యూజ్డ్ కార్ల మార్కెట్‌పై అంచనా
కార్స్24 సీఈవో చోప్రా వెల్లడి
న్యూఢిల్లీ: ఆదాయాలు, మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా యూజ్డ్ కార్ల మార్కెట్ గణనీయంగా పెరగనుంది. వచ్చే పదేళ్లలో ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు కార్స్24 సహ వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్ చోప్రా తెలిపారు. తమ అంతర్గత అధ్యయనం ప్రకారం 2023లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 2034 నాటికి ఏటా 15 శాతం చక్రగతి వృద్ధితో 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం కార్స్24 ప్రారంభమైనప్పుడు ఇది 10–15 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేదని, గత 3–4 ఏళ్లలో వివిధ రకాల కార్ల రాకతో మార్కెట్ వేగం పుంజుకుందని చోప్రా తెలిపారు. పట్టణీకరణ, పెరుగుతున్న మధ్య తరగతి వర్గాల ప్రజలు, వినియోగదారుల్లో మారుతున్న ప్రాధాన్యతలు, అందుబాటు ధరల్లో మొబిలిటీ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతుండటం మొదలైన అంశాలు వృద్ధికి తోడ్పడగలవని చోప్రా వివరించారు.
సొంత కార్లు ఉన్న వారు తక్కువే..
అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో సొంత కారు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువేనని చోప్రా తెలిపారు. అమెరికా, చైనా, యూరప్ జనాభాలో 80–90 శాతం మందికి కార్లు ఉంటే భారత్‌లో 8 శాతం మందికే సొంత ఫోర్ వీలర్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ పెరిగేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యువ జనాభా .. కార్లను కొనుగోలు చేసిన 5–6 ఏళ్లలోనే విక్రయించేసి మరో కొత్త వాహనం వైపు మొగ్గు చూపుతున్నారని చోప్రా తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం కనీసం 10–12 ఏళ్లయినా కార్లను అట్టే పెట్టుకునే వారని వివరించారు.
ఎస్‌యూవీలకు డిమాండ్..
గడిచిన నాలుగేళ్లలో వినూత్న ఫీచర్లున్న ఎస్‌యూవీలకు యూజ్డ్ కార్ల మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. అంతర్గత అధ్యయనం ప్రకారం 2018–23 మధ్య కాలంలో రూ. 8 లక్షలకు పైబడిన విలువ గల కార్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. ఆదాయాలు, మధ్యతరగతి ప్రజల జనాభా పెరుగుతుండటమనేది మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తోందని చోప్రా తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాల్లో మెట్రోపాలిటన్ నగరాల వాటా 65 శాతంగా ఉంది. మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో యూజ్డ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చోప్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment