న్యూఢిల్లీ: మారుతీ, హ్యుందాయ్, టయోటా, టాటా మోటార్స్ కంపెనీల కార్ల అమ్మకాలు జనవరిలో క్షీణించాయి. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన ఫోర్డ్, హోండా కార్స్ విక్రయాలు ఇదే నెలలో పదిశాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది తొలి నెలలో దేశీయ వాహన పరిశ్రమ స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేదని మహింద్రా అండ్ మహింద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా చెప్పారు. రిజర్వు బ్యాంకు ఇటీవల రెపో రేటును పెంచిన నేపథ్యంలో కార్ల రుణాలపై వడ్డీ రేటు త్వరలోనే పెరిగే అవకాశం ఉందని అన్నారు. దేశీయ మార్కెట్లో మాంద్యం కొనసాగుతోందని టొయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా వ్యాఖ్యానించారు.
2013 జనవరితో పోలిస్తే 2014 జనవరిలో అమ్మకాలు ...
మారుతీ సుజుకీ విక్రయాలు 1,03,026 యూనిట్ల నుంచి 96,569 యూనిట్లకు తగ్గాయి. క్షీణత 6.3 శాతం.
హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 34,302 యూనిట్ల నుంచి 2.6 శాతం క్షీణతతో 33,405 యూనిట్లకు చేరాయి.
మహింద్రా అండ్ మహింద్రా విక్రయాల్లో 15.71 శాతం క్షీణత నమోదైంది. కంపెనీ అమ్మకాలు 47,841 యూనిట్ల నుంచి 40,324 యూనిట్లకు తగ్గాయి.
టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 18.14 శాతం పడిపోయి 10,910 యూనిట్లకు చేరాయి.
టాటా మోటార్స్ అన్ని వాహనాల విక్రయాలు 34 శాతం క్షీణించి 40,481 యూనిట్లకు చేరాయి.
దేశీయ మార్కెట్లో తమ అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 15,714 యూనిట్లకు చేరాయని హోండా కార్స్ తెలిపింది. సిటీ, అమే జ్ కార్లకు విశేషాదరణ లభించడమే ఇందుకు కారణమని పేర్కొంది.
సమీక్షాకాలంలో ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 10.62 శాతం వృద్ధితో 6,706 యూనిట్లకు చేరాయి.
యమహా టూవీలర్ల విక్రయాలు 6.5 శాతం వృద్ధితో 31,721 యూనిట్లకు చేరాయి.
టీవీఎస్ టూవీలర్ల అమ్మకాలు 1,54,107 నుంచి 1,56,138 యూనిట్లకు పెరిగాయి.
మార్కెట్లోకి ఇసుజు వాహనాలు
ఇసుజు మోటారు సంస్థ 2 రకాల వాహనాలను శనివారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఇసుజు మోటార్స్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ టకాషికికుచి, డెప్యూటీ ఎండీ షిగెరు వాకాబాయాషి పాల్గొన్నారు. కొత్త ఎంయూ-7 ధర రూ.22.93 లక్షలు (బీఎస్ 4 వేరియంట్), రూ.22.63 లక్షలు (బీఎస్ 3 వేరియంట్-ఎక్స్ షోరూం), పికప్ ట్రక్ డిమాక్స్ ధర రూ.7.39 లక్షలు (ఎక్స్ షోరూం). శ్రీసిటీ అధినేత రవిసన్నారెడ్డి మాట్లాడుతూ 2016 నాటికి శ్రీసిటీలో ఇసుజు సంస్థ తన సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కార్ల మార్కెట్‌ను వీడని స్తబ్దత
Published Sun, Feb 2 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement