ఫైనల్స్‌లో సీసీఓబీ జట్లు
బోస్టన్ కప్ క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోస్టన్ కప్ క్రికెట్ టోర్నీ అండర్-12, 14 కేటగిరీల్లో సీసీఓబీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన అండర్-12 సెమీఫైనల్లో సీసీఓబీ జట్టు 21 పరుగుల తేడాతో ఎస్సీఎఫ్ జట్టుపై గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీసీఓబీ 8 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 99 పరుగులు చేసింది. జునైద్ (56), అస్లాం (22) రాణించారు. లక్ష్యఛేదనలో ఎస్సీఎఫ్ 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అండర్-14 సెమీఫైనల్లో సీసీఓబీ జట్టు 8 వికెట్ల తేడాతో గోవిందరాజ్ క్రికెట్ అకాడమీ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవిందరాజ్ సీఏ 8 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం సీసీఓబీ 5.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 74 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
బాబర్ (41 నాటౌట్), అక్షయ్ (21) రాణించారు. అండర్-16 కేటగిరిలో జరిగిన మరో సెమీఫైనల్లో ఎస్సీఎఫ్ (తులసీ లార్డ్స్) జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్క్యాట్స్పై విజయం సాధించింది. సూపర్క్యాట్స్ జట్టు 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేయగా, ఎస్సీఎఫ్ (తులసీ లార్డ్స్) 5.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసి గెలిచింది. ఫైనల్స్‌లో సీసీఓబీ జట్లు అండర్-12లో సూపర్క్యాట్స్తో, అండర్-14లో ఎస్సీఎఫ్ గ్రీన్స్‌తో తలపడనున్నాయి.