captain iryanto
-
కొద్ది క్షణాల ముందు.. సీటు వదిలివెళ్లిన కెప్టెన్!
సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా జెట్ విమాన పైలట్.. ఆ ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు ఆ విమాన పైలట్.. తన సీటు వదిలి వెళ్లిపోయారట! ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి కో-పైలట్ విమానం మీద నియంత్రణ కోల్పోయారు. పైలట్ తిరిగి వచ్చేసరికే చాలా ఆలస్యం అయిపోయింది, విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని ఈ కేసు దర్యాప్తు చూసుకుంటున్న అధికారులు తెలిపారు. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ బస్ ఎ320 జెట్ విమానం డిసెంబర్ 28వ తేదీన జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 162 మంది మరణించారు. ఆ విమానంలో అప్పటికి వారం రోజులుగా ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ సమస్యలు ఉన్నాయి. విమానం కూలడానికి కొన్ని రోజుల ముందు కూడా ఇదే పైలట్.. ఇదే విమానాన్ని నడిపారు. అప్పుడూ ఈ సమస్య ఉంది. -
మా నాన్నను తప్పుపట్టొద్దు
విమానం కుప్పకూలిపోవడంలో తమ తండ్రిని తప్పు పట్టొద్దని ఎయిర్ ఏషియా విమాన పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజెలా చెబుతోంది. చిట్ట చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులో ప్రయాణికులను కాపాడేందుకే ప్రయత్నించారని, ఆమాటకొస్తే.. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణికులకు హాని కలిగించాలని అనుకోరని ఆమె చెప్పింది. పైగా కెప్టెన్ ఇర్యాంటో కూతురిగా తాను ఆ విషయాన్ని అసలు ఒప్పుకోనని తెలిపింది. ఆయన కూడా ప్రమాదంలో మరణించారని, ఇప్పటికి ఇంకా అసలాయన మృతదేహం కూడా లభించలేదని.. దాంతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని చెప్పింది. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం క్యూజడ్850లో సిబ్బంది సహా మొత్తం 162 మంది ఉండగా కేవలం 34 మృతదేహాలను మాత్రమే ఇంతవరకు వెలికితీశారు. బ్లాక్ బాక్స్ కూడా ఇంకా బయటపడలేదు. అది వస్తే తప్ప చివరి నిమిషంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే అవకాశం లేదు. ఈలోపు పైలట్ ఇర్యాంటోను తప్పుబట్టడం సరికాదని ఆయన కుమార్తె ఏంజెలా చెప్పింది. -
నాన్నా.. ప్లీజ్, ఇంటికి వచ్చెయ్యి!
నాన్న విమానంలో వెళ్లారు.. ఆ విమానం కనిపించడం లేదు.. దేవుడా.. మా నాన్నను ఇంటికి పంపు.. నాన్నా.. త్వరగా ఇంటికి వచ్చెయ్యి అంటూ ఎయిర్ ఏషియా విమాన పైలట్ కెప్టెన్ ఇర్యాంటో కూతురు ఏంజెలా తన తండ్రి కోసం ప్రార్థిస్తోంది. తన ప్రార్థనను తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కూడా పోస్ట్ చేసింది. ఇండోనేషియాకు చెందిన ఇర్యాంటోతో పాటు ఫ్రాన్సుకు చెందిన మరో కో-పైలట్, ఐదుగురు కేబిన్ సిబ్బంది, 155 మంది ప్రయాణికులతో కూడిన విమానం తీవ్రమైన పొగమంచులో చిక్కుకుని.. ఆ తర్వాత కనపడకుండా అదృశ్యం అయిపోయిన విషయం తెలిసిందే. ప్రయాణికుల్లో ఒక పసికందు, 16 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ''నాన్నా.. ఇంటికి వచ్చెయ్యి.. నాకు నువ్వు కావాలి'' అని కెప్టెన్ ఇర్యాంటో కూతురు ఏంజెలా యాంగీ (22) తన పాత్ పేజిలో పోస్ట్ చేసింది. ఇది ఇండోనేషియా మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. మా నాన్నను ఎవరైనా వెనక్కి తీసుకురండి అంటూ ఆమె చేసిన ఆక్రందన అందరి హృదయాలను కదిలించింది. ఆయన చాలా మంచి మనిషని, అందుకే గత రెండేళ్లుగా తమ ప్రాంత నైబర్హుడ్ చీఫ్గా ఆయన్నే ఎన్నుకొంటున్నారని ఇర్యాంటో పొరుగింటి స్నేహితుడు బాగియాంటో జోయోనెగోరో చెప్పారు. గతంలో వైమానిక దళంలో పనిచేసిన ఆయన ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా నడిపించారు.