చివరి ఆయకట్టుకు నీరందేనా!
మరమ్మతులు లేని కాల్వలు
రైతుల్లో ఆందోళన
పెగడపల్లి: మండలంలోని ఎస్సారెస్పీ కాల్వలు ఏళ్లతరబడిగా మరమ్మతులకు నోచుకోవడంలేదు. కాల్వల్లో చెట్లపొదలు పెరిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. పలుచోట్ల డ్రాపులు కూలాయి. ఎస్సారెస్సీ కాలువలకు నీటీని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఒక పక్కహర్షం వ్యక్తం అవుతుండగా, మరోపక్క కాల్వల్లో నిండిన పూడికమట్టి, పెరిగినచెట్లతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్నా డి–83ఏ కాలువ ద్వారా ఉపకాలువలకు నీరు సరఫరా కానుంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు నీరందించే ఆయకట్టు ఉంది. అయితే రెండేళ్లుగా ఎస్సారెస్సీ నీటివిడుదల కాకాపోవడంతో వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయి భూములన్నీ పడావులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీ నీటీవిడుదల పై రైతులు ఆశలు పెంచుకున్నారు. వర్షాలు కురువక పోతాయా? ఎస్సారెస్సీ నీరురాకపోతుందా అన్న దీమాతో మండల రైతాంగం వరి సాగుకు నార్లుపోసి సిద్ధంగా ఉంచారు. వీటిద్వారా తమ పంట పొలాలకు నీరు పారించుకుందామనుకుంటున్న సమయంలో కాలువలు సక్రమంగా లేక నీరు అందే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని డి–83ఏ ప్రాధాన కాలువ కింద 74, 75, 76, 77, 78, 79, 80, 81 డిస్ట్రిబ్యూటరీ కాలువలున్నాయి. డి76, 77 కాలువల కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఆర్ ఉపకాలువలున్నాయి. వీటి ద్వారా పెగడపల్లి, మద్దులపల్లి, బతికపల్లి, ఏల్లాపూర్, నంచర్ల, ల్యాగలమర్రి తదితర గ్రామాలకు ప్రదాన డిస్ట్రిబ్యూటరీ కాలువలుండగా, మిగతా గ్రామాల పంట పొలాలకు నీరు అందేవిధంగా ఉపకాల్వలు నిర్మించారు. ప్రస్తుత పరిస్థితిలో కాలువలు మరమ్మతులు లేక అధ్వానంగా తయారయ్యాయని మద్దులపల్లి, ఏడుమోటలపల్లి గ్రామాలకు చెందిన మ్యాక తిరుపతిరెడ్డి, సాయిని రవి తెలిపారు. నీటిæవిడుదలకు ముందుగా కాలువలు మరమ్మతు చేసినట్లయితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు.