టికెట్‌ వద్దా? ఆన్‌లైన్లో అమ్మెయ్‌!! | new startup company 'ticket cansell' | Sakshi
Sakshi News home page

టికెట్‌ వద్దా? ఆన్‌లైన్లో అమ్మెయ్‌!!

Published Sat, Mar 4 2017 12:34 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

టికెట్‌ వద్దా?  ఆన్‌లైన్లో అమ్మెయ్‌!! - Sakshi

టికెట్‌ వద్దా? ఆన్‌లైన్లో అమ్మెయ్‌!!

సినిమా, ట్రావెల్, ఈవెంట్స్‌ టికెట్లను విక్రయించే వీలు
సరికొత్త కాన్సెప్ట్‌తో ‘క్యాన్‌సెల్‌’ ప్రారంభం  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌లో బస్సు, సినిమా, ఈవెంట్ల టికెట్లు కొనడం మనకు తెలిసిందే. ఒకవేళ ఆ టికెట్లు వినియోగించుకోలేకపోతే? ఆ టికెట్లు మనకు వద్దనుకుంటే..? క్యాన్సిల్‌ చేసినందుకు కొంత చార్జీ భరించాలి. కానీ, పైసా చార్జీ లేకుండా మనం వద్దనుకున్న టికెట్లను ఉచితంగానే అమ్మిపెడుతోంది క్యాన్‌సెల్‌.ఇన్‌. సరికొత్త ఆలోచనతో బెంగళూరు కేంద్రంగా గతేడాది ప్రారంభమైన ఈ సంస్థ విశేషాలను కో–ఫౌండర్‌ రఘురాం ‘సాక్షి స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

నేను, నవీన్, పవన్, సందీప్‌ నలుగురం స్నేహితులం. నవీన్‌ సింగపూర్‌లో పనిచేసేవాడు. తరచూ విదేశాలకు ప్రయాణించేవాడు. ఒకోసారి అనుకోకుండా ప్రయాణం రద్దయ్యేది. విమాన టికెట్లను క్యాన్సిల్‌ చేసిన ప్రతిసారీ జేబుకు చిల్లుపడేది. అది కంపెనీ డబ్బే అయినా మనసుకు బాధనిపించేది. కావాలనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుకింగ్‌ చేసుకున్నట్టుగా వద్దనుకున్నప్పుడు అలానే క్యాన్సిల్‌ చేసుకునే వీలుంటే బాగుండునని అనిపించేది. ఇదే విషయాన్ని మాతో చర్చించాడు. ఎవరో ఎందుకు మనమే ప్రారంభిస్తే పోలే... అనుకుని గతేడాది జనవరిలో క్యాన్‌సెల్‌.ఇన్‌ను ప్రారంభించాం. టెక్నాలజీ, మార్కెటింగ్‌కు రూ.15 లక్షల వరకు ఖర్చయింది.

చివరి క్షణంలో క్యాన్సిల్‌ అయిన టికెట్లను అమ్మి పెట్టడమే మా వ్యాపారం. అంటే మనకొద్దనుకున్న టికెట్లను క్యాన్‌సెల్‌ వేదికగా ఇతరులకు విక్రయించుకోవచ్చన్నమాట. దీంతో మన డబ్బులు మనకొచ్చేస్తాయి. సమయానికి ఇతరులకూ సాయం చేసినట్టవుతుంది. ప్రస్తుతం క్యాన్‌సెల్‌ వేదికగా ఈవెంట్లు, సినిమా, ట్రావెల్‌ టికెట్స్, గిఫ్ట్‌ ఓచర్లను విక్రయించుకోవచ్చు. ట్రావెల్‌ టికెట్స్‌లో బస్సు, ప్రైవేట్‌ వాహనాల టికెట్లు, టూర్‌ ప్యాకేజీలను విక్రయించుకోవచ్చు.

ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నాం. త్వరలోనే కొంత చార్జీ వసూలు చేసి ఆదాయార్జన ఆరంభిస్తాం. భవిష్యత్తులో హోటల్స్, విమాన టికెట్లు విక్రయిస్తాం కూడా. ఇప్పటికైతే లావాదేవీలు ఆశాజనకంగానే ఉన్నాయి.
దేశంలో ఆన్‌లైన్‌ టికెట్‌ పరిశ్రమ రూ.79 వేల కోట్లుగా ఉంది. ఇందులో క్యాన్సిలేషన్‌ వాటా 9 శాతం. అంటే రూ.7,110 కోట్లు. గిఫ్ట్‌ ఓచర్ల మార్కెట్‌ రూ.9 వేల కోట్లు. ఇందులో ఉపయోగించని ఓచర్లు 30 శాతం. అంటే రూ.3 వేల కోట్లు. వీటన్నిటినీ అందిపుచ్చుకోవాలన్నది మా ఉద్దేశం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్‌ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement