Cara Black
-
సానియా సువర్ణధ్యాయం
భారత టెన్నిస్ చరిత్రలో సానియా మీర్జా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. లియాండర్ పేస్, మహేశ్ భూపతిలాంటి దిగ్గజాలతో సాధ్యంకాని ఘనతను ఈ హైదరాబాద్ అమ్మాయి సాధించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సానియా మీర్జా తన భాగస్వామి కారా బ్లాక్‌తో కలిసి చాంపియన్‌గా అవతరించి పెను సంచలనం సృష్టించింది. సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కిన సానియా-కారా బ్లాక్ ద్వయం ఫైనల్లో మాత్రం దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి-షుయె పెంగ్ జంటకు ఒకే ఒక్క గేమ్ కోల్పోయి సానియా-కారా బ్లాక్ జోడీ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సింగపూర్: తన డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్‌కు సానియా మీర్జా చిరస్మరణీయ కానుక ఇచ్చింది. కారా బ్లాక్‌తో కలిసి చివరి టోర్నీ ఆడిన సానియా ఆమెకు టైటిల్‌తో వీడ్కోలు చెప్పింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం విజయఢంకా మోగించింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-కారా బ్లాక్ 6-1, 6-0తో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా) జోడీని చిత్తు చేసింది. ఫైనల్లో ఓడిన సు వీ సెయి వచ్చే సీజన్లో సానియా కొత్త భాగస్వామిగా ఉండబోతుంది. విజేతగా నిలిచిన సానియా జంటకు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్లు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ సు వీ సెయి-షుయె పెంగ్లకు 2 లక్షల 50 వేల డాలర్లు (రూ. కోటీ 52 లక్షలు) దక్కాయి. టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా సానియా జంట ట్రోఫీని అందుకుంది. కేవలం 59 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో భారత్-జింబాబ్వే జంటకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో సానియా జోడీ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడం విశేషం. రెండు సెట్లలో మూడేసి బ్రేక్ పాయింట్లు దక్కాయి. మరోవైపు తమ ప్రత్యర్థికి ఈ ద్వయం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా సానియా జంట మ్యాచ్‌లో వరుసగా 12 గేమ్‌లు గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో ఒక మ్యాచ్ పాయింట్‌ను, సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఫైనల్‌కు చేరిన సానియా జంట ఫైనల్లో మాత్రం ఊహకందని ఆటతీరును కనబరిచింది. షుయె పెంగ్ తొలి సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ జోడీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సానియా-కారా బ్లాక్ చెలరేగడంతో షుయె పెంగ్-సు వీ సెయి జంటకు తాము సాధించిన తొలి గేమే మొదటిది, చివరిది అయ్యింది. నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు కచ్చితమైన సర్వీస్, వ్యాలీలతో సానియా జంట పరిపూర్ణ ఆటతీరుతో విజేతగా నిలిచింది. సానియాకిది తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌కాగా... కారా బ్లాక్‌కు మూడోది. 2007, 2008లలో లీజెల్ హుబెర్ (అమెరికా)తో కలిసి కారా బ్లాక్ టైటిల్స్ గెలిచింది. మరో ఆరుసార్లు ఈ జింబాబ్వే క్రీడాకారిణి ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయంతో సానియా భారత టెన్నిస్ చరిత్రలో అరుదైన గౌరవాన్ని సాధించింది. సీజన్ ముగింపు టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. పురుషుల టెన్నిస్‌లో సీజన్ ముగింపు టోర్నీ అయిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మహేశ్ భూపతి-రోహన్ బోపన్న (2012); మహేశ్ భూపతి-మాక్స్ మిర్నీ (బెలారస్-2010) ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు టెన్నిస్ మాస్టర్స్ కప్‌గా పేరున్న ఈ టోర్నీలో లియాండర్ పేస్ (భారత్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జంట 2005లో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీ కంటే ముందు ఏటీపీ టూర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు (2000, 1999, 1997) లియాండర్ పేస్-మహేశ్ భూపతి జంట రన్నరప్‌గా నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కాం. టెన్నిస్ అంటే అదేమరి. ఈ ఆట ఎల్లప్పుడూ మరో అవకాశం ఇస్తుంది. పోరాడితే తప్పకుండా ఫలితం వస్తుంది. ఈ టోర్నీలో ఈ విషయం రుజువైంది. మా ఇద్దరి ప్రయాణం అద్భుతంగా సాగింది. మా ఇద్దరికీ ఇదే అత్యుత్తమ మ్యాచ్. నా భాగస్వామి కారా బ్లాక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమె ఓ గొప్ప చాంపియన్. కారా రూపంలో నాకు గొప్ప స్నేహితురాలు లభించింది. ఆమె నాకు సోదరిలాంటిది. మేమిద్దరం మళ్లీ కలసి ఆడతామో లేదోగానీ మా స్నేహం మాత్రం కలకాలం ఉంటుంది. - సానియా మీర్జా మా భాగస్వామ్యంలో ఆరంభం, ముగింపు అదిరాయి. మూడు పదుల వయసు దాటడంతో ఈ ఆటకు అవసరమైనంతమేర చురుకుగా కదల్లేకపోతున్నాను. సానియా తన కెరీర్లోనే గొప్ప ఫామ్‌లో ఉంది. వచ్చే ఏడాది నేను ఆడతానో లేదో అని యూఎస్ ఓపెన్ సందర్భంగా సానియాకు తెలిపాను. టోర్నీల సమయంలో పాపతో కలిసి ప్రయాణం చేయడం కూడా సులువేం కాదు. కొత్త భాగస్వామిని ఎంచుకొని సానియా నా నిర్ణయాన్ని గౌరవించింది. - కారా బ్లాక్ -
సానియాకు తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్
-
సానియాకు తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్
సింగపూర్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ సాధించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో మహిళల డబుల్స్ టైటిల్ ను కారా బ్లాక్(జింబాబ్వే)తో కలిసి ఆమె సాధించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా)లపై 6-1, 6-0తో ఓడించి సానియా, కారా విజేతలుగా నిలిచారు. మరోవైపు వేర్వేరు భాగస్వాములతో కలిసి గతంలో ఈ టోర్నీని రెండుసార్లు నెగ్గిన కారా బ్లాక్ కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం. శనివారం జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 7-5, 11-9తో క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీపై అద్భుత విజయం సాధించింది. -
సానియా ‘షో'
కారా బ్లాక్‌తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సింగపూర్: పట్టుదలకు అనుభవం కూడా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిరూపించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా తన భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి అంతిమ సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 7-5, 11-9తో క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీపై అద్భుత విజయం సాధించింది. రెండు గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ పోరులో సానియా జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందడం విశేషం. ఒకవైపు తన భాగస్వామి కారా బ్లాక్ కచ్చితమైన సర్వీస్‌లు చేయడంలో ఇబ్బంది పడుతోంటే... మరోవైపు సానియా అన్నీ తానై మ్యాచ్‌ను నడిపించింది. పదునైన రిటర్న్ షాట్లకు తోడు నెట్‌వద్ద అప్రమత్తంగా వ్యవహరించి కీలక దశలో పాయింట్లు నెగ్గడంలో ముఖ్యపాత్ర పోషించింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట ఒక దశలో 6-9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సానియా, కారా బ్లాక్ సమన్వయంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 9-9తో సమం చేశారు. అదే జోరులో మరో రెండు పాయింట్లు నెగ్గి 11-9తో విజయాన్ని ఖాయం చేసుకున్నారు. తద్వారా సానియా తన కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకుంది. మరోవైపు వేర్వేరు భాగస్వాములతో కలిసి గతంలో ఈ టోర్నీని రెండుసార్లు నెగ్గిన కారా బ్లాక్ మూడో టైటిల్ రేసులో నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా)లతో సానియా ద్వయం తలపడుతుంది. మరో సెమీఫైనల్లో సు వీ సెయి-షుయె పెంగ్ 6-1, 6-4తో అలా కుద్రయెత్సేవా (రష్యా)-రొడియోనోవా (ఆస్ట్రేలియా)లపై గెలిచారు. ఆ సమయంలో చాలా ఉత్కంఠకు లోనయ్యా. ఎలాగైనా మ్యాచ్‌లో నిలవాలని భావించాం. సూపర్ టైబ్రేక్‌లలో ఏదైనా జరగొచ్చు. 6-9తో ఉన్న సమయంలో ఒక్క సర్వ్‌ను ప్రత్యర్థి బ్రేక్ చేసినా చాలు. అందుకే తొలి సర్వీస్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనుకున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చని అనిపించింది. - సానియా మీర్జా -
సెమీస్‌లో సానియా జోడీ
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో సానియా-కారా బ్లాక్ 6-3, 2-6, 12-10తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)లపై గెలిచారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను మూడుసార్లు చొప్పున కోల్పోయాయి. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో ఆధిక్యం దోబూచులాడినా తుదకు సానియా జంటనే విజయం వరించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటతో సానియా జోడీ తలపడుతుంది. పెశెక్, స్రెబోత్నిక్తో జరిగిన క్వార్టర్స్‌లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ ద్వయం 1-2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ఈ టోర్నీలో కుద్రయెత్సేవా (రష్యా)-రొడియోనోవా (ఆస్ట్రేలియా); సు వీ సెయి (చైనీస్ తైపీ)-పెంగ్ షుయె (చైనా) జంటలు కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. -
డబ్ల్యూటీఏ సెమీస్‌కు సానియా జోడీ
సింగపూర్ : సానియా మీర్జా జోడీ సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ (ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్) సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో కోప్స్-జోన్స్ జంటపై సానియా, కారా బ్లాక్ జోడీ 6-3, 2-6, 12-10 తేడాతో విజయం సాధించింది. డబ్ల్యూటీఏ సెమీస్‌కు చేరటం సానియాకు ఇదే తొలిసారి. కాగా ఇంతకుముందు ముగ్గురు వేర్వేరు భాగస్వాముల (ఎలెనా లిఖోవ్త్సెవా, రెన్నీ స్టబ్స్, లీజెల్ హ్యుబర్)తో కలసి పదిసార్లు ఈ పోటీల్లో పాల్గొన్న కారా బ్లాక్ ఈసారి సానియాతో కలసి 11వ సారి బరిలోకి దిగింది. ఈ ఏడాది చివర్లో కారా బ్లాక్ టెన్నిస్ నుంచి రిటైర్డ్ కానుంది. -
డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా జోడి అర్హత
సింగపూర్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు భారత స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) అర్హత సాధించారు. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ వచ్చే నెలలో 20 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ మెగా టోర్నీకి సానియా అర్హత సాధించడం ఇదే తొలిసారికాగా... కారా బ్లాక్ 11వసారి పాల్గొననుంది. ఏడాది మొత్తంలో డబుల్స్ విభాగంలో అత్యుత్తమంగా రాణించిన ఎనిమిది జోడిలు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. సానియా-కారా బ్లాక్ నాలుగో జోడిగా ఈ టోర్నీకి అర్హత పొందింది. ఈ ఏడాది సానియా-కారా బ్లాక్ ద్వయం రెండు టైటిల్స్ సాధించడంతోపాటు మూడు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీకి అర్హత పొందడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలో నేను తొలిసారి పాల్గొంటున్నాను. మా ఇద్దరికీ ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాను’ అని ప్రస్తుతం ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఇంచియాన్‌లో ఉన్న సానియా మీర్జా వ్యాఖ్యానించింది. -
సానియా జోడీకి టైటిల్
పాన్ పసిఫిక్ ఓపెన్ టోక్యో: ప్రస్తుత సీజన్లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శిస్తున్న సానియా మీర్జా పాన్ పసిఫిక్ ఓపెన్‌లోనూ మెరిసింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌తో కలిసి ఆమె డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ జోడి గార్డిన్ ముగురుజా, కార్లా స్వారెజ్ నవారోపై 6-2, 7-5 తేడాతో సానియా ద్వయం నెగ్గింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, బ్లాక్ ఏడు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన సానియా జోడికి 44 వేల 835 డాలర్లు (రూ. 27 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. కెరీర్లో సానియాకిది 21వ డబుల్స్ టైటిల్‌కాగా... కారా బ్లాక్‌తో కలిసి నాలుగోది. తాజా విజయంతో సానియా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగేందుకు ఇంచియాన్ బయలుదేరి వెళ్లనుంది. దివిజ్ శరణ్ లేదా సాకేత్‌లలో ఒకరితో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనుంది. -
డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా జోడి
టోక్యో: డబ్ల్యూటీఏ పసిఫిక్ ఓపెన్ టైటిల్ ను భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి కైవసం చేసుకుంది. డబుల్స్ విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో సానియా జోడి 6-2, 7-5 తేడాతో గార్బైన్ ముగుర్జా, కార్లా నవారోలపై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకున్నారు. వరుస రెండు సెట్లలో దూకుడుగా ఆడిన సానియా జోడి స్పెయిన్ జంటను మట్టికరిపించింది. టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న సానియా జోడి టైటిల్ ను సునాయసంగా ఎగురవేసుకుపోయింది. గత యూఎస్ ఓపెన్ లో మిక్సిడ్ విభాగంలో టైటిల్ సాధించిన ఊపులో ఉన్న సానియా.. అదే ఊపును ఈ టోర్నీలో కూడా ప్రదర్శించింది. అంతకుముందు శుక్రవారం టాప్‌సీడ్ సానియా-బ్లాక్ 6-3, 6-2తో అన్‌సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా)-అరంటా పారా సంటోజా (స్పెయిన్)లపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు సానియా మీర్జా బయల్దేరి వెళ్లనుంది. -
సెమీస్‌లో సానియా జోడి
టోక్యో: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి పాన్ పసిఫిక్ ఓపెన్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో మార్టినా హింగిస్-బెలిండా బెన్సిక్ జోడిపై 6-4, 6-2 తేడాతో వీరు సునాయాసంగా నెగ్గారు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడు సార్లు బ్రేక్ చేయగా నాలుగు సార్లు తమ సర్వీస్‌ను కోల్పోయింది. సెమీస్‌లో జెలెనా జంకోవిచ్-అరంటా పారా సంటోంజాతో తలపడనున్నారు. ఈ టోర్నీ ముగిశాక సానియా నేరుగా ఆసియా గేమ్స్ కోసం ఇంచియాన్ వెళ్లనుంది. -
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సానియా మీర్జా ఔట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో భారత్ కథ ముగిసింది. భారత క్రీడాకారిణి సానియా మీర్జా జోడీకి క్వార్టర్స్ లో చుక్కెదురైంది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సానియా(భారత్)- కారా బ్లాక్(జింబాంబ్వే) జోడీ 2-6, 6-3, 3-6 తేడాతో సు వే షా(చైనీస్ తైపాయ్), షూయ్ పెంగ్ (చైనా)చేతిలో ఓటమి పాలైంది. దీంతో సానియాపై పెట్టుకున్న భారత్ ఆశలు ఆవిరైయ్యాయి. తొలి సెట్ ను చేజార్చుకున్న సానియా జోడీ..ఆపై రెండో సెట్ ను గెలుచుకుని విజయం దిశగా పయనించినట్లు కనిపించింది. కాగా, మూడో సెట్ లో పోరాట పటిమ లోపించడంతో ఓటమి తప్పలేదు. -
ఓటమితో ఆరంభం సానియా జంటకు షాక్
సిడ్నీ: గత ఏడాది చివర్లో వరుసగా రెండు టైటిల్స్ సాధించి సత్తా చాటుకున్న సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట కొత్త సంవత్సరాన్ని ఓటమితో ఆరంభించింది. అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 3-6, 2-6తో జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా)-అజ్లాత్ తామ్లిజనోవిచ్ (క్రొయేషియా) జోడి చేతిలో ఓడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సానియా జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది.