ్ క్లబ్‌కు చేరుకున్నారు. సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే నగరంలోని విద్యాధరపురానికి చెందిన కాల్‌మనీ బాధితుడు హనుమంతరావు మేనల్లుడు శివరామ్ సభలోనే పైకి లేచి ‘సీఎం గారు.. మీ పార్టీ నాయకుడి వల్లనే మేము తీవ్రంగా నష్టపోయాం, మమ్మల్ని మోసం చేసి మా స్థలాన్ని ఆక్రమించుకున్నారు’ అని గట్టిగా గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో కంగుతిన్న సీఎం వెంటనే స్పందించి ‘ఏయ్.. ఇక్కడ అలజడి చేయవద్దు, నలుగురిలో ఉన్నాం, సమస్యలు చెప్పడానికి ఒక వే (మార్గం) ఉంది, క్యాంపు కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పండి’ అంటూ గదమాయించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని శివరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సభపై ఉన్న బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారిని వారించారు. సభ ముగిసి వెళ్లే సమయంలో బాధితులు ముఖ్యమంత్రిని కలిసి సమస్య విన్నవించగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. బాధితులు రేలంగి హనుమంతరావు తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమీప బంధువు బుద్దా భాస్కరరావు వద్ద తాను 2015 జూలై 31న రూ. 4 లక్షలను మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నామని, హామీగా కుమ్మరిపాలెం సెంటర్లోని 83గజాల పెంకుటింటి కాగితాలు పెట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో తనఖా రిజిస్ట్రేషన్ అని నమ్మించి విక్రయ దస్తావేజుపై, స్టాంపు పేపర్, తెల్ల కాగితాలు, ప్రామిసరీ నోట్లపై తనతోను, కుటుంబసభ్యులతో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. వడ్డీ చెల్లించేందుకు నెలాఖరుకు వెళ్లగా రూ.3 వడ్డీ అయితే రూ.6 వడ్డీ చెల్లించాలని.. లేకపోతే తీసుకోనని చెప్పడంతో ఆస్తి పోతుందన్న భయంతో రూ.6 వడ్డీ చెల్లించినట్లు చెప్పారు. నాలుగో నెలలో అసలు సొమ్ము చెల్లిస్తాను, దస్తావేజులు ఇవ్వాలని కోరగా అవి బుద్దా వెంకన్న వద్ద ఉన్నాయని చెప్పాడని పేర్కొన్నారు. తన ఆస్తి కాగితాలు తనకు ఇవ్వాలని పలుమార్లు కోరగా... భాస్కరరావు తనతో ఆస్తి కొనుగోలు చేసినట్లు కాగితాల్లో రాయించుకున్నట్లు తెలిసిందని చెప్పారు. దీంతో ఆయనను నిలదీయగా తీవ్ర పదజాలాలతో దూషించి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని, ఆస్తి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కలవగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని వివరించారు. ఆ తరువాత నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించగా ఆయన భాస్కరరావును పిలిపించి మాట్లాడుగా ఆయన కొనుగోలు చేసినట్లు దస్తావేజులు చూపించారని తెలిపారు. దీనిపైతమకు న్యాయం చేయాలని కోరామన్నారు. అప్పు చెల్లించేస్తాం, ఇంటి కాగితాలు ఇప్పించాలని వేడుకున్నామన్నారు. రూ.80లక్షలు విలువ చేసే ఆస్తిని నాలుగు లక్షలకు తీసుకోవడంతో ఏం చేయాలో తమకు తెలియడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చామని హనుమంతరావు వివరించారు. -
చంద్రబాబుకు చేదు అనుభవం
-
చంద్రబాబుకు చేదు అనుభవం
విజయవాడ: రాష్ట్రస్థాయి పుష్ప, ఫల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ఎదుట కాల్ మనీ బాధితులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలే కాల్ మనీ వ్యాపారులుగా మారి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బంధువులు నుంచి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. బాధితుల ఆందోళనతో చంద్రబాబు అవాక్కయ్యారు. సభలో అల్లరి చేయొద్దంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలవాలని బాధితులకు సూచించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాల్ మనీ బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. చంద్రబాబు ఎదుట నినాదాలు చేసిన శివరామ్ అనే యువకుడిని సీఎం వెళ్లిపోయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అప్పుతీర్చాలంటూ వేధింపులు...
-
'కాల్‌మనీ బాధితులకు న్యాయం చేస్తాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్వవహారంలో బాధితులకు న్యాయం చేస్తామని కమిషనరేట్ శాంతి భద్రతల విభాగం డీసీపీ లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు హామీ ఇచ్చారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన విజయవాడలో పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదులకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై 400 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అధిక వడ్డీతో మోసపోయామని ఎక్కువమంది ఫిర్యాదులు చేశారని ఆయన తెలిపారు. ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని డీసీపీ కాళిదాసు చెప్పారు. -
కాల్ మనీ బాధితుల ఫిర్యాదుల వెల్లువ
విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కాల్ మనీ బాధితులు భారీగా క్యూ కట్టారు. మంగళవారం ఒక్కరోజే పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కాల్ మనీ వ్యాపారులు వేలల్లో డబ్బులు అప్పుగా ఇచ్చి లక్షల్లో వసూలు చేయడంతో పాటు భయాభ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులకు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. తమ ఆస్తి డాక్యుమెంట్లతో పాటు బ్యాంకు చెక్కులను తీసుకున్నారని బాధితులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదుల్లో రాజకీయ నాయకుల అనుచరుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కేఎల్ రావు నగర్‌కు చెందిన వెంకటేశ్వరమూర్తి కాల్ మనీ వ్యాపారి శివ వేధిస్తున్నాడని రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చి రూ.18 లక్షలు కట్టించుకున్నాడని ఇంకా వేధింపులకు గురిచేస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపాడు. రాత్రి వేళల్లో వ్యాపారుల అనుచరులు ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని యనమలకుదురుకు చెందిన బాధితురాలు మాధవీలత ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు దృష్టికి తీసుకువచ్చింది. ఎమ్మెల్యే వంశీ అనుచరుడు ప్రభాకర్చే ఒత్తిడి తెస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. రూ.13 లక్షలు అప్పుగా ఇచ్చి కోటి ముప్పై లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చారని వాపోయింది. కాల్ మనీ మహిళా వ్యాపారులు సూర్యదేవర పద్మ, నాగరత్నం, ప్రమీలపై భవానీపురానికి చెందిన బాధితురాలు శివకుమారి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలకు రూ.30 లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపిస్తుంది. మరో వ్యాపారి మహేంద్రపై బాధితురాలు చెరుకూరి కుమారి ఫిర్యాదు చేశారు. రూ.50 వేలు అప్పుగా ఇచ్చి లక్షన్నర కట్టినా ఇంకా రూ.2 లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. వేధింపులు భరించలేక విజయవాడ వదిలి వెళ్లిపోయానని కుమారి పోలీసులకు చెప్పింది. వ్యాపారి మానేపల్లి రణధీర్పై బాధితుడు కిరణ్ ఫిర్యాదు చేశాడు.