Campa Cola compound
-
‘క్యాంపాకోలా’ వ్యవహారం..
అక్రమ కనెక్షన్ల తొలగింపు పూర్తి సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్ల వంట గ్యాస్, నీటి, విద్యుత్ కనెక్షన్లు తొలగించే పనులు మహానగర పాలక సంస్థ(బీఎంసీ) ఎట్టకేలకు పూర్తిచేసింది. అక్రమ ఫ్లాట్లను ఎప్పుడు కూలుస్తారనే దానిపై అందరూ దృష్టిసారించారు. అనుమతి లేకుండా నిర్మించిన సుమారు 102 ఫ్లాట్లను కూల్చివేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆందోళనలు నిర్వహించారు. చివరకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల ఇచ్చిన హామీతో ఆందోళన విరమించుకున్న విషయం తెలిసిందే. దీంతో వాటిని కూల్చేందుకు బీఎంసీ అధికారులకు మార్గం సుగమమైంది. వాటిని కూల్చేముందు వంద ఫ్లాట్లకు ఇచ్చిన నీటి కనెక్షన్లు, 51 ఇళ్లకు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు, 90 ఇళ్లకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను తొలగించాల్సి వచ్చింది. కాని నీటి కనెక్షన్లకు సంబంధించిన మ్యాప్ బీఎంసీ వద్ద లేకపోవడంతో ఏ కనెక్షన్ ఎటు వెళ్లిందో అర్థంకాక సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు వారం రోజులపాటు నానా తంటాలుపడి కనెక్షన్లు తొలగింపు పనులు పూర్తి చేశారు. అందుకు సంబంధించిన నివేదిక అక్రమ కట్టడాల నిరోధక శాఖ అధికారులు సోమవారం బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేకు సమర్పించనున్నారు. ఆ తర్వాత కూల్చివేత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్పారు. -
క్యాంపాకోలాలో కొత్త చిక్కులు
- నీటిపైపుల తొలగింపులో గందరగోళం - ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్లిందో తెలియని స్థితి - అప్పటి మ్యాప్ లేకపోవడమే కారణం - కూల్చివేతలకు మరికొన్ని రోజులు సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను కూల్చివేసేందుకు ముంబై మహానగర పాలక సంస్థ(బీఎంసీ) అధికారులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటిదాకా స్థానికులు అడ్డుపడగా ముఖ్యమంత్రి చొరవతో వారు వెనక్కు తగ్గారు. దీంతో ఇక చకచకా కూల్చివేతల పనులు కానిచ్చేద్దామని భావించిన అధికారులకు నీటిపైపుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్తుందో తెలియక తికమకపడుతున్నారు. అందుకు కారణం ఈ భవనాలు నిర్మించినప్పటి మ్యాప్ ప్రస్తుతం బీఎంసీ వద్ద అందుబాటులో లేకపోవడమే. నీటి సరఫరాకు సంబంధించిన మ్యాప్ తమ వద్ద లేదని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా స్వయంగా అంగీకరించారు. విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తొలగించడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోయినా నీటి పైపుల తొలగింపు విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ కనెక్షన్ తొలగిస్తే ఏ ఫ్లాట్‌కు నీటి సరఫరా నిలిచిపోతుందో తెలియడం లేదని, నీటి పైపులు తొలగించకుండా కూల్చివేతల పనులు మొదలు పెట్టడం సాధ్యం కాదని, దీంతో మరికొన్ని రోజులపాటు అక్రమ ఫ్లాట్ల కూల్చివేత పనులు జరిగే పరిస్థితి లేదంటున్నారు. మిడ్‌టౌన్ అపార్ట్మెంట్లో 20 అంతస్తులు, ఆర్కిడ్ అపార్ట్మెంట్లో 17 అంతస్తులు, ఈషా ఏక్తా అపార్ట్మెంట్లో 8 అంతస్తులు, శుభ్ అపార్టుమెంట్ అపార్ట్మెంట్లో 7 అంతస్తులు, పటేల్ అపార్ట్మెంట్స్, ఏ వింగ్‌లో 6 అంతస్తులు, పటేల్ అపార్ట్మెంట్స్, బి వింగ్ లో 6 అంతస్తులు, బి.వై.అపార్ట్‌మెంట్స్‌లో 6 అంతస్తులున్నాయి.. ఇక్కడ ఐదు అంతస్తుల వరకే అనుమతి ఉంది. ఆపై నిర్మించిన అంతస్తులకు నీటి కనెక్షన్లు కూడా అక్రమంగా ఇచ్చినవే కావడంతో వీటిని ఎక్కడి నుంచి, ఎలా ఇచ్చారనేది గుర్తించాలంటే చాలా సమయం పడుతుందని రాజీవ్ జలోటా పేర్కొన్నారు. -
క్యాంపాకోలా కూల్చివేత చిత్రీకరణ
అడ్డుకునేవారిపై చర్యలు తీసుకునేందుకే.. ముంబై: క్యాంపాకోలా విషయంలో ముంబై మహానగర పాలక సంస్థ(ఎంసీజీఎం) మరింత పట్టుదలగా వ్యవహరిస్తోంది. ఈ నెల 20 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభిస్తామని ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఎంసీజీఎం కూల్చివేత సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే విషయంపై దృష్టి సారించింది. తమ నివాసాలను కూల్చివేసేందుకు వస్తే అడ్డుకోవాలని ఇప్పటికే క్యాంపాకోలా వాసులు తీర్మానించుకోవడం తెలిసిందే. అయితే అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించి, అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకునేలా ఎంసీజీఎం వ్యూహరచన చేస్తోంది. కూల్చివేత సమయంలో వీడియో ద్వారా చిత్రీకరించాలని, ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే అందుకు సాక్ష్యాధారాలు ఉంటాయని, వారిపై చర్య తీసుకోవడం సులభమవుతుందని ఎంసీజీఎం భావిస్తోంది. ఈ విషయమై అదనపు మున్సిపల్ కమిషనర్ మోహన్ అద్తానీ మాట్లాడుతూ... ‘కూల్చివేత ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలతోచిత్రీకరించాలని నిర్ణయించాం. జూన్ 20 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎవరైనా అడ్డుపడితే వారు వీడియో కెమెరాలకు చిక్కాల్సిందే. అలా చిక్కినవారిపై కోట్టు ధిక్కారం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ముందుగా అక్రమ భవనాలకు విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాను నిలిపివేస్తాం. రెండో దశలో భవనంలోపలి ఫ్లాట్ల కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తాం. ఆ తర్వాత బాల్కనీలను కూల్చివేసే పనులు మొదలు పెడతాం. నిజానికి మంగళవారం నుంచే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే మానవీయ కోణంలో ఆలోచించి మరో రెండ్రోజులు సమయమిచ్చాం. ఈలోగా కూడా ఖాళీ చేయకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంద’న్నారు.