హడల్..! | Huddle ..! | Sakshi
Sakshi News home page

హడల్..!

Published Sun, Jan 11 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

హడల్..!

హడల్..!

స్వైన్ ఫ్లూ.. ఈ పేరు వింటేనే జిల్లా వాసులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం.. పొరుగు జిల్లా ప్రకాశంలో ఇటీవల ఈ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతి చెందడంతో భయాందోళనకు లోనవుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లాలోనే ఏర్పాట్లు జరుగుతుండటంతో హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ప్రతినిధుల రాకపోకలు పెరిగాయి. దీనికి తోడు రానున్న సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి బారిన ఎప్పుడు, ఎవరు పడాల్సివస్తుందోనని గడగడలాడుతున్నారు.
 
సాక్షి, గుంటూరు: జిల్లాకు స్వైన్‌ఫ్లూ ముప్పు పొంచి ఉందా.. అనే ప్రశ్నకు వైద్య వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఇటీవల సుమారు 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో అక్కడ నుంచి వచ్చే వారికి ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయేమోనని జిల్లాప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాంణాంతక వ్యాధి అయినప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు మాత్రం చీమకుట్టిన ట్లు కూడా లేదు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని ఛాతి, ఊపిరితిత్తుల ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉండేది.

విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఎక్కడా ఈ వ్యాధి నిర్ధరణ కేంద్రంగానీ, కనీసం పరికరాలుగానీ లేకపోవడం శోచనీయం. వ్యాధి లక్షణాలు ఉన్న రోగులు చికిత్స కోసం వస్తే వైద్యులు, సిబ్బంది ధరించేందుకు జిల్లాస్థాయి ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా కనీసం మెడికల్ కోటెడ్ మాస్క్‌లు సైతం లేకపోవడం బాధాకరం. రెండు వారాలుగా హైదరాబాద్‌లో నిత్యం స్వైన్‌ఫ్లూ కేసులు నమోదౌతున్నప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల్లో చలనంలేదు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమైంది. హైదరాబాద్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కూడా ఆరంభించలేదు.
 
నవ్యాంధ్రలోనూ నమోదవుతున్న కేసులు...
హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదౌతుండటంతో ఎక్కడ ఆ వ్యాధి మనకు వ్యాపిస్తుందోనని నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు భయపడ్డారు. దాన్ని నిజం చేస్తూ రెండు రోజులుగా రాజమండ్రి, కాకినాడల్లో ఇద్దరు యువతీ, యువకులకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. తాజాగా శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతుండగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పొరుగున ఉన్న గుంటూరు జిల్లా ప్రజలను మరింత వణికించింది.  వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ప్రజలు మండిపడుతున్నారు.
 
 జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తాం..
 జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారికి చికిత్స చేసేందుకు గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేయాలని సూపరింటెండెంట్‌తో చర్చిస్తున్నాం. జ్వరం వచ్చి, దగ్గు, తుమ్ములు ఉన్నవారు ఇళ్లను వదలి బయటకు రావద్దు. ప్రకాశం జిల్లాలో జరిగిన సంఘటనతో అప్రమత్తమయ్యాం. ప్రజలు సహకరించాలి.
 - డాక్టర్ షాలినీదేవి, వైద్య, ఆరోగ్యశాఖ ఆర్డీ
 
 స్వైన్ ఫ్లూ లక్షణాలు ఇవీ...
     హెచ్‌వన్, ఎన్‌వన్ అనే వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
     రోగ లక్షణం మొదట సాధారణ జ్వరం మాదిరిగా ఉంటుంది.
     నాలుగు రోజులు దాటినా జ్వరం తగ్గకుండా దగ్గు, జలుబు తోడవుతుంది.
     ఆయాసం ఎక్కువై ఊపిరాడని స్థితి ఏర్పడుతుంది. వీరికి వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ను అందించాలి.
     చికిత్స చేసే వారు సైతం మెడికల్ కోటెడ్ మాస్క్‌లను ధరించి రోగిని తాకకుండా ఉండాలి.
     వ్యాధి లక్షణాలు ఉన్న వారు దగ్గినా, తుమ్మినా, వారిని తాకినా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది.
     ముఖ్యంగా చలికాలం, వర్షాకాలాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement