కారులో కోటిన్నర క్యాష్!
లాస్ వెగాస్: కోటి రూపాయలు కంటబడితే ఎవరైనా ఏం చేస్తారు. ఎవరూ చూడకుండా చటుక్కున నొక్కేద్దామనుకునే వాళ్లే ఎక్కువ. అయితే అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఇలాంటి పని పనిచేయలేదు. తన కారులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన సుమారు కోటిన్నర రూపాయలను కాజేయకుండా తిరిగి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. తన నిజాయితీతో అవార్డుతో పాటు అందరి మనసులు గెల్చుకున్నాడు.
లాస్ వెగాస్‌లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న గెర్నాండో గామ్బోయ్ తన కారు వెనుక సీటులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌ను గుర్తించి తెరిచి చూశాడు. అందులో ౩ లక్షల డాలర్లు(సుమారు రూ. 1.8 కోట్లు) ఉన్నట్టు గుర్తించాడు. ఈ డబ్బు తన కారులో ఎక్కిన పోకర్ ఆటగాడికి చెందినదిగా తెలుసుకున్న గామ్బోయ్ తన కంపెనీ ఎల్లో చెకర్ స్టార్ ట్రాన్స్పోర్టేషన్కు సమాచారం అందించాడు. తమ కారులో దొరికిన డబ్బును ప్రయాణికుడికి అందజేసింది ఆ కంపెనీ.
అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బు దొరికినా ఆశ పడకుండా నిజాయితీ చాటుకున్న గామ్బోయ్ను 'డ్రైవర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుతో సత్కరించింది. అతడికి వెయ్యి డాలర్లు బహుమతిగా ఇచ్చింది, మంచి రెస్టారెంట్లో విందు భోజనం ఏర్పాటు చేసింది. వీటన్నికంటే తనదికాని సొమ్ముకు ఆశ పడకుండా తిరిగిచ్చేయడమే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని 13 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్న గామ్బోయ్ వినయంగా చెప్పాడు.