the capital of the
-
సమీకరణలో స్తబ్దత
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. అధికారులు మొదట్లో చేసిన హడావుడి ఇప్పుడు గ్రామాల్లో కనిపించటం లేదు. ఆది నుంచి అనుకూలంగా ఉన్న తుళ్లూరు మండలం మెట్టరైతుల నుంచి సైతం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు కలెక్టర్ కాంతి లాల్‌దండే ల్యాండ్ పూలింగ్ అధికారులతో ప్రతిరోజు సమీక్షిస్తున్నా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా రైతుల నుంచి తీసుకుంటున్న భూముల విస్తీర్ణం రోజు రోజుకు పెరగాల్సి ఉండగా, తగ్గుతోంది. సోమవారం 277 మంది రైతులు 560.31ఎకరాల భూములు ఇచ్చారు. ప్రక్రియ ప్రారంభమైన ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1779 మంది రైతులు 3,885.05 ఎకరాలను మాత్రమే ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. ముఖ్యంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతుల్లో భూములు ఇస్తే తామంతా ముఖ్యమంత్రి చేతిలో ఇరుక్కుపోతామనే ఆందోళన కనిపిస్తోంది. రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలు సమీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఎన్నో రోజులు పడుతుందని అప్పటివరకు తమ పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు మాటలు నమ్మి భూములు ఇస్తే రైతు రుణమాఫీ మాదిరి మరోసారి మోసపోవాల్సి వస్తుందనే భయంతో రైతులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగానే తుళ్లూరు మండలం మెట్ట రైతులు పెద్దగా ఆసక్తి చూపటం లేదంటున్నారు. దీంతో భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. జరీబు భూముల రైతులు మొదటి నుంచి ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో అత్మవిశ్వాసం నింపేందుకు సింగపూర్ బృందం పర్యటించిన ఆదివారం కూడా స్పందన కనిపించలేదు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోనే తిష్టవేసి వరాలు కురిపిస్తున్నా ఇవేమీ భూ సమీకర ణను ముందుకు సాగేలా చేయలేకపోతున్నాయి. సంక్రాంతి లోపు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలనే లక్ష్యంతో అధికారులు వడివడిగా అడుగులు వేసినా ఇప్పటి వరకు కేవలం 3,885.05 ఎకరాల భూమికి మాత్రమే 1,779 మంది రైతులు అంగీకార పత్రాలు సమర్పించారు. భూ సమీకరణకు సంబంధించి ఉద్దండ్రాయునిపాలెం, నవులూరు, నిడమర్రు రెండు యూనిట్లు, అబ్బురాజుపాలెంలో ఇంకా బోణీ కాలేదు. సోమవారం తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఈప్రక్రియ ప్రారంభమైంది. రాయపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, మల్కాపురంలో సైతం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జరీబు రైతుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపటం లేదు. అధికారుల సమావేశం వాయిదా... భూ సమీకరణపై జరీబు భూముల రైతుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదివారం రాయపూడిలో ఏర్పాటు చేసిన సమావేశం సైతం వాయిదా పడింది. తిరిగి సంక్రాంతి పండుగ తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ సుబ్బారావు రైతులకు సమాచారం అందజేశారు. ఇదిలావుండగా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సోమవారం తుళ్లూరు మండలంలో పర్యటించి భూ సమీకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ ప్రక్రియలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడు కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు సర్వేను ల్యాండ్స్ ఏడీ కిజిరియా కుమారి పరిశీలించి సిబ్బందికి తగుసూచనలు అందజేశారు. సోమవారం 277 మంది రైతులు 560.31ఎకరాల భూములు ఇవ్వగా, ఇప్పటివరకు మొత్తం 1,779 మంది రైతులు 3,885.05 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకార పత్రాలు సమర్పించినట్టు ఆర్డీవో భాస్కరనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. -
హడల్..!
స్వైన్ ఫ్లూ.. ఈ పేరు వింటేనే జిల్లా వాసులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం.. పొరుగు జిల్లా ప్రకాశంలో ఇటీవల ఈ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతి చెందడంతో భయాందోళనకు లోనవుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లాలోనే ఏర్పాట్లు జరుగుతుండటంతో హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ప్రతినిధుల రాకపోకలు పెరిగాయి. దీనికి తోడు రానున్న సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి బారిన ఎప్పుడు, ఎవరు పడాల్సివస్తుందోనని గడగడలాడుతున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాకు స్వైన్‌ఫ్లూ ముప్పు పొంచి ఉందా.. అనే ప్రశ్నకు వైద్య వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఇటీవల సుమారు 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో అక్కడ నుంచి వచ్చే వారికి ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయేమోనని జిల్లాప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాంణాంతక వ్యాధి అయినప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు మాత్రం చీమకుట్టిన ట్లు కూడా లేదు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని ఛాతి, ఊపిరితిత్తుల ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉండేది. విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఎక్కడా ఈ వ్యాధి నిర్ధరణ కేంద్రంగానీ, కనీసం పరికరాలుగానీ లేకపోవడం శోచనీయం. వ్యాధి లక్షణాలు ఉన్న రోగులు చికిత్స కోసం వస్తే వైద్యులు, సిబ్బంది ధరించేందుకు జిల్లాస్థాయి ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా కనీసం మెడికల్ కోటెడ్ మాస్క్‌లు సైతం లేకపోవడం బాధాకరం. రెండు వారాలుగా హైదరాబాద్‌లో నిత్యం స్వైన్‌ఫ్లూ కేసులు నమోదౌతున్నప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల్లో చలనంలేదు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమైంది. హైదరాబాద్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కూడా ఆరంభించలేదు. నవ్యాంధ్రలోనూ నమోదవుతున్న కేసులు... హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదౌతుండటంతో ఎక్కడ ఆ వ్యాధి మనకు వ్యాపిస్తుందోనని నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు భయపడ్డారు. దాన్ని నిజం చేస్తూ రెండు రోజులుగా రాజమండ్రి, కాకినాడల్లో ఇద్దరు యువతీ, యువకులకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. తాజాగా శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతుండగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పొరుగున ఉన్న గుంటూరు జిల్లా ప్రజలను మరింత వణికించింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ప్రజలు మండిపడుతున్నారు. జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తాం.. జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారికి చికిత్స చేసేందుకు గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేయాలని సూపరింటెండెంట్‌తో చర్చిస్తున్నాం. జ్వరం వచ్చి, దగ్గు, తుమ్ములు ఉన్నవారు ఇళ్లను వదలి బయటకు రావద్దు. ప్రకాశం జిల్లాలో జరిగిన సంఘటనతో అప్రమత్తమయ్యాం. ప్రజలు సహకరించాలి. - డాక్టర్ షాలినీదేవి, వైద్య, ఆరోగ్యశాఖ ఆర్డీ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఇవీ... హెచ్వన్, ఎన్‌వన్ అనే వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రోగ లక్షణం మొదట సాధారణ జ్వరం మాదిరిగా ఉంటుంది. నాలుగు రోజులు దాటినా జ్వరం తగ్గకుండా దగ్గు, జలుబు తోడవుతుంది. ఆయాసం ఎక్కువై ఊపిరాడని స్థితి ఏర్పడుతుంది. వీరికి వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ను అందించాలి. చికిత్స చేసే వారు సైతం మెడికల్ కోటెడ్ మాస్క్‌లను ధరించి రోగిని తాకకుండా ఉండాలి. వ్యాధి లక్షణాలు ఉన్న వారు దగ్గినా, తుమ్మినా, వారిని తాకినా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. -
‘దేశం' దౌర్జన్యం
అరండల్‌పేట(గుంటూరు)/తుళ్లూరు: తుళ్లూరులో శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అదేమంటే రాజధాని రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాము తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, భూ సమీకరణలో నష్టపోతున్న వారికి అండగా ఉండేందుకే సభ నిర్వహిస్తున్నామని వామ పక్ష నాయకులు చెబుతున్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్ర వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌పార్టీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులపై దాడులకు దిగినట్టుగానే పది వామ పక్ష నాయకుల సభను అడ్డుకున్నారు. తుళ్లూరులో శుక్రవారం పది వామపక్షాల నాయకులు నిర్వహించిన బహిరంగసభను అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అడుగడుగునా సభకు ఆటంకాలు కల్పించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా సభను నిర్వహిస్తుండటంతో ఓర్చుకోలేని కార్యకర్తలు వామపక్షాల నాయకులు గోబ్యాక్ అంటూ ఒక్కసారిగా సభావేదిక వద్దకు వచ్చారు. చంద్రబాబునాయుడు జిందాబాద్, టీడీపీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. వారిని వామపక్షాల నాయకులు సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కనిపించకుండా పోయారు. గొడవ పెద్దది కావడంతో ఎస్ఐతో పాటు మరికొద్ది మంది పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. మధ్యలోనే వామపక్షాల నాయకులు సభను ముగించి వెళ్లిపోయారు. తుళ్లూరులో ఇతర పార్టీ నాయకులపై వరసగా దాడులు జరుగుతున్నా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ సభ నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ముందస్తు అనుమతి సైతం తీసుకోలేదని చెబుతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. తాము ఇక్కడ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని చెబుతున్నా దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులను తాము ఎన్నో చూశామని, కూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేయడం తప్పు ఎలా అవుతుందన్నారు. కొంతమంది నాయకులతో చంద్రబాబు ఇలా చేయిస్తున్నారని ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజధాని భూసమీకరణలో నష్టపోతున్న కౌలురైతులు, కూలీలు, చేతివృత్తుల వారికి చట్టప్రకారం రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేకుంటే ప్రజాపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సొంత వ్యవహారంలా రాజధాని అంశం మారిపోయిందన్నారు. ప్రజలతో, ప్రతిపక్షాలతో చర్చించకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని కోసం నిధుల సమీకరణకు చంద్రబాబు మన దేశ ప్రధాని వద్దకు వెళ్లకుండా సింగపూర్ ప్రధాని వద్దకు ఎందుకు వెళ్లారన్నారని ప్రశ్నించారు. ఇక్కడ సేకరించే 30వేల ఎకరాల్లో 6 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీకి అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా 30వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించలేదన్నారు. ఒక విధానపత్రం విడుదల చేయకుండా ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, రైతుకూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడేందుకు పోరాటాలు చేస్తామన్నారు. తిరిగి మరోసారి తుళ్లూరు వస్తామాన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ విల్సన్, వామపక్షాల నాయకులు కోటయ్య, రమాదేవి, హరనాధ్, గుర్రం విజయ్‌కుమార్, సింహాద్రి లక్ష్మీనారాయణ, తూమాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
సొంతింట్లో భూసెగలు
భూముల సమీకరణకు వ్యతిరేకంగా టీడీపీ గ్రామాల్లో తీర్మానాలు ప్రకృతి విపత్తుకు ఎవరైనా తలవంచాలి...తలదాచుకోవాలి. మానవ కల్పిత విపత్తుకు తలవంచినా...తలదించినా ఉత్పన్నమయ్యేది ఉపద్రవమే. మిగిలేది శూన్యమే. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో తెలుగుదేశం ప్రభుత్వం భూ సమీకరణ పేరిట మానవ కల్పిత విపత్తులకు పాల్పడుతోంది. మట్టి నుంచి మాణిక్యాలు పండించే రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అదే మట్టి నుంచి ధాన్యం రాశులు సృష్టించి దేశం ఆకలి తీర్చే అన్నదాతలను కూలీలుగా మార్చే తెలుగుదేశం ప్రభుత్వ పన్నాగాలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు నవ్యాంధ్ర రాజధానికి అవసరమైన భూ సమీకరణకు టీడీపీ గెలుపొందిన గ్రామ పంచాయతీ ల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన వార్డు సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని పభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఆవివరాలను రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి పంపుతున్నారు. మిగిలిన పంచాయతీలు సైతం టీడీపీ గ్రామాల బాటలో నడిచే ఆలోచనకు వస్తున్నాయి. ఇప్పటికే రైతు కమిటీల ఆధ్వర్యంలో సమావేశమవుతున్న వ్యవసాయ కార్మికులు, రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనంటున్నారు. అవసరమైతే ప్రాణాలర్పిస్తామంటున్నారు. తమ శవాలపై నుంచే భూ సమీకరణ జరగాల్సిందే తప్ప, ప్రాణం ఉండగా భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెపుతున్నారు. రాజధాని నిర్మాణానికి తొలి విడతగా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 18 గ్రామాల్లో భూముల సమీకరణకు (ల్యాండ్ పూలింగ్) ఫ్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుళ్లూరు మండలంలో 15, మంగళగిరి మండలంలో 3 గ్రామాలను ఎంపిక చేశారు. తుళ్లూరు మండలంలో వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, శాఖమూరు, తుళ్లూరు, రాయపూడి, బోరుపాలెం, దొండపాడు,అబ్బరాజు పాలెం, నేలపాడు, మల్కాపురం, నెక్కల్లు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో శాఖమూరు, బోరుపాలెం మినహా అన్నీ టీడీపీ గ్రామ పంచాయతీలు. మంగళగిరి మండలంలో కురగల్లు, నిడమర్రు, నీరుకొండ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నీరుకొండ పంచాయతీ టీడీపీ కాగా, కురగల్లు,నిడమర్రు వైఎస్సార్సీపీ ఆధిపత్యం వహిస్తున్న గ్రామాలు. ఇక్కడ అంతా ఆశ్చర్యపడుతున్న విషయమేమంటే, తుళ్లూరు మండలంలోని అన్ని పంచాయతీలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు రేయింబవళ్లు పనిచేయడమే కాకుండా, తమ కుటుంబ సభ్యుడే ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా ఓటర్లకు పలావు ప్యాకెట్లు, లిక్కరు బాటిళ్లు సరఫరా చేశాయి. ఆ గ్రామాల కృషితో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ తాడికొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనను తమ ఇంట్లో మనిషిగానే ఆయా గ్రామాల వారంతా భావిస్తుంటారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునూ అదే దృష్టితో చూస్తుంటారు. తమ సహకారంతో, తమ ఓట్లతో గెలిచిన టీడీపీ ప్రభుత్వం ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన రీతిలో వ్యవహరిస్తోందని ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రభుత్వ పనితీరు చూస్తుంటే, తమ కళ్లను తామే పొడుచుకున్నట్టుగా ఉందని వాపోతున్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయని పక్షంలో, పార్టీని గెలిపించిన తమకు ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తొలి అడుగుగా రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, బోరుపాలెం పంచాయతీల్లోని వార్డు సభ్యులంతా సర్పంచ్ల అధ్యక్షతన సమావేశమై భూ సమీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వ్యవసాయం, రైతుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల వివరాలతో కూడిన ఒక నివేదికను రాష్ట్రప్రతి, ప్రధానమంత్రికి పంపారు. మరో వైపు న్యాయపోరాటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీపీ మల్లెల హరేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వ నిర్ణయంపై అవగాహన కలిగిస్తున్నారు. మంగళగిరి మండలంలోని కురగల్లు, నిడమర్రు రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతి రేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు పాలన కోసం పదేళ్ల నుంచి ఎదురుచూసిన సొంత సామాజికవర్గానికి కూడా ప్రభుత్వ నిర్ణయం రుచించడం లేదు. మొదట్లో ఆ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించ కపోయినా, జరగనున్న నష్టాన్ని, ఉపద్రవాన్ని తలచుకుని బెంబేలెత్తుతున్నారు.