cargo ships
-
గ్రీస్ సమీపంలో సరకు నౌక మునక
ఏథెన్స్: గ్రీస్ పరిధిలోని లెస్బోస్ ద్వీపం సమీప మధ్యదరా సముద్ర జలాల్లో ఒక సరకు రవాణా నౌక మునిగిన ఘటనలో నలుగురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని గ్రీస్ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. దాదాపు 6,000 టన్నుల ఉప్పుతో ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి బయల్దేరిన నౌక తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు వెళ్తోంది. మార్గమధ్యంలో గ్రీస్‌కు చెందిన లెస్బోస్ వద్ద మునిగిపోయింది. నౌకలోని 14 మంది సిబ్బందిలో నలుగురు భారతీయలు, ఎనిమిది మంది ఈజిప్ట్‌పౌరులు, ఇద్దరు సిరియన్లు ఉన్నారు. ఆదివారం ఉదయం ఏడింటపుడు మెకానికల్ సమస్య తలెత్తిందంటూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిన నౌక తర్వాత కనిపించకుండా పోయింది. ఒక ఈజిప్ట్ పౌరుడిని మాత్రం రక్షించగలిగారు. ఎనిమిది వాణిజ్య నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీస్ నావికా యుద్ద నౌక గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఘటన జరిగన చోట్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. -
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
రోజుకి వెయ్యి కోట్ల డాలర్ల నష్టం
ఇస్మాలియా(ఈజిప్ట్): అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్ కాలువలో అత్యంత భారీ సరకురవాణా నౌక చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 180కిపైగా చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజుకి దాదాపుగా వెయ్యి కోట్ల డాలర్లు నష్టం వస్తున్నట్టుగా అంచనా. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేసే పనామాకు చెందిన ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువ మార్గంలో అడ్డంగా ఇరుక్కుంది. 2 లక్షల మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. కాగా, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వీరంతా భారతీయులేనని నౌక యజమాని చెప్పారు. నౌక ఎలా చిక్కుకుంది ? సూయజ్ కాలువ మానవ నిర్మితం కావడంతో అక్కడక్కడా మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళుతున్న ఈ భారీ నౌక మంగళవారం ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం నెలకొని ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ రాకాసి గాలుల ధాటికి తీర ప్రాంతంలో ఇసుక కాల్వలో చేరి మేటలు వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందున్న మార్గం కనిపించకపోవడంతో సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ నౌక ఇసుక మేటల్లో అడ్డంగా కూరుకుపోయింది. ఎంత భారీ నౌక ?..: ఈ నౌక ఈఫిల్ టవర్ కంటే పొడవైనది. మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల కంటే పెద్దది. ఈ నౌకలో మొత్తం పన్నెండు అంతస్తులు ఉన్నాయి. ఈ నౌక ఇంచుమించుగా 1300 అడుగుల పొడవు, 193 అడుగుల వెడల్పు ఉంటుంది. నౌకని బయటపడేయడం ఎలా ? నౌకను మళ్లీ కదల్చడం అంత సులభంగా జరిగేది కాదని నావికారంగ నిపుణులు చెబుతున్నారు. నౌక చుట్టూ పేరుకుపోయిన ఇసుక బురదను తొలగించడానికి డ్రెడ్జింగ్ పరికరాలతో గత రెండు రోజులుగా యత్నిస్తున్నారు. నౌక అడుగున ఉన్న బురద వదులైతే నౌకని నిలువుగా తిప్పడానికి కుదురుతుందని ఆ నౌక మేనేజర్ బెర్న్‌హర్డ్ చెబుతున్నారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే నౌకని ముందుకు కదలేలా చేయవచ్చునని, లేదంటే వారాలైన పట్టవచ్చునని ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న డచ్ కంపెనీ బోస్కలిస్ సీఈవో పీటర్ బెర్డోవ్స్కి తెలిపారు. కాలువలో భారీగా కెరటాలు వస్తే నౌక ముందుకు కదిలే అవకాశం ఉందని, ఆ స్థాయిలో కెరటాలు రావాలంటే ఆది, సోమవారాల వరకు వేచి చూడాలని సాల్వేజ్ మాస్టర్ నిక్ సోలెన్ చెప్పారు. ఎందుకింత ఆందోళన ? 120 మైళ్లున్న సూయజ్ కాలువను 1869లో నిర్మించారు. ఉత్తరాన మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఇది కలుపుతుంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్ దేశాల నుంచి చమురు యూరప్ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 12% ఈ కాలువ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేసినప్పటికీ 2020లో 19వేల నౌకలు ఈ మార్గం వెంబడి ప్రయాణించాయి. అంటే సగటున రోజుకి 52 నౌకలు రాకపోకలు సాగించాయి. 1.17 బిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. ఇప్పుడు భారీ నౌక కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో కాల్వకి రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టుగా ఈజిప్టు అధికారులు వెల్లడించారు. రవాణా స్తంభించడంతో యూరప్ దేశాల్లో వాణిజ్యంపై ప్రభావం పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. బారెల్‌కు 5శాతం పెరిగిపోయాయి. కాలువ మార్గంలో అడ్డంగానిలిచిన ఎవర్ గివెన్ -
కార్గో నౌకలు ఢీ: 8 మంది సిబ్బంది గల్లంతు
జపాన్ రాజధాని టోక్యో తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రెండు కార్గో నౌకలు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో నౌకలో పని చేస్తున్న ఎనిమిది మంది చైనీయులు గల్లంతు కాగా, మరోకరు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు.ఈ మేరకు జపాన్ తీర ప్రాంత ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున 3.00 గంటల ఆ ప్రాంతంలో పనామాకు చెందిన బిగెల్ 3, దక్షిణ కోరియాకు చెందిన పెగాసస్ ప్రైమ్ నౌకలు ఢీ కొన్నాయని తెలిపారు. అయితే గల్లంతైన వారి ఆచూకీ కోసం రెండు హెలికాప్టర్లు,19 నౌకలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.