టెస్టులే క్రికెట్‌కు ఆధారం
లండన్: వన్డే, టి20 ఫార్మాట్ నుంచి సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను కాపాడుకునేందుకు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పలు సూచనలు చేశాడు. దీంట్లో భాగంగా పింక్ కలర్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులు ఆడించాలని చెప్పాడు. టి20, టెస్టులకు మధ్య ఫాస్ట్ ఫుడ్, రుచికరమైన భోజనానికి ఉన్న తేడా ఉందని అన్నాడు.
‘టెస్టు క్రికెట్ అనేది మహా వృక్షం లాంటిది. వన్డే అయినా టి20 అయినా వీటి కొమ్మలుగానే చెప్పుకోవచ్చు. అందరికీ చెట్టు ఫలాలు కనిపిస్తున్నా వాటిని మోస్తున్న చెట్టు సంగతి మరువరాదు. కొమ్మలకు కానీ ఫలాలకు కానీ ఇదే జీవన వనరు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టును నరికేస్తే ఇంకేమీ ఉండవు. అందుకే టెస్టులను మనం కాపాడుకోవాలి’ అని ద్రవిడ్ వివరించాడు. సుదీర్ఘ ఫార్మాట్ అనేది ఓ ఆటగాడి నైపుణ్యానికి పరీక్ష అని చెప్పాడు.