అక్రమ కనెక్షన్ల తొలగింపు పూర్తి
సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్ల వంట గ్యాస్, నీటి, విద్యుత్ కనెక్షన్లు తొలగించే పనులు మహానగర పాలక సంస్థ(బీఎంసీ) ఎట్టకేలకు పూర్తిచేసింది. అక్రమ ఫ్లాట్లను ఎప్పుడు కూలుస్తారనే దానిపై అందరూ దృష్టిసారించారు. అనుమతి లేకుండా నిర్మించిన సుమారు 102 ఫ్లాట్లను కూల్చివేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆందోళనలు నిర్వహించారు.
చివరకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల ఇచ్చిన హామీతో ఆందోళన విరమించుకున్న విషయం తెలిసిందే. దీంతో వాటిని కూల్చేందుకు బీఎంసీ అధికారులకు మార్గం సుగమమైంది. వాటిని కూల్చేముందు వంద ఫ్లాట్లకు ఇచ్చిన నీటి కనెక్షన్లు, 51 ఇళ్లకు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు, 90 ఇళ్లకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను తొలగించాల్సి వచ్చింది. కాని నీటి కనెక్షన్లకు సంబంధించిన మ్యాప్ బీఎంసీ వద్ద లేకపోవడంతో ఏ కనెక్షన్ ఎటు వెళ్లిందో అర్థంకాక సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
చివరకు వారం రోజులపాటు నానా తంటాలుపడి కనెక్షన్లు తొలగింపు పనులు పూర్తి చేశారు. అందుకు సంబంధించిన నివేదిక అక్రమ కట్టడాల నిరోధక శాఖ అధికారులు సోమవారం బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేకు సమర్పించనున్నారు. ఆ తర్వాత కూల్చివేత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్పారు.
‘క్యాంపాకోలా’ వ్యవహారం..
Published Sun, Jun 29 2014 11:14 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement