హోరాహోరీ.. చివరి బంతికి విజయం..
Sakshi Premier League 2022 AP- విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్ విభాగంలో సర్ కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్) పాలిటెక్నిక్ కాలేజీ (ఏలూరు) జట్టు... సీనియర్ విభాగంలో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకాం) డిగ్రీ కాలేజీ (తిరుపతి) జట్టు చాంపియన్స్‌గా నిలిచాయి.
స్థానిక కేఎల్ యూనివర్సిటీ మైదానంలో బుధవారం జరిగిన జూనియర్ ఫైనల్లో సెంట్రల్ ఆంధ్ర రీజియన్‌కు చెందిన సీఆర్ రెడ్డి కాలేజీ ఆరు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర రీజియన్‌కు చెందిన సాయి గణపతి జూనియర్ కాలేజీ (విశాఖపట్నం) జట్టును ఓడించింది. తొలుత సాయి గణపతి కాలేజీ 62 పరుగులు సాధించింది. సీఆర్ రెడ్డి కాలేజీ బౌలర్లలో సంజయ్ నాలుగు వికెట్లు తీయగా... రేవంత్, మనోజ్ దత్తు ఒక్కో వికెట్ పడగొట్టారు.
63 పరుగుల లక్ష్యాన్ని సీఆర్ రెడ్డి జట్టు 7.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. సంజయ్ 26 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన సంజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించింది.
చివరి బంతికి విజయం...
సీనియర్ విభాగం ఫైనల్లో రాయలసీమ రీజియన్‌కు చెందిన సీకాం డిగ్రీ కాలేజీ రెండు పరుగుల ఆధిక్యంతో మహరాజ్ విజయరామ్ గజపతి రాజ్ (ఎంవీజీఆర్) ఇంజనీరింగ్ కాలేజీ (విజయనగరం) జట్టుపై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీకాం డిగ్రీ కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది.
అఫ్రోజ్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించగా... ధరణి 14 పరుగులు చేశాడు. ఎంవీజీఆర్ జట్టు బౌలర్లు తరుణ్ తేజ్ మూడు, వంశీ రెండు వికెట్లు తీశారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంవీజీఆర్ జట్టు 8 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. ఎంవీజీఆర్ జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరంకాగా ఆ జట్టు బ్యాటర్ ఆకేశ్ భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద సీకాం కాలేజీ ఫీల్డర్ అబ్బాస్ చేతికి చిక్కాడు.
అంతకుముందు ఎంవీజీఆర్ బ్యాటర్లు రవికిరణ్ (26), సాయిప్రణీత్ (16), ప్రసాద్ (19) పరుగులతో రాణించారు. అఫ్రోజ్‌కు (సీకాం కాలేజీ) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... ఎం.రవికిరణ్ (ఎంవీజీఆర్ కాలేజీ) ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విన్నర్, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు.
సాక్షి యాజమాన్యానికి అభినందనలు: బైరెడ్డి
ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ... క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి ప్రీమియర్ లీగ్ దోహదపడుతుందన్నారు. ప్రతిభావంతులను గుర్తించేందుకు సాక్షి యాజమాన్యం ఈ టోర్నీని నిర్వహించడం అభినందనీయమని బైరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, స్పోర్ట్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ హరికిషోర్, సాక్షి డిప్యూటీ ఎడిటర్ రాఘవ రెడ్డి, యాడ్స్ జీఎం బొమ్మారెడ్డి వెంకట రెడ్డి, ఈవెంట్స్ ఏజీఎం ఉగ్రగిరిరావు, విజయవాడ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న, బ్యూరో ఇన్‌చార్జ్‌లు ఓబుల్ రెడ్డి వెంకట్రామి రెడ్డి, రమేశ్, గుంటూరు జిల్లా యాడ్స్ ఆర్ఎం వెంకట రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్లు శ్రీహరి, వేణు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా...