హామీ ఇచ్చాం..తగ్గించాం
ముంబై: గత ఏడాది నవంబర్ 19వ తేదీన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను 20 శాతం తగ్గించామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గించిందని ఇప్పుడు మా ప్రభుత్వం చార్జీలు తగ్గించిందనే విపక్షాల విమర్శలు అవాస్తవం. మేం గతంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే తగ్గించాం. ఈ నిర్ణయంపై ఎవరి ప్రభావం లేదు. ప్రతిపక్షాలు దీనిపై ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. విద్యుత్ టారిఫ్ తగ్గింపు వల్ల ప్రభుత్వంపై రూ.7,200 కోట్ల భారం పడుతుంది..’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌పార్టీ విఫలమైందన్న బీజేపీ నేత వినేద్ తావ్డే విమర్శలకు చవాన్ స్పందించారు.‘ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసి పోటీ చేస్తుంది..’ అని స్పష్టం చేశారు.