బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
కోచ్ పదవిపై ద్రవిడ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత సీనియర్ జట్టు కోచ్ పదవి చేపట్టే విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు కావాల్సినంత సమయం, సామర్థ్యం తనకు ఉన్నాయో లేవో ప్రస్తుత పరిస్థితుల్లో తేల్చుకోలేకపోతున్నానని చెప్పారు. ‘నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పలేను. అలాగని లేనూ అని చెప్పలేను. కేవలం కోచ్ పదవి చేపట్టాలనే కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. సమయం, సామర్థ్యం, వ్యూహాలు ఇలా చాలా అంశాలను పరిశీలించుకోవాలి.
వందశాతం దానిపై దృష్టిపెట్టగలమా? లేదో? చూసుకోవాలి. ఓవరాల్గా తుది నిర్ణయం తీసుకునే ముందు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. జట్టుకు కోచింగ్ ఇవ్వడమంటే ప్రతి రోజూ ఏదో ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవడమేనని ద్రవిడ్ అన్నారు.
మరోవైపు కోచ్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు ద్రవిడ్ అభ్యర్తిత్వంపై కూడా బోర్డు తన ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే సరైన సమయంలో సరైన వ్యక్తిని కోచ్గా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. 2019 వన్డే ప్రపంచకప్ వరకూ కోచ్ కొనసాగుతారు కాబట్టి... అన్ని రకాలుగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటామని ఠాకూర్ అన్నారు.