car rolls
-
కారుబోల్తా పడి మహిళ..
గోరంట్ల(సోమందేపల్లి): గోరంట్ల మండలం మిషన్ తండా వద్ద జాతీయ రహదారిపై కారుబోల్తాపడి చెన్నైకు చెందిన సావ్రితమ్మ(56) మృతిచెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల మేరకు... సావిత్రమ్మ కుమార్తె పద్మశ్రీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమార్తెను చూడటానికి ఈమె కొద్దిరోజుల క్రితం చెన్నైనుంచి హైదరాబాద్‌కు వెళ్లింది. దసరా సెలవులు కావడంతో కూతురు పద్మశ్రీ, అల్లుడు సూర్యప్రకాష్‌లను పిలుచుకుని సావిత్రమ్మ ఓ కారులో శుక్రవారం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయల్దేరింది. మిషన్ తండా వద్దకు రాగానే టైరు పంక్చర్ కావడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సావిత్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు, అల్లుడు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కారు బోల్తా.. ఒకరి మృతి
ఉరవకొండ రూరల్: నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన వసంతప్ప (45), శశిధర్, డ్రైవర్ అప్పన్నలు వేరొక వాహనం రిపేరీ సామాన్లు కొనడానికి శనివారం తెల్లవారుజామున బళ్లారి నుంచి కారులో బయల్దేరారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఉరవకొండ మండలం బూదగవి వద్ద తూగడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. వసంతప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. శశిధర్, అప్పన్నలు గాయపడగా.. వీరిని ప్రభుత్వ అంబులెన్స్‌లో ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టైరు పగిలి చెట్టును ఢీకొన్న కారు
కణేకల్లు: టైరు పగిలి కారు చెట్టును ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా తగ్గుపర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. కణేకల్లు ఎస్ఐ యువరాజు తెలిపిన వివరాలివీ.. బెలుగుప్ప మండలంలోని తగ్గుపర్తికి చెందిన శ్రీధర్‌నాయుడు బళ్లారి నగరంలోని విద్యానగర్‌లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యనారాయణకు నాలుగు నెలల క్రితం కుడితినికి చెందిన మమతతో వివాహమైంది. శ్రీధర్‌నాయుడు భార్య రంగమ్మ(55) మామ నాగన్న ఐదు నెలల క్రితం స్వగ్రామమైన తగ్గుపర్తిలో చనిపోవడంతో గురువారం సంవత్సరికం నిర్వహించారు. ఇందుకోసం బుధవారం బళ్లారి నుంచి శ్రీధర్‌నాయుడు మినహా కుటుంబమంతా స్వగ్రామానికి బయలుదేరారు. కార్యక్రమం ముగించుకొని గురువారం మధ్యాహ్నం శాంత్రో కారులో రంగమ్మ(55), కుమారుడు సత్యనారాయణ(26), కోడలు మమత(22), మరిది ఆదినారాయణ(54) బళ్లారికి బయలుదేరారు. కణేకల్లు క్రాస్–బళ్లారి రోడ్డు మార్గమధ్యంలో యర్రగుంట గ్రామశివారులో కారు ముందు భాగంలోని కుడివైపు టైరు పగిలిపోయింది. వేగంగా వస్తున్న కారు కుడివైపున్న చింత చెట్టును బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. రంగమ్మ, మమత, ఆదినారాయణలకు బలమైన గాయాలు కావడంతో కార్లోనే చనిపోయారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోగా స్థానికులు కష్టం మీద బయటకు తీశారు. సత్యనారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. ఆర్సీ, మృతుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. రాయదుర్గం సీఐ చలపతి, కణేకల్లు ఎస్ఐ యువరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది. శ్రీధర్‌నాయుడు, రంగమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భార్యతో పాటు కుమారుడు మృతి చెందడంతో ఆయన రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
కారు బోల్తా: దంపతులకు గాయాలు
గుత్తి రూరల్ : మండలంలోని ఊబిచెర్ల శివార్లలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో అనంతపురం ప్రశాంత్‌నగర్‌కు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్ రహీం, ఆయన భార్య మెహజాన్బీ గాయపడ్డారు. అనంతపురం నుంచి వారు హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలోని ఊబిచెర్ల వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోస వారిని కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
చిలమత్తూరు : మండలంలోని 44వ జాతీయ రహదారి అంజనీ తండా సమీపంలో ఆదివారం సాయంత్రం కారు బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూర్ నుంచి రోషన్‌కుమార్ తన సొంత కారులో (కేఏ51ఎంజీ 9628) హైదరాబాద్ వైపు వెళ్తుండగా అంజనీ తండా సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కాగా డ్రైవర్ సీటు బెల్టు వేసుకోవడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కానిస్టేబుళ్లు సురేష్, ఎం.సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కారు బోల్తా.. తప్పిన ప్రమాదం
చివ్వెంల (నల్లగొండ): అతివేగంగా వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని తుల్జరావు పేట గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ స్టేజీ వద్దకు వచ్చేసరికి ఆదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి విజయవాడకు చెందిన కారు డ్రైవర్ శ్రీను సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
కంకిపాడు: కారు బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కొలవెన్నికి ఐదుగురు వ్యక్తులు కారులో వెళుతుండగా మండలంలోని పునాదిపాడు వద్ద కారు బోల్తా కొట్టింది. బాధితులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వంతెన పైనుంచి కారు పల్టీ
ఎడ్లపాడు (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా ఎడ్లపాడు సమీపంలోని వంతెనపై నుంచి కారు పల్టీ కొట్టి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటలకు జరిగింది. వివరాలు.. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కారు అదుపు తప్పి వంతెనపై నుంచి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి గుంటూరు కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులు గుంటూరు జిల్లా వేమూరు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. -
కారు బోల్తా.. పది పల్టీలు
మెదక్: మెదక్ జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఆ తర్వాత పది పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో కల్లు సీసాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.