న్యూఢిల్లీ: కార్ సర్వీసెస్ (Car service), రిపేర్ (Car repair) ప్లాట్‌ఫామ్ గోమెకానిక్ (GoMechanic) మూడేళ్లలో నికర ఆదాయం మూడింతలకుపైగా అధికమై రూ.700 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత పబ్లిక్ లిస్టింగ్‌కు (IPO) వెళ్తామని కంపెనీ కో–ఫౌండర్, సీఈవో హిమాన్షు అరోరా తెలిపారు. ప్రస్తుతం 3 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని, మూడేళ్లలో దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ద్విచక్ర, ఎలక్ట్రిక్ వెహికిల్స్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు.
‘కంపెనీ ప్రస్తుతం 125 నగరాల్లో 800 గరాజ్‌ల ద్వారా సేవలను అందిస్తోంది. 2027 నాటికి 500 నగరాల్లో 2,500 గరాజ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని వివరించారు. గతంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు బయటపడడంతో కంపెనీని ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టారు. లైఫ్‌లాంగ్ గ్రూప్ అనుబంధ కంపెనీ సర్వీజ్జీ 2023 మార్చిలో గోమెకానిక్‌ను కొనుగోలు చేసింది.
8 లక్షల మంది కస్టమర్లు..
గోమెకానిక్ 2023–24లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో రూ.85 కోట్లు నమోదు చేసింది. ‘విడిభాగాలు, ఉపకరణాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వీటి విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. నికర రాబడి దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటాం’ అని అరోరా చెప్పారు. యాక్టివ్ కస్టమర్లు నెలకు 8 లక్షలు ఉన్నారని గోమెకానిక్ కో–ఫౌండర్, సీవోవో ముస్కాన్ కక్కర్ వివరించారు. నిర్వహణ లాభం నమోదు చేస్తున్నామని, 2027 నాటికి నికరలాభం అందుకుంటామని ఆమె వెల్లడించారు. కంపెనీ రోల్స్‌పై 550 మంది, ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌లో 4,000 మంది పనిచేస్తున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment