మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, నాగులుప్పలపాడు : తనపై అత్యాచారం యత్నం చేయడమే కాక నిందితుల బంధువులు కూడా సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఉప్పుగుండూరులో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న మద్దిపాడు ఎస్సై రాజేష్ సమాచారం మేరకు ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన లచ్చంశెట్టి వెంకటేశ్వర్లుకు నవ్య (20)తో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఉప్పుగుండూరు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 1వ తేదీన తన ఇంటి సమీపంలోని సంగు వెంకటప్రసాద్, సాయి, మహేష్ అనే యువకులు నవ్య ఒక్కతే ఉన్న సమయంలో ప్రవేశించి అత్యాచార ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన ఆమె ఆ యువకులపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు యువకుల తల్లులు గంగు పద్మ, భూదిరి పద్మ, అనమర్లపూడి సరోజినితో పాటు వారి బంధువులు సంగు వెంకటరత్నం, సైదులు, లక్ష్మీ అనే వారు నవ్య ఇంటిపైకి వచ్చి తీవ్రమైన పదజాలంతో దూషణ చేస్తున్నారు. తన పట్ల అవమానకరంగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ్య మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. తన మరణానికి కారకులైన వారి పై సూసైడ్ లేఖ రాసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.