cars market
-
Cars24: పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఆదాయాలు, మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా యూజ్డ్ కార్ల మార్కెట్ గణనీయంగా పెరగనుంది. వచ్చే పదేళ్లలో ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు కార్స్24 సహ వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్ చోప్రా తెలిపారు. తమ అంతర్గత అధ్యయనం ప్రకారం 2023లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 2034 నాటికి ఏటా 15 శాతం చక్రగతి వృద్ధితో 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల క్రితం కార్స్24 ప్రారంభమైనప్పుడు ఇది 10–15 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేదని, గత 3–4 ఏళ్లలో వివిధ రకాల కార్ల రాకతో మార్కెట్ వేగం పుంజుకుందని చోప్రా తెలిపారు. పట్టణీకరణ, పెరుగుతున్న మధ్య తరగతి వర్గాల ప్రజలు, వినియోగదారుల్లో మారుతున్న ప్రాధాన్యతలు, అందుబాటు ధరల్లో మొబిలిటీ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతుండటం మొదలైన అంశాలు వృద్ధికి తోడ్పడగలవని చోప్రా వివరించారు. సొంత కార్లు ఉన్న వారు తక్కువే.. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో సొంత కారు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువేనని చోప్రా తెలిపారు. అమెరికా, చైనా, యూరప్ జనాభాలో 80–90 శాతం మందికి కార్లు ఉంటే భారత్‌లో 8 శాతం మందికే సొంత ఫోర్ వీలర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ పెరిగేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యువ జనాభా .. కార్లను కొనుగోలు చేసిన 5–6 ఏళ్లలోనే విక్రయించేసి మరో కొత్త వాహనం వైపు మొగ్గు చూపుతున్నారని చోప్రా తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం కనీసం 10–12 ఏళ్లయినా కార్లను అట్టే పెట్టుకునే వారని వివరించారు. ఎస్‌యూవీలకు డిమాండ్.. గడిచిన నాలుగేళ్లలో వినూత్న ఫీచర్లున్న ఎస్‌యూవీలకు యూజ్డ్ కార్ల మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. అంతర్గత అధ్యయనం ప్రకారం 2018–23 మధ్య కాలంలో రూ. 8 లక్షలకు పైబడిన విలువ గల కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. ఆదాయాలు, మధ్యతరగతి ప్రజల జనాభా పెరుగుతుండటమనేది మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తోందని చోప్రా తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాల్లో మెట్రోపాలిటన్ నగరాల వాటా 65 శాతంగా ఉంది. మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో యూజ్డ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చోప్రా చెప్పారు. -
రూ. 4.4 లక్షల కోట్లకు ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నాళ్లుగా కొత్త కార్ల మార్కెట్‌ను మించి ప్రీ–ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోంది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో (2022–27) ఇది వార్షికంగా 16 శాతం మేర పెరిగి రూ. 4.4 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఇదే వ్యవధిలో కొత్త కార్ల మార్కెట్ వృద్ధి వార్షికంగా 10 శాతంగానే ఉండనుంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్‌లో ఓఎల్ఎక్స్ రూపొందించిన 6వ విడత ఓఎల్ఎక్స్ ఆటోస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ల కారణంగా సరఫరా తగ్గి ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్ కాస్త మందగించినా .. 2022 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ కోవిడ్–పూర్వ స్థాయికి చేరింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగపడుతుండటం, కార్యాలయాలు తెరుచుకోవడంతో ప్రయాణాలు పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రీ–ఓన్డ్ వాహనాల మార్కెట్ మరింత పుంజుకోగలదని ఓఎల్ఎక్స్ ఇండియా సీఈవో అమిత్ కుమార్ తెలిపారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ప్రీ–ఓన్డ్ కార్ల విక్రయాలు విలువపరంగా 2.5 రెట్లు, పరిమాణంపరంగా రెండు రెట్లు పెరగనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ–ఓన్డ్ మార్కెట్లో చిన్న కార్ల ధరలు సగటున రూ. 2–4 లక్షలు, సెడాన్లు రూ. 5–6 లక్షలు, యూవీలు రూ. 7–9 లక్షల శ్రేణిలో ఉంటున్నాయి. యూవీలకు ప్రాధాన్యం.. నివేదిక ప్రకారం ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాలు 2022 ఆర్థిక సంవత్సరంలో 41 లక్షలుగా ఉండగా 2027 నాటికి రెట్టింపై 82 లక్షలకు చేరనున్నాయి. అదే వ్యవధిలో కొత్త కార్ల విక్రయాలు 9–11 శాతం వృద్ధితో 48 – 50 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. మిగతా రకాలతో పోలిస్తే యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతోంది. ప్రీ–ఓన్డ్ కార్ల విభాగం తీసుకుంటే 2017–2022 మధ్య కాలంలో వీటి మార్కెట్ వాటా 17 శాతం నుండి 22 శాతానికి పెరిగింది. రాబోయే అయిదేళ్లలో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 32 శాతానికి చేరవచ్చని అంచనా. ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫాం డేటా ప్రకారం హ్యుందాయ్ క్రెటా, మారుతీ బ్రెజా, మారుతీ ఎర్టిగా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అటు కొత్త కార్ల విభాగంలోను యూవీల హవా కొనసాగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 49 శాతం మార్కెట్ వాటాతో చిన్న కార్లు (45 శాతం), సెడాన్లను (3 శాతం) కూడా అధిగమించాయి. చిన్న కార్లు, సెడాన్ల తగ్గుదల.. ప్రీ–ఓన్డ్ విభాగంలోని మొత్తం కార్లలో 58 శాతం వాటాతో చిన్న కార్లదే ఆధిపత్యం ఉన్నప్పటికీ రాబోయే అయిదేళ్లలో ఇది స్వల్పంగా 2 శాతం తగ్గి 56 శాతానికి చేరవచ్చని అంచనా. ఈ విభాగంలో హ్యుందాయ్ ఎలీట్ ఐ20, రెనో క్విడ్, మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మొదలైన వాటికి ఎక్కువగా ఆదరణ ఉంటోంది. మరోవైపు, సెడాన్ కార్ల విభాగం మార్కెట్ వాటా గణనీయంగా తగ్గనుంది. ఇది 12 శాతం నుండి 7 శాతానికి పడిపోవచ్చని అంచనా. కొత్త కార్ల మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు తగ్గుతుండటం, కొత్తగా వచ్చే మోడల్స్ తక్కువగా ఉంటుండటం, కస్టమర్లు యూవీలవైపు మొగ్గు చూపుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం కానున్నాయి. యూవీల్లోనూ కొత్త మోడల్స్ వచ్చే కొద్దీ పాతవాటిని చాలా వేగంగా మార్చేస్తున్నారు. దీంతో నిన్న, మొన్న ప్రవేశపెట్టినవి కూడా ప్రీ–ఓన్డ్ సెగ్మెంట్లోకి వచ్చేస్తున్నాయి. మిగతా కార్లకు కూడా ఇదే ధోరణి విస్తరిస్తోంది. దీంతో 2027 నాటికి ప్రీ–ఓన్డ్ మార్కెట్లో సగటు వయస్సు 0–7 ఏళ్ల స్థాయిలో ఉండే వాహనాల వాటా 58 శాతం పైగా ఉంటుందని, ఇప్పుడున్న స్థాయికి 2.2 రెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఎక్కువగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ప్రీ–ఓన్డ్ కార్లకు డిమాండ్ ఉంటోంది. ► మొత్తం కస్టమర్లలో తొలిసారి కొనుగోలు చేసే వారి వాటా 40–45 శాతంగా ఉంటోంది. ► మహిళా కొనుగోలుదారుల వాటా మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో 10 శాతంగాను, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో 5 శాతం లోపు ఉంటోంది. ► ట్రాఫిక్ కారణంగా మెట్రోల్లో ఎక్కువగా ఆటోమేటిక్ వెర్షన్లకు డిమాండ్ ఉంటోంది. -
Kia India: అధికారికంగా కియా పేరు మార్పు..
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్ పేరు.. కియా ఇండియాగా మారినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తయారీ ప్లాంటులో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు.. దశలవారీగా డీలర్‌షిప్‌లలో కూడా ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే కియా తమ కొత్త కార్పొరేట్ లోగో, అంతర్జాతీయ బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది. సుమారు ఏడాదిన్నర క్రితం భారత్‌లో అమ్మకాలు ప్రారంభించిన కియా .. అత్యంత వేగంగా 2.5 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న నాలుగో కార్ల బ్రాండ్‌గా నిల్చింది. -
పాత కారు.. టాప్ గేరు!
కరోనా వైరస్ పరిణామాలతో కొత్త కార్ల అమ్మకాలు కొంతకాలంగా దెబ్బతిన్నప్పటికీ యూజ్డ్ కార్ల (సెకండ్ హ్యాండ్) విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తొలిసారిగా సరఫరాకి మించి డిమాండ్ నెలకొనడం గమనార్హం. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో కొత్త కార్ల అమ్మకాలు 26.14 శాతం క్షీణించగా, యూజ్డ్ కార్ల విక్రయాలు ఏకంగా 22 శాతం పెరిగాయి. కార్ల కంపెనీలు తమ దగ్గర పేరుకుపోయిన నిల్వలను వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే.. యూజ్డ్ కార్ల విక్రయ సంస్థలు .. డిమాండ్‌కి తగ్గ స్థాయిలో వాహనాలను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. ప్రీ–ఓన్డ్ కార్లను విక్రయించే శ్రీరామ్ ఆటోమాల్ గతంలో ప్రతి నెలా సుమారు 4,000–5,000 కార్లను విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఇది రెట్టింపై 10,000కు చేరింది. కరోనా పూర్వ స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం తమ వెబ్సైట్ ట్రాఫిక్ నాలుగు రెట్లు పెరిగిందని ఆన్లైన్ విక్రయ సంస్థ కార్స్24 వెల్లడించింది. తగ్గిన లభ్యత.. కొత్త కార్ల కొనుగోళ్లు పడిపోయిన నేపథ్యంలో పాత కార్లను ఎక్స్చేంజీ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. ఫలితంగా యూజ్డ్ కార్ల లభ్యత తగ్గిపోయింది. సాధారణంగా కొత్త కార్ల విక్రయాల్లో 26–27 శాతం దాకా ఉండే ఎక్స్చేంజీ విభాగం ఒక దశలో 6–7 శాతానికి పడిపోయింది. కొత్త కారు విలువ మూడు–నాలుగేళ్లలో సుమారు 30–50 శాతం దాకా పడిపోతుంది. చాలా మంది కస్టమర్లు ఇలాంటి వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే, ఎక్స్చేంజీ వ్యాపారం తగ్గి .. ఈ కేటగిరీ వాహనాలకు కొరత ఏర్పడింది. దీంతో కస్టమర్లు తప్పనిసరై.. దాదాపు అయిదారేళ్ల నుంచి తొమ్మిదేళ్ల దాకా పాతబడిన కార్ల వైపు చూడటం మొదలుపెట్టాల్సి వచ్చింది. ధరల్లో భారీ వ్యత్యాసం.. కొత్త, పాత కార్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా ఉండటం కూడా కస్టమర్లు ప్రీ–ఓన్డ్ వాహనాల వైపు మళ్లుతుండటానికి ఒక కారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. బీఎస్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అమల్లోకి వచ్చాక ఈ వ్యత్యాసం మరింతగా పెరిగిపోయిందని వివరించాయి. సుమారు 50,000–60,000 కి.మీ. ప్రయాణించిన ఓ అయిదేళ్లు పాతబడిన కారు... ప్రస్తుతం కొత్త కారు రేటులో సగానికే దొరుకుతోంది. ఇక ఫైనాన్షియర్స్ కూడా గతంతో పోలిస్తే ప్రస్తుతం యూజ్డ్ కార్లకు కూడా రుణాలు అందించేందుకు మరింతగా ముందుకొస్తున్నారు. మార్కెట్లోని అన్ని వర్గాలకూ ఈ పరిణామాలు సానుకూలంగా ఉంటున్నాయని వివరించారు. పెరిగిన ఎంక్వైరీలు.. దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ యూజ్డ్ కార్ల విభాగానికి గతేడాది గణనీయంగా ఎంక్వైరీలు వచ్చాయి. 2019లో వీటి సంఖ్య 16,53,264గా ఉండగా గతేడాది 17,51,928కి పెరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రజలు క్రమంగా ప్రజా రవాణా సాధనాల నుంచి వ్యక్తిగత వాహనాల వైపు మళ్లుతున్నారని మారుతీ సుజుకీ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, ఆదాయాలు, ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొనడంతో .. చేతిలో కాస్త డబ్బు ఉంచుకునే ఉద్దేశంతో కొత్త కార్ల కన్నా యూజ్డ్ కార్ల వైపు కొంత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 57%మంది.. ప్రీ–ఓన్డ్ కార్ల వైపే మొగ్గుతున్నారు. వాటా పెంచుకుంటున్న బడా కంపెనీలు.. అసంఘటితంగా ఉన్న యూజ్డ్ కార్ల విభాగంలో వృద్ధి అవకాశాలు గుర్తించిన పెద్ద కంపెనీలు క్రమంగా ఈ కేటగిరీలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ మార్కెట్లో సంఘటిత సంస్థల వాటా 2019లో సుమారు 18% ఉండగా.. గతేడాది 25–27%కి పెరగడం ఇందుకు నిదర్శనం. వారంటీలు, సర్టిఫికేషన్ వంటి అదనపు ప్రత్యేకతల కారణంగా పెద్ద కంపెనీల వైపు మళ్లే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్.. గతేడాది జూలై–డిసెంబర్ మధ్యకాలం అమ్మకాల్లో అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 20% వృద్ధి సాధించింది. 2021–22లో 25% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈవో అశుతోష్ పాండే వెల్లడించారు. మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్.. తన నెట్వర్క్ ద్వారా ప్రతి నెలా సుమారు 14,000 వాహనాలు విక్రయిస్తోంది. కరోనా కష్టకాలంలో కూడా సుమారు 80 స్టోర్స్ తెరిచింది. దీంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 1,000కి పైగా చేరింది. అటు ప్రీ–ఓన్డ్ లగ్జరీ కార్ల (పీవోసీ) అమ్మకాలు కూడా జోరందు కుంటున్నాయి. మెర్సిడెస్–బెంజ్ పీవోసీ గత తొమ్మిదేళ్లలో 21,000 కార్లు విక్రయించింది. 20% పైగా వార్షిక వృద్ధి నమోదు చేసింది. -
కొత్త కార్లొస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మరిన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు కన్నేశాయి. మూడు అంతర్జాతీయ కార్ల కంపెనీలు భారత మార్కెట్లో వాహనాలను ప్రవేశపెట్టబోతున్నాయి. బ్రిటన్ సంస్థ ఎంజీ మోటార్, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్, ఫ్రెంచ్ దిగ్గజం సిట్రోయెన్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో డజను పైగా మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఇవి సిద్ధమవుతున్నాయి. తద్వారా ఏటా 30 లక్షల పైచిలుకు కార్లు అమ్ముడయ్యే దేశీ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో వాటా దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం.. దేశీయంగా యుటిలిటీ వాహనాల మార్కెట్ 2013–2018 ఆర్థిక సంవత్సరాల మధ్య 11 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేసింది. ప్యాసింజర్ కార్ల విభాగం సాధించిన 3 శాతం వృద్ధితో పోలిస్తే యుటులిటీ వాహనాల సెగ్మెంట్ వృద్ధి అధిక స్థాయిలో ఉండటం గమనార్హం. ఎంట్రీ సెగ్మెంట్‌కు దూరం.. కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మూడు సంస్థలు ఎంట్రీ సెగ్మెంట్ కార్ల కన్నా అత్యధిక శాతం కస్టమర్లు కొనుగోలు చేసే మాస్ ప్రీమియం సెగ్మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు, కాలుష్య నియంత్రణ ప్రమాణాలు, భద్రత, ఇంధనం ఆదా తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఎస్యూవీ) ప్రవేశపెట్టబోతున్నాయి. కాస్త ధర ఎక్కువైనా కొంగొత్త ఫీచర్స్ ఉన్న వాహనాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటంతో.. గడిచిన అయిదేళ్లలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల సగటు ధర సుమారు 6,000 డాలర్ల నుంచి 10,000 డాలర్లకు చేరిందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ ఆటోమోటివ్ అంచనా వేసింది. దీనికి తగ్గట్లుగానే కొత్త కార్ల రేట్లు ఉండబోతున్నాయి. ముందుగా ఎంజీ హెక్టార్.. అన్ని కంపెనీల కన్నా ముందుగా ఎంజీ మోటార్ సంస్థ నుంచి హెక్టార్ వాహనం మార్కెట్లోకి రాబోతోంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా ఉండనుంది. హ్యుందాయ్ టక్సన్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా హ్యారియర్ వంటి వాహనాలతో ఈ ప్రీమియం ఎస్యూవీ పోటీపడనుంది. ఈ ఏడాది జూన్‌లో హెక్టార్ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాది చివరి త్రైమాసికంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంజీ ప్రవేశపెట్టనుంది. అటుపైన వచ్చే ఐదేళ్లలో ఏటా ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ఈడీ పి. బాలేంద్రన్ వెల్లడించారు. ఎంజీ ఇప్పటికే 45 మంది డీలర్లను ఎంపిక చేసింది. వీటికి 110 ఔట్లెట్స్ నెట్వర్క్ ఉంటుందని బాలేంద్రన్ పేర్కొన్నారు. కార్ల మార్కెట్ కొంత మందగించినా .. ఎస్యూవీ విభాగం మాత్రం వృద్ధి నమోదు చేస్తోందని ఆయన తెలిపారు. కొంగొత్త ఫీచర్స్‌పరంగా, సేవలపరంగా తమ వాహనాలు విభిన్నంగా ఉంటాయని బాలేంద్రన్ పేర్కొన్నారు. అటు కియా మోటార్స్ ఇండియా కూడా ఎస్యూవీ మార్కెట్‌పైనే ఎక్కువగా కసరత్తు చేస్తోంది. ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టబోతున్నామని సంస్థ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో కియా మోటార్స్ తొలి ఎస్‌యూవీని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ఎస్పీ2 కోడ్‌నేమ్‌తో వ్యవహరిస్తున్నారు. దీని ధర రూ. 10–16 లక్షల శ్రేణిలో ఉండబోతోంది. హ్యుందాయ్ క్రెటా, హోండా హెచ్ఆర్–వీ తదితర కార్లతో ఇది పోటీపడబోతోంది. సిట్రోయెన్ 2021లో తొలి ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆ తర్వాత ఏటా ఒక కొత్త మోడల్‌ను ఆవిష్కరించనుంది -
కార్ల మార్కెట్‌ను వీడని స్తబ్దత
న్యూఢిల్లీ: మారుతీ, హ్యుందాయ్, టయోటా, టాటా మోటార్స్ కంపెనీల కార్ల అమ్మకాలు జనవరిలో క్షీణించాయి. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన ఫోర్డ్, హోండా కార్స్ విక్రయాలు ఇదే నెలలో పదిశాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది తొలి నెలలో దేశీయ వాహన పరిశ్రమ స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేదని మహింద్రా అండ్ మహింద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా చెప్పారు. రిజర్వు బ్యాంకు ఇటీవల రెపో రేటును పెంచిన నేపథ్యంలో కార్ల రుణాలపై వడ్డీ రేటు త్వరలోనే పెరిగే అవకాశం ఉందని అన్నారు. దేశీయ మార్కెట్లో మాంద్యం కొనసాగుతోందని టొయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా వ్యాఖ్యానించారు. 2013 జనవరితో పోలిస్తే 2014 జనవరిలో అమ్మకాలు ... మారుతీ సుజుకీ విక్రయాలు 1,03,026 యూనిట్ల నుంచి 96,569 యూనిట్లకు తగ్గాయి. క్షీణత 6.3 శాతం. హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 34,302 యూనిట్ల నుంచి 2.6 శాతం క్షీణతతో 33,405 యూనిట్లకు చేరాయి. మహింద్రా అండ్ మహింద్రా విక్రయాల్లో 15.71 శాతం క్షీణత నమోదైంది. కంపెనీ అమ్మకాలు 47,841 యూనిట్ల నుంచి 40,324 యూనిట్లకు తగ్గాయి. టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 18.14 శాతం పడిపోయి 10,910 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్ అన్ని వాహనాల విక్రయాలు 34 శాతం క్షీణించి 40,481 యూనిట్లకు చేరాయి. దేశీయ మార్కెట్లో తమ అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 15,714 యూనిట్లకు చేరాయని హోండా కార్స్ తెలిపింది. సిటీ, అమే జ్ కార్లకు విశేషాదరణ లభించడమే ఇందుకు కారణమని పేర్కొంది. సమీక్షాకాలంలో ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 10.62 శాతం వృద్ధితో 6,706 యూనిట్లకు చేరాయి. యమహా టూవీలర్ల విక్రయాలు 6.5 శాతం వృద్ధితో 31,721 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ టూవీలర్ల అమ్మకాలు 1,54,107 నుంచి 1,56,138 యూనిట్లకు పెరిగాయి. మార్కెట్లోకి ఇసుజు వాహనాలు ఇసుజు మోటారు సంస్థ 2 రకాల వాహనాలను శనివారం మార్కెట్లోకి విడుదల చేసింది. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఇసుజు మోటార్స్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ టకాషికికుచి, డెప్యూటీ ఎండీ షిగెరు వాకాబాయాషి పాల్గొన్నారు. కొత్త ఎంయూ-7 ధర రూ.22.93 లక్షలు (బీఎస్ 4 వేరియంట్), రూ.22.63 లక్షలు (బీఎస్ 3 వేరియంట్-ఎక్స్ షోరూం), పికప్ ట్రక్ డిమాక్స్ ధర రూ.7.39 లక్షలు (ఎక్స్ షోరూం). శ్రీసిటీ అధినేత రవిసన్నారెడ్డి మాట్లాడుతూ 2016 నాటికి శ్రీసిటీలో ఇసుజు సంస్థ తన సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.