Car Servicing
-
మూడేళ్లలో మూడింతల ఆదాయం
న్యూఢిల్లీ: కార్ సర్వీసెస్ (Car service), రిపేర్ (Car repair) ప్లాట్‌ఫామ్ గోమెకానిక్ (GoMechanic) మూడేళ్లలో నికర ఆదాయం మూడింతలకుపైగా అధికమై రూ.700 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత పబ్లిక్ లిస్టింగ్‌కు (IPO) వెళ్తామని కంపెనీ కో–ఫౌండర్, సీఈవో హిమాన్షు అరోరా తెలిపారు. ప్రస్తుతం 3 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని, మూడేళ్లలో దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ద్విచక్ర, ఎలక్ట్రిక్ వెహికిల్స్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు.‘కంపెనీ ప్రస్తుతం 125 నగరాల్లో 800 గరాజ్ల ద్వారా సేవలను అందిస్తోంది. 2027 నాటికి 500 నగరాల్లో 2,500 గరాజ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని వివరించారు. గతంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు బయటపడడంతో కంపెనీని ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టారు. లైఫ్‌లాంగ్ గ్రూప్ అనుబంధ కంపెనీ సర్వీజ్జీ 2023 మార్చిలో గోమెకానిక్ను కొనుగోలు చేసింది. 8 లక్షల మంది కస్టమర్లు.. గోమెకానిక్ 2023–24లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో రూ.85 కోట్లు నమోదు చేసింది. ‘విడిభాగాలు, ఉపకరణాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వీటి విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. నికర రాబడి దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటాం’ అని అరోరా చెప్పారు. యాక్టివ్ కస్టమర్లు నెలకు 8 లక్షలు ఉన్నారని గోమెకానిక్ కో–ఫౌండర్, సీవోవో ముస్కాన్ కక్కర్ వివరించారు. నిర్వహణ లాభం నమోదు చేస్తున్నామని, 2027 నాటికి నికరలాభం అందుకుంటామని ఆమె వెల్లడించారు. కంపెనీ రోల్స్‌పై 550 మంది, ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌లో 4,000 మంది పనిచేస్తున్నారని వివరించారు. -
8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్ కేంద్రాలు
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్‌ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్‌ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది. -
ముందుగా అమ్మకాలకు అనుమతిస్తేనే భారత్‌లో తయారీ
న్యూఢిల్లీ: ముందుగా తమ కార్ల అమ్మకాలు, సర్వీసింగ్‌కు అనుమతినిస్తే తప్ప భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయబోమని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఒక యూజర్ వేసిన ప్రశ్నకు ఈ మేరకు స మాధానమిచ్చారు. ‘ముందుగా తన కార్లను అమ్ముకోవడానికి, సర్వీసింగ్ చేయడానికి అను మతి ఇవ్వని ఏ ప్రాం తంలోనూ టెస్లా తన తయా రీ ప్లాంటు ఏర్పాటు చేయదు‘ అని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాం డ్ నెలకొన్న నేపథ్యంలో భారీ భారత మార్కెట్లో తమ కార్లను దిగుమతి చేసుకుని, అమ్మాలని టెస్లా యోచిస్తోంది. అయితే, ఇందుకు ప్రతిబంధకంగా ఉంటున్న భారీ స్థాయి దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. -
రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..
అనిత పుట్టింది పెరిగింది కరీంనగర్లో. ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్‌లో అమ్మమ్మగారింట్లో ఉండి చదువుకుంది. ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కెరీర్లో కొంత విరామం. ఇప్పుడు సొంత గ్యారేజ్ తో కొత్త కెరీర్లో అడుగుపెట్టింది. గ్యారేజ్ అనగానే టైర్లు, రెంచ్‌లు, గ్రీజు అంటిన దుస్తులతో మగవాళ్లు కళ్లముందు మెదలుతారు. మహిళలు ప్రవేశించని రంగం అనడం కంటే మహిళలు పెద్దగా ఇష్టపడని రంగం అనే చెప్పాలి. భుజబలంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టే ఈ రంగంలో అడుగుపెట్టడం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని ఒక సవాల్‌గా స్వీకరించింది అనిత వ్యాల. ఇల్లు అమ్మేశాం! ‘‘విక్టరీ 4 వీల్స్ గ్యారేజ్‌ని 2018లో తమ్ముడు, నేను కలిసి మొదలుపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను. యాభై లక్షలతో పూర్తవుతుందని దిగాం. కానీ మేము అనుకున్న స్వరూపం వచ్చేటప్పటికి 90 లక్షలైంది. లోన్ కోసం నెలలపాటు బ్యాంకు చుట్టూ తిరిగి చివరికి మా ఫ్లాట్స్ అమ్మేసి గ్యారేజ్ పెట్టాం. నలుగురు ఉద్యోగులతో మొదలైన గ్యారేజ్‌లో ఇప్పుడు నాతో కలిసి పన్నెండు మందిమి పని చేస్తున్నాం. మహిళ అయిన కారణంగా ఎదురయ్యే ఇబ్బందులేమీ లేవు. కానీ వర్కర్స్ జాప్యం చేస్తున్నట్లు, మహిళను కావడంతోనే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారేమో అనిపించేది. అయితే వాళ్ల సమాధానం విన్న తర్వాత పని ఆలస్యం కావడానికి కారణం సహేతుకంగానే అనిపించేది. పాప లక్ష్యం మెడిసిన్ పిల్లల కోసం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన తరవాత గ్యారేజ్ పెట్టడానికి మధ్య కొంతకాలం ట్యూషన్లు చెప్పాను. ట్యూషన్లతో వచ్చే రాబడితో హాయిగానే ఉండేది. అయితే మా పాప లక్ష్యం మెడిసిన్. సీటు తెచ్చుకోవడం ఆమె లక్ష్యం. ఫీజులు కట్టడానికి తగినట్లు నా ఇన్‌కమ్‌ను పెంచుకోవడం నా లక్ష్యం అయింది. అందుకే పని చేయగలిగిన వయసులోనే కన్‌స్ట్రక్టివ్‌గా ఏదో ఒక బిజినెస్‌లోకి అడుగుపెట్టి స్థిరపడాలనుకున్నాను. అంతే తప్ప నేను రికార్డు సాధించడం కోసం పిల్లల భవిష్యత్తు మీద ప్రయోగం చేసే పరిస్థితి కాదు. తమ్ముడి సూచన మా తమ్ముడికి టాటా డీలర్షిప్ వర్క్‌షాపులో పదహారేళ్ల అనుభవం ఉంది. మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్‡గురించి చెప్పాడు. అలా ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో ప్రతిదీ పనిలోకి దిగిన తర్వాత నేర్చుకున్నదే. కారు డీప్ ఇంటీరియర్ క్లీనింగ్, ఇన్సైడ్ వ్యాక్యూమింగ్, కెమికల్ క్లీనింగ్, ఫోమ్ వాషింగ్, ఫాగ్ మెషీన్ శానిటైజేషన్ వంటి పనులన్నీ చేస్తాను. సమస్యలుంటాయని చెప్పడానికి... ‘దిగితేనే లోతు తెలుస్తుంది’ అంటారు. నేనయితే ‘దిగితే ఈత దానంతట అదే వస్తుంది’ అంటాను. ఇందులో పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఒకసారి మా గ్యారేజ్‌కి వచ్చిన కస్టమర్లు ఆ తర్వాత నుంచి కొనసాగుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే మహిళల విషయంలో కారు సర్వీస్‌కి కూడా వాళ్లే రావాల్సి ఉంటుంది. మగవాళ్లు నిర్వహించే గ్యారేజ్‌లో కంటే మా దగ్గర సౌకర్యంగా ఫీలవుతున్నారు మహిళలు. నేను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్యారేజ్‌లో ఉంటాను. ఒక్కోసారి అర్జంట్‌గా పని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పన్నెండు గంటల వరకు కూడా గ్యారేజ్‌లో ఉండాల్సి వస్తుంది. అమ్మాయిలూ రెంచ్ పట్టుకోండి! ఒకప్పుడు మెకానిక్ అంటే సమాజం తక్కువ గా చూసేది. అలా చూడడం వల్లనే కావచ్చు ఇప్పుడు ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. పైగా ఇప్పుడు మెకానిక్ వృత్తికి గౌరవం పెరిగింది కూడా. కాబట్టి అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఈ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తాను. ఈ కాలంలో టూ వీలర్ నడిపే అమ్మాయిలు, కారు నడిపే మహిళల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు గ్యారేజ్‌కి వచ్చినప్పుడు గ్యారేజ్‌లో పని చేసే వాళ్లలో అమ్మాయిలు కనిపిస్తే భరోసాగా ఫీలవుతారు. ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఎప్పటికీ ఆదరణ తగ్గని మంచి రంగం అవుతుంది’’ అన్నది అనిత. కష్టం... వద్దన్నా వచ్చే అతిథి సింగిల్æమదర్‌ల మీద ఉండే బాధ్యతల బరువు నాకు తెలుసు. అందుకే సింగిల్ మదర్లు ఈ పని నేర్చుకోవడానికి ముందుకొస్తే వారికి సహకరిస్తాను.ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు. అనుకోని అతిథిలా కష్టం దానంతట అదే వచ్చి తిష్టవేస్తుంది. కష్టం వచ్చిందని భయపడి పిల్లలతోపాటు ఆత్మహత్యలకు పాల్పడే తల్లుల గురించి తెలిసినప్పుడు బాధ కలుగుతుంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. పరిస్థితులకు మనం బాధితులమైనప్పటికీ మన పిల్లలను బాధితులను చేయకూడదు. అలాగని అమ్మానాన్నల మీద వాలిపోకూడదు. వాళ్లు కష్టకాలంలో అండగా భుజాన్ని ఇవ్వగలుగుతారు. కానీ బరువు మోసే శక్తి వాళ్లకు ఉండదు. మీకు వచ్చిన పని చేయండి, నచ్చిన పనిని నేర్చుకోండి. – అనిత వ్యాల, ఎం.డీ. ఆమె తాను ఎంచుకున్న రంగంతో మహిళలకు స్ఫూర్తినివ్వడంతోపాటు కొత్తతరానికి స్వాగతం పలుకుతోంది కూడా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బిల్లు చెల్లించలేదని నటుడిపై కేసు
ముంబై : బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి మీద నాన్ కాగ్నిజబుల్ నేరం నమోదయ్యింది. వివరాలు.. ఆదిత్య పంచోలి సర్విసింగ్ నిమిత్తం తన కార్‌ను 2017 మార్చ్‌లో ఓ మెకానిక్‌కి అప్పచెప్పాడు. సదరు మెకానిక్ సర్విసింగ్, రిపేర్ చేశాడు. ఇందుకు గాను రూ. 2.82 లక్షల బిల్లు అయ్యిందని.. ఆ డబ్బును చెల్లించాల్సిందిగా ఆదిత్యను కోరాడు. కానీ ఆదిత్య బిల్లు కట్టకుండా సదరు మెకానిక్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. బిల్లు కట్టమని అడిగిన ప్రతిసారి ఆదిత్య, మెకానిక్‌ను తిట్టడమే కాక వ్యక్తిగత బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. కార్ సర్విసింగ్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. నేటికి కూడా ఆదిత్య బిల్లు చెల్లించకపోవడంతో విసిగిపోయిన మెకానిక్ చివరకూ ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఆదిత్య మీద ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మెకానిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిత్య పంచోలి మీద నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతుంద’ని తెలిపారు. అయితే ఏ వ్యక్తి మీద అయిన నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కేసు నమోదు అయితే వారెంట్ లేకుండా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. -
కార్ల సర్వీసింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
విశాఖపట్నం, శఢఅక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఆటోనగర్ బి – బ్లాక్‌లోని కార్ల సర్వీసింగ్ సెంటర్ లక్ష్మీ హుందాయ్ షోరూం అగ్నికి ఆహుతైంది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో షోరూంలో విడి భాగాలు (స్పేర్ పార్ట్స్) ఉండే క్యాబిన్ మొత్తం దగ్ధమైంది. కంపెనీలో స్పేర్ పార్టులు ఉన్న షెడ్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు కిందనున్న క్యాబిల్లో కూడా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే కార్మికులు, సిబ్బంది అంతా సుమారు రాత్రి 7 గంటల సమయంలో విధులు ముగించుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బందితో కలిసి కంపెనీ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. ప్రమాదం జరగడంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుమారు రాత్రి 7.30 గంటల సమయంలో షోరూం సెక్యూరిటీ చెపుతున్న వివరాల ప్రకారం షోరూం వెనుక నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని, వెంటనే ఫైర్ స్టేషన్‌కు, తమ యాజమాన్యానికి ఫోన్లో తెలిపానని చెబుతున్నారు. కొందరు మాత్రం షార్ట్‌సర్క్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆటోనగర్, పెదగంట్యాడ అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాజువాక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించి, వివరాలు సేకరించారు. ఈ రెండింటిలో ఏది నిజమో దర్యాప్తులో తేలాల్సి ఉందని జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్ పేర్కొన్నారు. ఆటోనగర్‌లోని లక్ష్మీ హుందాయ్ కంపెనీ పూర్తిగా కార్ల సర్వీసింగ్ సెంటర్. ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో కార్లు తమ సర్వీసింగ్‌కు తీసుకువస్తుంటారు.అయితే కంపెనీ లోపలి భాగం అంతా రేకుల షెడ్డు మాత్రమే. పైన కార్లకు సంబంధించిన విడిభాగాలు, అందులో కొన్ని సింథటిక్, ఫోం వంటి వాటితో ఉంటాయని సిబ్బంది తెలిపారు. అయితే జరిగిన ప్రమాదం తీవ్రతను బట్టి ఇవి ఎలా అగ్నికి ఆహుతయ్యాయే తెలియాల్సి ఉంది. యాజమాన్యం సిబ్బందిపై అగ్నిమాపక అధికారి ఆగ్రహం... ఆటోనగర్‌తో పరిశ్రమలతో పాటు గాజువాక పరిధిలో పలు బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే ఎటువంటి జాగ్రత్తలకు సంబంధించిన అనుమతులు లేవని విలేకరులు ప్రశ్నించగా జిల్లా అగ్నిమాపక అధికారికి విన్నవించగా ఆయన దీనిపై స్పందిస్తూ ఎక్కడ అనుమతుల విషయంలో ఉపేక్షించలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన లక్ష్మీ హుందాయ్ కంపెనీకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. -
బంజారాహిల్స్‌లో టీడీపీ ఎంపీపై కేసు
హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల్లో కార్ల సర్వీస్ సెంటర్ నిర్వహిస్తూ స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ, శ్రీజయలక్ష్మి ఆటోమోటివ్స్ ఎండీ కంభంపాటి రామ్మోహన్‌రావుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్లు, అక్రమ డీజిల్ నిల్వలతో కంభంపాటి రామ్మోహన్రావు తమకు న్యూసెన్స్‌ను కలిగిస్తున్నారంటూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని తోటంబంజారా అపార్ట్మెంట్ వాసులతో పాటుగా స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ సెక్షన్ 278, 336 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐస్ ఫ్రూట్ ఫ్యాక్టరీ పేరుతో అనుమతులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భాగ్యనగర్ స్టూడియోస్ ఆవరణలో రామ్మోహన్రావు ఐస్‌ఫ్రూట్ ఫ్యాక్టరీ అండ్ మిషిన్ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని లక్ష్మీ హుందయ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్ షెడ్, వర్క్‌షాప్, సర్వీస్ సెంటర్‌ను నడిపిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్లకు డెంటింగ్, పెయింటింగ్‌తో పాటు ఇతర మిషనరీ పనులు చేస్తుండటంతో వాయు, శబ్ద కాలుష్యంతో తామంతా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వృద్ధులు బ్రాంకైటిస్, ఆస్తమా వ్యాధులకు గురవుతున్నారన్నారు. ఇక్కడ ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటూ రోడ్డు పక్కన అక్రమ పార్కింగ్లు కూడా చేస్తున్నారని తెలిపారు. ఇక్కడే డీఏవీ స్కూల్ కూడా ఉందని, తరచూ కార్ల రాకపోకలు, అక్రమ పార్కింగ్‌లతో విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సర్వీస్ సెంటర్ నిర్వహణకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఉండాలని, ఈ మేరకు పీసీబీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఐస్‌ఫ్రూట్ ఫ్యాక్టరీ పేరుతో ట్రేడ్ లైసెన్స్ మాత్రమే కలిగి ఉన్న ఆయన కారు షెడ్, సర్వీస్ సెంటర్‌కు మాత్రం ఎలాంటి పన్నులు చెల్లించడం లేదని, దీనివల్ల ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం వస్తోందన్నారు. ఇక్కడి గోడౌన్లో 40 వరకు ఇంజిన్ ఆయిల్ డ్రమ్ములు నిల్వ చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున సామగ్రి నింపారని, దీనివల్ల నివాసిత ప్రాంతంలో ప్రశాంతత కరువైందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో ఓలా ఒప్పందం
హైదరాబాద్: వ్యక్తిగత రవాణాకు సంబంధించిన మొబైల్ యాప్ ఓలా, మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఓలా బ్యాడ్జ్ కింద కార్లను నిర్వహించే డ్రైవర్లకు కారు సర్వీసింగ్ సేవలపై మహీంద్రా ఫస్ట్ చాయిస్ 50 శాతం వరకూ రాయితీ ఇస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫస్ట్ చాయిస్ సంస్థ కార్ల సర్వీసింగ్‌కు సంబంధించి ఓలా డ్రైవర్లకు రెండు రకాల ప్యాకేజీలను ఆఫర్ చేస్తోందని ఓలా సీఓఓ ప్రణయ్ జివ్రాజ్కా పేర్కొన్నారు. మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ వర్క్ షాపుల్లో కారు సర్వీసింగ్ చేయించుకున్నవారికి కార్ ఫ్రెషనర్స్, డాష్‌బోర్డ్ మెమెంటోల వంటివి ఉచితంగా కూడా లభిస్తాయని వివరించారు. ఓలాతో ఒప్పందం కారణంగా వేలాదిమంది ఓలా డ్రైవర్లకు సేవలందించే అవకాశం లభించిందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ సీఈఓ వైవిఎస్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చెల్లింపుల టెక్నాలజీ సంస్థ జిప్క్యాష్లో కొంత వాటాను కొనుగోలు చేశామని ఓలా పేర్కొంది. సొంత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటులో భాగంగా జిప్క్యాష్లో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు.