భక్తి శ్రద్ధలతో చంద్రపట్నం
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరలో భాగంగా మం గళవారం చంద్రపట్నం వేసే కార్యక్రమాన్ని యాదవ పూజారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్దగట్టు హక్కుదారులైన మెంతనబోయిన, మున్న, గొర్ల (రెడ్డి) వంశీయులు తెచ్చి న పూజా సామగ్రి, తెల్లపిండి, పచ్చపిండి, కుంకుమలతో క్రమ పద్ధతిలో దేవతా మూర్తు ల చిత్రాలను అచ్చుగా వేశారు. దానిపై పసు పు, కుంకుమ, తెల్లపిండి వేసి అందంగా అలంకరించారు. అనంతరం లింగమంతుల స్వామి విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను చంద్రపట్నంపై ఉంచి పూజలు చేశారు.
తర్వాత పట్నం ముందు బైకాన్లు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, కుడుక, పోకలు, ఖర్జూరాలు ఉంచి కల్యాణ తంతుకు అన్నీ సన్నద్ధం చేశారు. మెంతనబోయిన, మున్న, గొర్ల వం శాలకు చెందిన పెద్దలకు బైకాన్లు కంకణం కట్టి, బొట్టు అప్పగించారు. వివాహ ఘడియ దాటిపోయిందని లింగమంతుల కల్యాణం నిలిచిపోవడం, ఆ తర్వాత మెంతనబోయిన వారు కటార్లు, మున్న, గొర్ల వంశీయులు ఆసరాలు ఇచ్చే తంతు నిర్వహించారు. అనంతరం మెంతనబోయిన వంశీయులు పూజలు చేసి కేసారం గ్రామానికి పయనమయ్యారు. కార్యక్రమాలను కలెక్టర్ సురేంద్రమోహన్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డితోపాటు, ఇతర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిం చారు. చంద్రపట్నం చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నా రు. జాతరలో భాగంగా నాలుగో రోజైన బుధవారం నెలవారం నిర్వహించనున్నారు.