3 రోజులు 'ఇంటి' సెలవు
ఇల్లు వెతుక్కోడానికి, పిల్లల అడ్మిషన్లకని వెల్లడి
ఐదు రోజుల పని దినాలు, 7.30 గంటల పని వేళలకు సీఎం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానిలో ఇంటి వసతి, పిల్లల అడ్మిషన్ల విషయంలో ఇక్కడి నుంచి తరలి వెళ్లే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు ఈ మూడు రోజుల ప్రత్యేక సెలవును ఉపయోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రహి బుధవారం జారీ చేసిన జీవోలో స్పష్టం చేశారు.
ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ ఆఖరులోగా ఎప్పుడైనా ఈ మూడు రోజుల సెలవులను ఉద్యోగులు వినియోగించుకోవచ్చని, దీని వల్ల పరిపాలన పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తబోవని జీవోలో పేర్కొన్నారు. ఒక సారి మాత్రమే ఈ సెలవులకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సెలవు మాత్రమే తీసుకోవాలని.. టీఏ, డీఏలకు అర్హత లేదని అందులో వివరించారు. ఇంటి వసతి, పిల్లల అడ్మిషన్లకు ఇబ్బంది పడకుండా ఉద్యోగులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోలని సూచించారు.
5 రోజుల పని దినాలకు సీఎం ఆమోదం
వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో పని చేయడానికి తరలి వెళ్లే ఉద్యోగులకు ఏడాది పాటు వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తాత్కాలిక సచివాలయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయాలన్న విషయానికి కూడా ఆమోదం తెలిపారు.
తరలింపు అలెవెన్స్ 75 శాతం
కొత్త రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులకు తరలింపు అలెవెన్స్గా 75 శాతం మంజూరు చేయాలని జీఏడీ నిర్ణయించింది. అంటే తరలింపునకయ్యే వ్యయంలో 75 శాతం మంజూరు చేయాలనేది ప్రభుత్వ భావనగా ఉంది. ఈ ఫైలును సాధారణ పరిపాలన శాఖ ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది. ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే తరలింపు అలెవెన్స్పై ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.