క్యాంపాకోలాలో కొత్త చిక్కులు
- నీటిపైపుల తొలగింపులో గందరగోళం
- ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్లిందో తెలియని స్థితి
- అప్పటి మ్యాప్ లేకపోవడమే కారణం
- కూల్చివేతలకు మరికొన్ని రోజులు
సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను కూల్చివేసేందుకు ముంబై మహానగర పాలక సంస్థ(బీఎంసీ) అధికారులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటిదాకా స్థానికులు అడ్డుపడగా ముఖ్యమంత్రి చొరవతో వారు వెనక్కు తగ్గారు. దీంతో ఇక చకచకా కూల్చివేతల పనులు కానిచ్చేద్దామని భావించిన అధికారులకు నీటిపైపుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్తుందో తెలియక తికమకపడుతున్నారు.
అందుకు కారణం ఈ భవనాలు నిర్మించినప్పటి మ్యాప్ ప్రస్తుతం బీఎంసీ వద్ద అందుబాటులో లేకపోవడమే. నీటి సరఫరాకు సంబంధించిన మ్యాప్ తమ వద్ద లేదని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా స్వయంగా అంగీకరించారు. విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తొలగించడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోయినా నీటి పైపుల తొలగింపు విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఏ కనెక్షన్ తొలగిస్తే ఏ ఫ్లాట్‌కు నీటి సరఫరా నిలిచిపోతుందో తెలియడం లేదని, నీటి పైపులు తొలగించకుండా కూల్చివేతల పనులు మొదలు పెట్టడం సాధ్యం కాదని, దీంతో మరికొన్ని రోజులపాటు అక్రమ ఫ్లాట్ల కూల్చివేత పనులు జరిగే పరిస్థితి లేదంటున్నారు. మిడ్‌టౌన్ అపార్ట్‌మెంట్‌లో 20 అంతస్తులు, ఆర్కిడ్ అపార్ట్‌మెంట్‌లో 17 అంతస్తులు, ఈషా ఏక్తా అపార్ట్‌మెంట్‌లో 8 అంతస్తులు, శుభ్ అపార్టుమెంట్ అపార్ట్‌మెంట్‌లో 7 అంతస్తులు, పటేల్ అపార్ట్‌మెంట్స్, ఏ వింగ్‌లో 6 అంతస్తులు, పటేల్ అపార్ట్‌మెంట్స్, బి వింగ్ లో 6 అంతస్తులు, బి.వై.అపార్ట్‌మెంట్స్‌లో 6 అంతస్తులున్నాయి.. ఇక్కడ ఐదు అంతస్తుల వరకే అనుమతి ఉంది. ఆపై నిర్మించిన అంతస్తులకు నీటి కనెక్షన్లు కూడా అక్రమంగా ఇచ్చినవే కావడంతో వీటిని ఎక్కడి నుంచి, ఎలా ఇచ్చారనేది గుర్తించాలంటే చాలా సమయం పడుతుందని రాజీవ్ జలోటా పేర్కొన్నారు.