కళ..మా కల
ప్రేమను పంచుకున్నట్టే... బాధ్యతను పంచుకున్నట్టే...
సంతోషాన్ని పంచుకున్నట్టే... కష్టాన్ని పంచుకున్నట్టే...
నాటిని పంచుకున్నట్టే... నేటిని పంచుకున్నట్టే...
రేపటిని... అంటే స్వప్నాన్ని పంచుకుంటే..?
అదే జరిగింది...
బాహుబలి యూనిట్‌కి
రాజమౌళి... కెప్టెన్ ఆఫ్ ద షిప్‌గా
మార్గం చూపించాడు, గమ్యం చేర్చాడు.
రమ... మార్గాన్ని కష్టమనిపించకుండా...
ఇష్టమనిపించేలా చేశారు.
యూనిట్‌ని ఒక కుటుంబంలా నడిపించారు.
ఎ షేర్డ్ డ్రీమ్ బికమ్స్ ఎ ట్రెజర్డ్ మొమెంట్!
అప్పుడే కల... కలకాలం నిలిచే కళ అవుతుంది.
- రామ్ ఎడిటర్,షీచర్స్
♦ ఇప్పుడే హడావిడిగా భోజనం చేసి వస్తున్నట్లున్నారు! ఇంతకీ కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయింది?
(నవ్వేస్తూ...) తిండీ, నిద్ర అని కాదు కానీ, మేకింగ్‌లో ఉన్నప్పుడు సినిమా బాగా వస్తోందా- లేదా అనే ఆలోచిస్తాం. పూర్తయి, రిలీజ్ దగ్గర పడేసరికి టెన్షన్లు మొదలవుతాయి. ఎందుకంటే, అప్పుడు జవాబుదారీతనం వస్తుంది. అందుకే టెన్షన్.
♦ భారీ సినిమాకు ‘బాహుబలి’ అనే పేరు మీకు సరిపోయేట్లుందే?
(గట్టిగా నవ్వేస్తూ...) ఈ పర్టిక్యులర్ కథ కాదు కానీ, ఒక రాజుల కథ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. నాన్న గారు, నేను ఈ కథ అనుకున్నప్పుడు కూడా ప్రభాసే మనసులో మెదిలాడు. ‘బాహుబలి’ అన్నపేరు నాన్న గారు పెట్టిందే!
♦ కానీ, ఇన్ని కోట్ల సినిమాను మోస్తున్న మీరూ ‘బాహుబలే’!
ఇంత భారీ సినిమాను మోయడానికి నాతో పాటు యాక్టర్స్, టెక్నీషియన్స్ - ఇలా చాలా స్తంభాలే ఉన్నాయి. నేనొక్కణ్ణే మోసి ఉంటే, పాతాళానికెళ్ళిపోయి ఉండేవాణ్ణేమో! నిజానికి, నిర్మాతలు శోభు, ప్రసాద్ దేవినేని నా కన్నా ఎక్కువ మోశారు. సినిమాపై వాళ్ళకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది.
♦ ఈ భారీ ప్రాజెక్ట్ మీద వాళ్ళ ధైర్యానికి కారణం ఏమంటారు?
‘ఇది కేవలం తెలుగు సినిమా కాదు... ఇండియన్ సినిమా. ఒక్క ఇండియన్ మార్కెట్టే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్‌కు వెళ్ళే అవకాశం కూడా ఉంద’ని ఈ కథ చెప్పగానే గుర్తించారు.
♦ ఇంత భారీ ప్రాజెక్ట్‌కు అసలు విత్తనం ఎక్కడ పడింది?
ఈ కథకు మూలం - సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర, ఆ క్యారెక్టరైజేషన్. కొన్నేళ్ళ క్రితం నాన్న గారు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడే ఎగ్జైటయ్యా. ఆయన కూడా ఈ కథ ఒకేసారి చెప్పలేదు. ఒక్కో క్యారెక్టరైజేషన్ ఒక్కోసారి చెబుతూ వచ్చారు. ఈ పాత్రలన్నీ కలిపి, ఒక కథ అల్లుకొంటే అనే ఆలోచన వచ్చింది. అలా ‘బాహుబలి’ తయారైంది.
♦ ‘వెరైటీ’ లాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్నీ ఎట్రాక్ట్ చేశారే?
ఈ సినిమాకు అంతర్జాతీయంగానూ అంత శ్పాన్, స్కోప్ ఉన్నాయని గుర్తించింది శోభూనే! ‘ఈగ’ టైమ్ నుంచే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్ళి, మన సినిమా గురించి వాళ్ళకు తెలిసేలా చేశారు. ‘బాహుబలి’ కాన్సెప్ట్ ఆర్ట్స్, సినాప్సిస్ సహా మూడేళ్ళ క్రితమే వాళ్ళకు చూపించారు. అందుకే, వాళ్ళు ‘బాహుబలి’ గురించి రాశారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ భారతీయ సినిమా గురించీ ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్‌లో రాలేదు. సౌతిండియన్ సినిమా గురించైతే, వాటిలో ఇంతకు ముందెప్పుడూ రాలేదు. ఆ క్రెడిట్ ‘బాహుబలి’కి దక్కింది.
♦ ఈ మధ్య ‘కాన్స్’ ఫెస్టివల్లో కూడా మార్కెట్ చేసినట్లున్నారు?
అవును. నిర్మాత శోభూ వెళ్ళి, వాళ్ళకు ‘బాహుబలి’ గురించి ప్రెజెంట్ చేశారు. లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపాలనీ యత్నిస్తున్నారు. తను చేస్తున్న సినిమా ఇంటర్నేషనల్‌గా వెళుతోందంటే, డెరైక్టర్‌కు అంత కన్నా మోరల్ బూస్ట్ ఏముంటుంది!
♦ మరి, ఇంటర్నేషనల్ బిజినెస్, రిలీజ్ సంగతి ఎందాకా వచ్చింది?
చాలా ఆఫర్లున్నాయి. అవి అంత గబుక్కున తేలవు. సబ్-టైటిల్స్‌తో మన భాషలోనే చూడడం అక్కడివాళ్ళ అలవాటు. దానికి ఎడిటింగ్ విధానం, సౌండ్ డిజైనింగ్ పూర్తిగా వేరుగా ఉంటాయి. సినిమాలో కొంత నిడివి తగ్గించడం, కొన్నిచోట్ల నిడివి పెంచడం లాంటివీ ఉంటాయి. అందుకు కావాల్సిన అదనపు షూటింగ్ ఫుటేజీ మా దగ్గరుంది. అదంతా వేరే కథ.
♦ మీ కన్నా మీడియా ఈ సినిమాను ఎక్కువ మోస్తున్నట్లుంది!
(నవ్వేస్తూ...) మేము మా కోసం, మేము పెట్టిన డబ్బుల కోసం ‘బాహుబలి’ని భుజానికెత్తుకున్నాం. కానీ, పత్రికలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే సత్తా ఉన్న ఈ సినిమాను ప్రమోట్ చేయడం బాధ్యతగా భావించినట్లున్నాయి.
♦ కానీ, పబ్లిసిటీ ఒక శ్యాచురేటెడ్ స్టేట్‌కి వచ్చిందన్నట్లున్నారు!
నిజమే. ‘బాహుబలి’ పబ్లిసిటీ ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇప్పటికే అన్ని చోట్లా దీన్ని భూతద్దంలో చూస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమాకు ఎడ్వాంటేజ్. మరోరకంగా డిజ్ ఎడ్వాంటేజ్. ఆశించినదానికన్నా ఏ మాత్రం ఎక్కువున్నా జనం బ్రహ్మాండం అంటారు. కొద్దిగా తేడా వచ్చినా, కష్టమే. అందుకే, మా అంతట మేము మరీ పబ్లిసిటీ లేదు.
కోట్లు సరే.. మూడేళ్ళ లైఫ్, కెరీర్ పణంగా పెట్టడం రిస్క్ కాదా?
రిస్క్ అనిపించలేదు. ఎందుకంటే, ఏదో ఒక పాయింట్లో వచ్చిన ఆలోచనలతో కథ తయారవుతుంది. అలా తయారైన కథ బెత్తం పట్టుకొని, మన ముందే కూర్చుంటుంది. ఆ కథకు న్యాయం చేయడం కోసం మన ప్రయాణం మొదలవుతుంది. ఆ క్రమంలో జరిగే ప్రయాణమే సినిమా. ఆ జర్నీ ఎన్నాళ్ళు పట్టినా, మనకు కావాల్సిన శక్తిని ఆ స్టోరీయే ఇస్తుంది. ఏటా వంద సినిమాలోస్తే పదే ఆడుతున్నాయి. కాబట్టి, చిన్న రిస్కా, పెద్ద రిస్కా అని కాకుండా మనకు నచ్చిన సినిమా, నచ్చినట్లుగా చేస్తే బెటర్ కదా!
♦ ఇంతవరకూ ఒక్క పేపర్ యాడ్ లేకుండా, సోషల్ మీడియా పబ్లిసిటీతో ఇండస్ట్రీలో కొత్త దోవ తొక్కినట్లున్నారు!
దానికీ శోభూ ముందు చూపే కారణం. ‘ఈగ’ టైమ్‌లోనే సోషల్ మీడియా పవర్ గురించి శోభు చెప్పేవారు. ఇవాళ సెట్స్‌లో లైట్‌బాయ్ చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్, ఫేస్బుక్లో ఎకౌంట్ ఉన్నాయి. హిందీలో కరణ్ జోహార్ ముందుకు రావడానికీ, ఇతర భాషల్లో మా గురించి తెలియడానికీ కూడా సోషల్ మీడియానే హెల్పయింది.
♦ హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ రావడం ఎలా జరిగింది?
మా సినిమాకు పెద్ద పబ్లిసిటీ మౌత్‌పీస్ - హీరో రానా. అతనికి, కరణ్‌జోహార్‌తో బాగా స్నేహం. రానా ద్వారా ఈ సినిమా గురించి ఆయనకు తెలిసి, ఆసక్తి చూపించారు. శోభు కూడా కథ సినాప్సిస్, కాన్సెప్ట్ ఆర్ట్స్, పోస్టర్ డిజైన్స్‌తో ‘బాహుబలి’ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్‌ను ఆయనకు చూపెట్టారు. వెంటనే ఆయన హిందీ వెర్షన్‌ను అక్కడ అందించేందుకు ముందుకొచ్చారు.
♦ ఒక్క ఫ్రేమ్ కూడా చూపించకుండానే మార్కెటింగ్ చేశారు!
(నవ్వేస్తూ...) మా డీలయ్యాక ఆయనకు చూపించా.
♦ ‘బాహుబలి’లో మీకు మోస్ట్ డిఫికల్ట్ షూటింగేది?
కేరళలో జలపాతాల దగ్గర చేశాం. బల్గేరియాలో ఎముకలు కొరికే చలిలో చిత్రీకరించాం. అవన్నీ ఒక ఎత్తయితే, ఈ సినిమా కోసం ఆర్.ఎఫ్.సి.లో 4 నెలల పాటు తీసిన యుద్ధం సీన్లు మరో ఎత్తు. నా కెరీర్లోనే మోస్ట్ ఛాలెంజింగ్ షూటింగ్. అందరికీ అది మరపురాని అనుభవం.
♦ మీ నాన్న గారు, పెద్దన్న కీరవాణి ఎడిటింగ్ కూడా చేశారట!
నాన్నగారికి విజువల్స్, గ్రాండియర్ మీద దృష్టి ఉంటే, పెద్దన్న వాటికన్నా పాత్రల మధ్య ఎమోషన్ క్యారీ అయిందా లేదా చూస్తాడు. మిగతా కథల కన్నా ఈ కథ మీద నాన్న గారు విపరీతమైన ఎటాచ్మెంట్ పెంచుకున్నారు. రషెస్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ వచ్చారు. నా ఎడిటింగ్ చూసి, తనదైన ఆలోచనతో మరో రకంగా కూడా ఎడిట్ చేసి చూపించేవారు. మరొక దర్శక - రచయిత దృష్టి కోణంలో మనకు తట్టనిది తట్టవచ్చు కదా! అలా నాన్న గారు, 230 సినిమాలకు మ్యూజిక్ అందించి, రీరికార్డింగ్ చేసిన పెద్దన్న (కీరవాణి) చెప్పిన కొన్ని సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి.
♦ విజువల్స్ నుంచి పాటల దాకా జరిగిన లీకులు చూస్తే, ఈ సినిమాకు ‘లీకుబలి’ అని పేరు పెట్టాలేమో!
(బాధగా...) సినిమా అనేది చాలా భాగం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, విజువల్ ఎఫెక్ట్స్ కోసం పంపినప్పుడు, చివరకు సెక్యూరిటీ హెడ్డే విజువల్స్ లీక్ చేస్తే ఏం చేస్తాం? చాలా బాధ అనిపిస్తుంది. కొందరొచ్చి ‘ఏంటీ? లీకైందటగా?’ అని పళ్లికిలిస్తూ, వెకిలిగా అడుగుతారు. వాళ్ళకు ఏం జవాబి వ్వాలి? వాళ్ళ ఇంట్లో ఇలాంటిదేదైనా అయితే, ఇలానే అడుగుతారా? దానికి తోడు ‘రాజమౌళి వాళ్ళే కావాలని లీక్ చేస్తున్నార్రా పబ్లిసిటీ కోసం’ అనేవాళ్ళు ఇంకొందరు. ఇవన్నీ వింటే, బాధతో పాటు కోపమూ వస్తుంది. కానీ, అది వాళ్ళ సంస్కారమనుకోవడమే తప్ప ఏం చేయగలం!
♦ ఇంతకీ వాట్సప్‌లో వచ్చిన కథ ఈ సినిమాదేనా?
(నవ్వేస్తూ...) ‘బాహుబలి’ కథ అంటూ, చాలా కథలే వచ్చాయి. కానీ, ఈ సినిమా అసలు కథ మాత్రం వేరు.
♦ విజువల్ ఎఫెక్ట్స్, టెక్నీషియన్ల పరంగా ఏం చెబుతారు?
విజువల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్), కెమేరామన్ (సెంథిల్ కుమార్), ఆర్ట్ (సాబూ శిరిల్), కాస్ట్యూమ్స్ (రమా రాజమౌళి) - ఈ నాలుగు శాఖల పని ఇలాంటి సినిమాకు తెర మీద గ్రాండియర్ ఇస్తుంది. సినిమాకు కీలకమైన ఆ నలుగురికీ వాళ్ళ పని మీదే కాక, అవతలివాళ్ళ పని మీద, పనితనం మీద అవగాహన ఉండాలి. కలసికట్టుగా పనిచేయాలి. లేదంటే, ఐస్క్రీమ్నూ, ఆవకాయనూ కలిపేసినట్లు ఉంటుంది. సెంథిల్, రమ - నాకు అలవాటే. కొత్తగా నేను పనిచేసిన జాతీయ అవార్డు గ్రహీతలైన శ్రీనివాసమోహన్, సాబూ శిరిల్ అద్భుతంగా పనిచేశారు. చక్కటి సమన్వయంతో కుదిరిన ఈ నలుగురి వర్క్ సమ్మేళనం రేపు తెర మీద కనువిందు చేస్తుంది.
♦ ‘300’, ‘ట్రాయ్’ లాంటి హాలీవుడ్ సినిమాలొచ్చాయి. డబ్ అయ్యాయి. మరి, ‘బాహుబలి’ కొత్త అనుభూతవుతుందా?
‘బాహుబలి’ అంటే కేవలం విజువల్ గ్రాండియర్, పెద్ద సంఖ్యలో జనం, యుద్ధాలే కాదు. అది కేవలం ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడానికి ట్రైలర్లో చూపిస్తున్నాం. ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ అనుకోండి. కానీ, అంతకు మించిన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. జనం ఒకసారి థియేటర్‌కు వచ్చాక, ఆ ఎమోషనల్ కంటెంట్‌తో కట్టిపడేస్తాం. ఆ నమ్మకం మాకుంది.
♦ హిందీలో ‘మఖ్ఖీ’ (‘ఈగ’ సినిమా హిందీ పేరు) ఆశించినంత ఆడలేదు. మరి, ‘బాహుబలి’కి తీసుకున్న జాగ్రత్తలు?
‘ఈగ’ హిందీ డబ్బింగ్‌ను మార్కెట్ చేసినవాళ్ళతో వియ్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ. పాపం... వాళ్ళు అనుకున్నంత ప్రొఫెషనల్‌గా, ఎఫిషియెంట్‌గా చేయలేకపోయారు. దాంతో, ‘మఖ్ఖీ’ థియేటర్లలో కన్నా అక్కడ శాటిలైట్ టీవీ చానల్స్‌లో అది బాగా పేరు తెచ్చుకుంది. ‘బాహుబలి’ విషయంలో కరణ్ జోహార్ రంగంలోకి దిగారు. అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. కచ్చితంగా, అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
♦ ఇంతకీ మీ తరువాత సినిమా ఏమిటో ఆలోచించారా?
(నవ్వేస్తూ...) నా బుర్రంతా ఇప్పుడు ‘బాహుబలి... ది బిగినింగ్’ చుట్టూరానే తిరుగుతోంది. ఇది ఫస్ట్పార్టే. సెకండ్ పార్ట్ ఇంకా 60 శాతం షూట్ చేయాలి. ఆ సినిమా తరువాతే మరి ఏ కథ అయినా ఆలోచిస్తా.
♦ ఫస్ట్పార్టొచ్చాక, సెకండ్ పార్ట్ చేయడంలో రిస్క్ ఉందేమో?
బిజినెస్ పరంగా కానీ, ఆ యాంగిల్లో కానీ ఆలోచించలేదు. ఇంత పెద్ద కథను ఆకట్టుకునేలా చెప్పాలంటే, రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయడమే కరెక్ట్ అనుకున్నాం.
♦ ‘బాహుబలి’ మేకింగ్ గురించి ఏదైనా బుక్కే రాయచ్చుగా?
చాలా ఆలోచనలున్నాయి. కామిక్స్, బొమ్మలు - ఇలా చాలా. ఇప్పుడు కుదరలేదు. ఫస్ట్పార్ట్కీ, సెకండ్ పార్ట్‌కీ మధ్య గ్యాప్‌లో అవన్నీ చేస్తాం.
♦ ఎంతసేపూ పెద్ద సినిమాలేనా? ‘మర్యాద రామన్న’ లాంటి చిన్న సినిమాలూ మళ్ళీ చేయచ్చుగా?
చేయకూడదనేమీ లేదు. ‘మగధీర’ షూటింగ్ రెండో రోజే సునీల్‌ను పిలిచి, ‘మర్యాదరామన్న’ కథ చెప్పా. ముందే ఆలోచించిన కథను ‘మగధీర’ కాగానే చేశా.
♦ తమిళంలో వస్తున్న ‘మద్రాస్’ లాంటి సినిమాలో, ‘కాక్కా ముట్టై’ లాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా?
ఆ రెండు సినిమాలూ నేను చూడలేదు. ఒకటి చూసి, అలాంటి తరహా సినిమా చేయాలని నేనెప్పుడూ అనుకోను. ఆ క్షణానికి వచ్చిన ఆలోచనల్ని బట్టి చేస్తా. అది యాక్షన్ సినిమా కావచ్చు, హార్రర్ కూడా కావచ్చు.
♦ ‘జక్కన్న’ లాగా సినిమాలు బాగా చెక్కుతారని మీకు పేరుంది. ఇంతకీ అది మీకు ప్రశంసా? విమర్శా?
(నవ్వేస్తూ...) ‘శాంతినివాసం’ టీవీ సీరియల్ చేసే టైమ్‌లో సీరియల్ కూడా సినిమాలాగా చెక్కుతూ తీస్తున్నానంటూ, నటుడు -ఫ్రెండ్ రాజీవ్ కనకాల నాకు ఆ పేరు పెట్టాడు. హీరో తారక్ (చిన్న ఎన్టీఆర్) ప్రచారంలో పెట్టాడు. ప్రశంసగా అన్నప్పటికీ, అదో పెద్ద బరువు!
♦ మొత్తానికి, మీ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ పూర్తయిందా?
లేదు. ‘మహాభారతం’ సినిమాగా తీయాలన్నది కోరిక. అది తీరుతుందో లేదో కానీ అదే నా లైఫ్‌టైమ్ ప్రాజెక్ట్.
♦ ఈ భారీ ప్రాజెక్ట్‌ను డెడికేట్ చేయాలంటే ఎవరికి చేస్తారు? నాన్నకా? తోడుగా నిలిచిన భార్యాపిల్లలకా? గురువుకా?
(సాలోచనగా...) అందరితో పాటు ఈ సినిమా కోసం నా భార్య రమ, మా అబ్బాయి కార్తికేయ, ఇంకా నా కుటుంబమంతా కొండంత అండగా నిలిచింది. వాళ్ళూ ఎంతో శ్రమించారు. అయితే, ఈ సినిమాకు ఆ స్థాయి ఉందో లేదో కానీ, చిన్నప్పుడే నా మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు కె.వి. రెడ్డి గారికి అంకితం చేస్తాను. ఇవాళ్టికీ ఆయన ఎంతో గొప్ప డెరైక్టర్!
------------
యూనిట్ అంతా నా ఫ్యామిలీయే...
- రమా రాజమౌళి
♦ ‘సై’ సినిమా నుంచి స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నా, ‘బాహుబలి’ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ‘యమదొంగ’తో పోలిస్తే రాజుల ఎపిసోడ్ ఉండే ‘మగధీర’లో కొంత ఎక్కువ కష్టపడ్డా. ‘బాహుబలి’కి ‘మగధీర’ కన్నా పది రెట్లు ఎక్కువ శ్రమించా. వేల మందికి కాస్ట్యూమ్‌లు సిద్ధం చేయడం, అదీ ఆ కాలం నాటి దుస్తులు, అలంకరణల లాంటివన్నీ చూడడం అంత ఈజీ కాదు.
♦ ‘బాహుబలి’లో మనసుకు నచ్చింది చేస్తున్నాం కాబట్టి, రాజమౌళికీ, నాకూ శారీరక శ్రమ తెలియలేదు. మేమెప్పుడూ కష్టానికి భయపడం. కష్టపడితేనేగా జీవితంలో పైకి వచ్చేది!
♦ బడ్జెట్ విషయంలో మాత్రం భయం వేసింది. ప్రతి ఇండస్ట్రీలో కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! అవి దాటి వెళుతుందేమోనని భయపడ్డా. ‘అసలు ఇలాంటి కలలెందుకు కంటావు! మరీ ఇంత ఖరీదైన కలా?’ అని సినిమా మొదలయ్యే ముందు కూడా రాజమౌళిని వార్న్ చేశా. కానీ, రాజమౌళి టెన్షన్ పడలేదు. ఈ మూడేళ్ళలో ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేశాడు.
♦ భార్య, భర్త ఒకే ప్రొఫెషన్లో, ఒకేచోట ఉంటే, ఎప్పుడూ కలిసే ఉండచ్చు. మా అబ్బాయి కార్తికేయ కూడా ‘బాహుబలి’కి పనిచేశాడు కాబట్టి, మాతోనే ఉన్నాడు. అమ్మాయి మయూఖను స్కూల్ కాగానే సెట్స్‌కు తీసుకెళతా. ఈ జర్నీలో యూనిట్టే నా ఫ్యామిలీ అనిపించింది.
♦ బేసిక్‌గా మా ఇంట్లో ఎవరం ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చోలేం. అందుకని, అందరం ఇలా ఈ పనిలో ఉండడం, సెట్లోనే అందరం కలసి ఉండడం ఒక రకంగా ఉపయోగమే!
♦ నా కన్నా మా చెల్లెలు వల్లి (కీరవాణి శ్రీమతి) చాలా సమర్థురాలు. లైన్ ప్రొడ్యూసర్‌గా వల్లి లేకపోతే, ‘బాహుబలి’ ఇంత సాఫీగా జరిగేది కాదు. ఎక్కడా చిన్న కన్ఫ్యూజన్ కానీ, ఏ మాత్రం ఇబ్బందులు కానీ లేకుండా ఇన్ని వేల మందితో షూటింగ్ చేయించేసింది.
♦ మా వల్లి ట్రైనింగ్‌లో మా అబ్బాయి కూడా వాడు మరో వల్లి అయిపోతాడు (నవ్వులు...). ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. వాడి శక్తిపై నాకు నమ్మకం కలిగి, ప్రశాంతత వచ్చింది.
♦ రాజమౌళి, మా అబ్బాయి పడే కష్టం చూస్తుంటే, ముచ్చటగా ఉంటుంది. కష్టపడి, పైకి వచ్చేవాళ్ళంటే నాకు గౌరవం. అందుకే, మా వాళ్ళ శ్రమకు బాధపడను. పెపైచ్చు, గర్విస్తా.
-రెంటాల జయదేవ