canceling
-
India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా
న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ రాజుకుంటున్నాయి. గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య ప్రతినిధుల్ని వెనక్కి తీసుకునే వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కెనడాకు షాకిస్తూ భారత్ మరో నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ వీసాలను ఆపేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లకు రక్షణ లేదని, వాటికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే తాత్కాలికంగా వీసాలను నిలిపివేసినట్టుగా తెలిపింది. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని చెప్పింది. మరోవైపు కెనడాలో భారత్ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం సూచనల్ని కెనడా ప్రభుత్వం తిరస్కరించించి. ప్రపంచంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని పేర్కొంది. తమ దేశంలో భారత పౌరులకు వచ్చే ఇబ్బందేమీ లేదని పేర్కొంది. వీసాలు జారీ చేసే పరిస్థితి లేదు వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఏర్పాటైన ఒక ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురువారం నాడు తాత్కాలికంగా వీసాల పరిశీలన నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ కారణాలతోనే ఆపేస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతల కారణంగా వీసా దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలివ్వలేమని చెప్పారు. ‘‘కెనడా ప్రజలు భారత్ రాకుండా అడ్డుకోవాలన్నది మా విధానం కాదు. సరైన వీసాలు ఉన్న వారు (గతంలో వీసాలు మంజూరైన వారు) యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు. వారు ఎప్పుడైనా మన దేశానికి రావొచ్చు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల్ని సమీక్షిస్తామని, భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలకు రక్షణ ఉందని తేలితే వీసాల జారీ పునరుద్ధరిస్తామని బాగ్చి స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరాచకాల ఆధారాలన్నింటినీ ఆ ప్రభుత్వానికి ఇచ్చామని, 20–25 మందిని మన దేశానికి అప్పగించాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. నిజ్జర్ హత్య గురించి ఎలాంటి సమాచారం కెనడా పంచుకోలేదన్నారు. అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరిగిపోతోందని బాగ్చి చెప్పారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల విషయంలో సమానత్వం లేదన్నారు. ‘‘కెనడాలో ఉన్న భారతీయ దౌత్య వేత్తల కంటే, మన దేశంలో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ విషయాన్ని కెనడా దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. ఇక భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో అంచనాలు వేస్తున్నామని కెనడా హైకమిషన్ వెల్లడించింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తలకి బెదిరింపులు వస్తున్నాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య చండీగఢ్: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో మరో ఖలిస్తానీ మద్దతుదారు హత్య జరిగింది. పంజాబ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో ఒకరైన సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి సుఖ్దుల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. గ్యాంగ్ వార్‌లో భాగంగానే ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖ్దుల్ సింగ్‌పై మన దేశంలో హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. సుఖ్దుల్ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. పంజాబ్‌లోని మోగా జిల్లా దునెకె కలాన్ గ్రామానికి చెందిన సుఖ్దుల్ 2017 డిసెంబర్లో నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పరారయ్యాడు. -
12 నుంచి 21 వరకు ప్రత్యేక, బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. 3న గోకులాష్టమి ఆస్థానం.. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబర్ 3న రాత్రి 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం వేడుకగా నిర్వహించనున్నారు. -
టికెట్ వద్దా? ఆన్లైన్లో అమ్మెయ్!!
⇒ సినిమా, ట్రావెల్, ఈవెంట్స్ టికెట్లను విక్రయించే వీలు ⇒ సరికొత్త కాన్సెప్ట్‌తో ‘క్యాన్సెల్’ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్సు, సినిమా, ఈవెంట్ల టికెట్లు కొనడం మనకు తెలిసిందే. ఒకవేళ ఆ టికెట్లు వినియోగించుకోలేకపోతే? ఆ టికెట్లు మనకు వద్దనుకుంటే..? క్యాన్సిల్ చేసినందుకు కొంత చార్జీ భరించాలి. కానీ, పైసా చార్జీ లేకుండా మనం వద్దనుకున్న టికెట్లను ఉచితంగానే అమ్మిపెడుతోంది క్యాన్సెల్.ఇన్. సరికొత్త ఆలోచనతో బెంగళూరు కేంద్రంగా గతేడాది ప్రారంభమైన ఈ సంస్థ విశేషాలను కో–ఫౌండర్ రఘురాం ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ⇒ నేను, నవీన్, పవన్, సందీప్ నలుగురం స్నేహితులం. నవీన్ సింగపూర్‌లో పనిచేసేవాడు. తరచూ విదేశాలకు ప్రయాణించేవాడు. ఒకోసారి అనుకోకుండా ప్రయాణం రద్దయ్యేది. విమాన టికెట్లను క్యాన్సిల్ చేసిన ప్రతిసారీ జేబుకు చిల్లుపడేది. అది కంపెనీ డబ్బే అయినా మనసుకు బాధనిపించేది. కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ చేసుకున్నట్టుగా వద్దనుకున్నప్పుడు అలానే క్యాన్సిల్ చేసుకునే వీలుంటే బాగుండునని అనిపించేది. ఇదే విషయాన్ని మాతో చర్చించాడు. ఎవరో ఎందుకు మనమే ప్రారంభిస్తే పోలే... అనుకుని గతేడాది జనవరిలో క్యాన్సెల్.ఇన్ను ప్రారంభించాం. టెక్నాలజీ, మార్కెటింగ్‌కు రూ.15 లక్షల వరకు ఖర్చయింది. ⇒ చివరి క్షణంలో క్యాన్సిల్ అయిన టికెట్లను అమ్మి పెట్టడమే మా వ్యాపారం. అంటే మనకొద్దనుకున్న టికెట్లను క్యాన్సెల్ వేదికగా ఇతరులకు విక్రయించుకోవచ్చన్నమాట. దీంతో మన డబ్బులు మనకొచ్చేస్తాయి. సమయానికి ఇతరులకూ సాయం చేసినట్టవుతుంది. ప్రస్తుతం క్యాన్సెల్ వేదికగా ఈవెంట్లు, సినిమా, ట్రావెల్ టికెట్స్, గిఫ్ట్ ఓచర్లను విక్రయించుకోవచ్చు. ట్రావెల్ టికెట్స్‌లో బస్సు, ప్రైవేట్ వాహనాల టికెట్లు, టూర్ ప్యాకేజీలను విక్రయించుకోవచ్చు. ⇒ ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నాం. త్వరలోనే కొంత చార్జీ వసూలు చేసి ఆదాయార్జన ఆరంభిస్తాం. భవిష్యత్తులో హోటల్స్, విమాన టికెట్లు విక్రయిస్తాం కూడా. ఇప్పటికైతే లావాదేవీలు ఆశాజనకంగానే ఉన్నాయి. ⇒ దేశంలో ఆన్లైన్ టికెట్ పరిశ్రమ రూ.79 వేల కోట్లుగా ఉంది. ఇందులో క్యాన్సిలేషన్ వాటా 9 శాతం. అంటే రూ.7,110 కోట్లు. గిఫ్ట్ ఓచర్ల మార్కెట్ రూ.9 వేల కోట్లు. ఇందులో ఉపయోగించని ఓచర్లు 30 శాతం. అంటే రూ.3 వేల కోట్లు. వీటన్నిటినీ అందిపుచ్చుకోవాలన్నది మా ఉద్దేశం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...