సొంతింట్లో భూసెగలు
భూముల సమీకరణకు వ్యతిరేకంగా టీడీపీ గ్రామాల్లో తీర్మానాలు
ప్రకృతి విపత్తుకు ఎవరైనా తలవంచాలి...తలదాచుకోవాలి. మానవ కల్పిత విపత్తుకు తలవంచినా...తలదించినా ఉత్పన్నమయ్యేది ఉపద్రవమే. మిగిలేది శూన్యమే. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో తెలుగుదేశం ప్రభుత్వం భూ సమీకరణ పేరిట మానవ కల్పిత విపత్తులకు పాల్పడుతోంది. మట్టి నుంచి మాణిక్యాలు పండించే రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అదే మట్టి నుంచి ధాన్యం రాశులు సృష్టించి దేశం ఆకలి తీర్చే అన్నదాతలను కూలీలుగా మార్చే తెలుగుదేశం ప్రభుత్వ పన్నాగాలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు
నవ్యాంధ్ర రాజధానికి అవసరమైన భూ సమీకరణకు టీడీపీ గెలుపొందిన గ్రామ పంచాయతీ ల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన వార్డు సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని పభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఆవివరాలను రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి పంపుతున్నారు.
మిగిలిన పంచాయతీలు సైతం టీడీపీ గ్రామాల బాటలో నడిచే ఆలోచనకు వస్తున్నాయి. ఇప్పటికే రైతు కమిటీల ఆధ్వర్యంలో సమావేశమవుతున్న వ్యవసాయ కార్మికులు, రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనంటున్నారు.
అవసరమైతే ప్రాణాలర్పిస్తామంటున్నారు. తమ శవాలపై నుంచే భూ సమీకరణ జరగాల్సిందే తప్ప, ప్రాణం ఉండగా భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెపుతున్నారు.
రాజధాని నిర్మాణానికి తొలి విడతగా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 18 గ్రామాల్లో భూముల సమీకరణకు (ల్యాండ్ పూలింగ్) ఫ్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తుళ్లూరు మండలంలో 15, మంగళగిరి మండలంలో 3 గ్రామాలను ఎంపిక చేశారు. తుళ్లూరు మండలంలో వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, శాఖమూరు, తుళ్లూరు, రాయపూడి, బోరుపాలెం, దొండపాడు,అబ్బరాజు పాలెం, నేలపాడు, మల్కాపురం, నెక్కల్లు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో శాఖమూరు, బోరుపాలెం మినహా అన్నీ టీడీపీ గ్రామ పంచాయతీలు.
మంగళగిరి మండలంలో కురగల్లు, నిడమర్రు, నీరుకొండ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నీరుకొండ పంచాయతీ టీడీపీ కాగా, కురగల్లు,నిడమర్రు వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం వహిస్తున్న గ్రామాలు.
ఇక్కడ అంతా ఆశ్చర్యపడుతున్న విషయమేమంటే, తుళ్లూరు మండలంలోని అన్ని పంచాయతీలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు రేయింబవళ్లు పనిచేయడమే కాకుండా, తమ కుటుంబ సభ్యుడే ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా ఓటర్లకు పలావు ప్యాకెట్లు, లిక్కరు బాటిళ్లు సరఫరా చేశాయి. ఆ గ్రామాల కృషితో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ తాడికొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనను తమ ఇంట్లో మనిషిగానే ఆయా గ్రామాల వారంతా భావిస్తుంటారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునూ అదే దృష్టితో చూస్తుంటారు.
తమ సహకారంతో, తమ ఓట్లతో గెలిచిన టీడీపీ ప్రభుత్వం ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన రీతిలో వ్యవహరిస్తోందని ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రభుత్వ పనితీరు చూస్తుంటే, తమ కళ్లను తామే పొడుచుకున్నట్టుగా ఉందని వాపోతున్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయని పక్షంలో, పార్టీని గెలిపించిన తమకు ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇందుకు అనుగుణంగానే తొలి అడుగుగా రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, బోరుపాలెం పంచాయతీల్లోని వార్డు సభ్యులంతా సర్పంచ్‌ల అధ్యక్షతన సమావేశమై భూ సమీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వ్యవసాయం, రైతుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల వివరాలతో కూడిన ఒక నివేదికను రాష్ట్రప్రతి, ప్రధానమంత్రికి పంపారు.
మరో వైపు న్యాయపోరాటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీపీ మల్లెల హరేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వ నిర్ణయంపై అవగాహన కలిగిస్తున్నారు.
మంగళగిరి మండలంలోని కురగల్లు, నిడమర్రు రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతి రేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
చంద్రబాబు పాలన కోసం పదేళ్ల నుంచి ఎదురుచూసిన సొంత సామాజికవర్గానికి కూడా ప్రభుత్వ నిర్ణయం రుచించడం లేదు. మొదట్లో ఆ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించ కపోయినా, జరగనున్న నష్టాన్ని, ఉపద్రవాన్ని తలచుకుని బెంబేలెత్తుతున్నారు.