ధర్మాన, సబితాలకు సీబీఐ కోర్టులో ఊరట
హైదరాబాద్ : మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీరిద్దర్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ గతంలో దాఖలు చేసిన మెమోను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ గతంలో కోర్టుకు విన్నవించింది. అలాగే వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది.
అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని తన తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి....సాక్ష్యులను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ కోర్టు పేర్కొంది.