ఆరోగ్యశ్రీలో 648 క్యాన్సర్ ప్రొసీజర్లు
సాక్షి, అమరావతి: క్యాన్సర్కు అత్యాధునిక వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలోని పేద రోగులకు ఎంతో మేలు చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఎంతో దార్శనికతతో క్యాన్సర్ నియంత్రణకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.
క్యాన్సర్ నివారణ–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు ఏడాదికి రూ.600 కోట్లకు పైగా నిధులు ఒక్క ఆరోగ్యశ్రీకే ఖర్చు చేస్తోందని తెలిపారు.
మొత్తం 648 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 క్యాన్సర్ కేర్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని, అన్ని ఆస్పత్రుల్లో చికిత్స ఏకీకృతంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో 5 శాతం బెడ్లు పాలియేటివ్ కేర్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
క్రమ పద్ధతిలో ఆస్పత్రుల అభివృద్ధి: నోరి దత్తాత్రేయుడు
ప్రతి టీచింగ్ ఆస్పత్రిలో క్యాన్సర్కు చికిత్సను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందని మంత్రి తెలిపారు. కర్నూలు, కడపలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు మొత్తం రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ రెండు చోట్లా క్యాన్సర్ కేర్ సెంటర్లు అక్టోబర్ చివరి కల్లా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గుంటూరులోని క్యాన్సర్ కేర్ సెంటర్ను కూడా తొలి విడతలోనే పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు.
రెండో విడతలో అనంతపూర్, కాకినాడల్లో క్యాన్సర్ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఏపీలో ఒక క్రమపద్ధతిన క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, క్యాన్సర్ చికిత్సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. దేశంలోనే క్యాన్సర్కు పూర్తి ఉచితంగా, అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంటుందని చెప్పారు.
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.