India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా | India-Canada Relations: India suspends visa services for Canadians in further decline in relations | Sakshi
Sakshi News home page

India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా

Published Fri, Sep 22 2023 5:26 AM | Last Updated on Fri, Sep 22 2023 9:17 PM

India-Canada Relations: India suspends visa services for Canadians in further decline in relations - Sakshi

కెనడా రాజధాని అట్టావాలోని భారత హైకమిషన్‌ కార్యాలయం; ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌ కార్యాలయం

న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ రాజుకుంటున్నాయి. గత జూన్‌లో ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య ప్రతినిధుల్ని వెనక్కి తీసుకునే వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కెనడాకు షాకిస్తూ భారత్‌ మరో నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసింది.

భద్రతా కారణాల రీత్యా ఈ వీసాలను ఆపేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లకు  రక్షణ లేదని, వాటికి  బెదిరింపులు వస్తున్నాయని అందుకే తాత్కాలికంగా వీసాలను నిలిపివేసినట్టుగా తెలిపింది. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని చెప్పింది. మరోవైపు కెనడాలో భారత్‌ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం సూచనల్ని కెనడా ప్రభుత్వం తిరస్కరించించి. ప్రపంచంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని పేర్కొంది. తమ దేశంలో భారత పౌరులకు వచ్చే ఇబ్బందేమీ లేదని పేర్కొంది.

వీసాలు జారీ చేసే పరిస్థితి లేదు
వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఏర్పాటైన ఒక ప్రైవేటు ఏజెన్సీ బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ గురువారం నాడు తాత్కాలికంగా వీసాల పరిశీలన నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ కారణాలతోనే ఆపేస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతల కారణంగా వీసా దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు.

ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలివ్వలేమని చెప్పారు. ‘‘కెనడా ప్రజలు భారత్‌ రాకుండా అడ్డుకోవాలన్నది మా విధానం కాదు. సరైన వీసాలు ఉన్న వారు (గతంలో వీసాలు మంజూరైన వారు) యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు. వారు ఎప్పుడైనా మన దేశానికి రావొచ్చు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్‌ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల్ని సమీక్షిస్తామని, భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలకు రక్షణ ఉందని తేలితే వీసాల జారీ పునరుద్ధరిస్తామని బాగ్చి స్పష్టం చేశారు.

ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా
కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి  బాగ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. కెనడాలో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల అరాచకాల ఆధారాలన్నింటినీ ఆ ప్రభుత్వానికి ఇచ్చామని, 20–25 మందిని మన దేశానికి అప్పగించాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని  ట్రూడో చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. నిజ్జర్‌ హత్య గురించి ఎలాంటి సమాచారం కెనడా పంచుకోలేదన్నారు.

అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం
భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరిగిపోతోందని బాగ్చి చెప్పారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల విషయంలో సమానత్వం లేదన్నారు. ‘‘కెనడాలో ఉన్న భారతీయ దౌత్య వేత్తల కంటే, మన దేశంలో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ విషయాన్ని కెనడా దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. ఇక భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో అంచనాలు వేస్తున్నామని కెనడా హైకమిషన్‌ వెల్లడించింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తలకి బెదిరింపులు వస్తున్నాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉందన్నారు.  

కెనడాలో మరో ఖలిస్తాన్‌ ఉగ్రవాది హత్య
చండీగఢ్‌: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో మరో ఖలిస్తానీ మద్దతుదారు హత్య జరిగింది. పంజాబ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌లో ఒకరైన సుఖ్‌దుల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖ దునెకె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి సుఖ్‌దుల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. గ్యాంగ్‌ వార్‌లో భాగంగానే ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖ్‌దుల్‌ సింగ్‌పై  మన దేశంలో హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. సుఖ్‌దుల్‌ హత్య తమ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది.  పంజాబ్‌లోని మోగా జిల్లా దునెకె కలాన్‌ గ్రామానికి చెందిన సుఖ్‌దుల్‌ 2017 డిసెంబర్‌లో నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పరారయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement