ccs cyber crime police
-
సాహితీ ఇన్ఫ్రా బురిడీ రూ.1,110 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్) ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని అమీన్పూర్, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొంపల్లి, బంజారాహిల్స్, నిజాంపేట, బాచుపల్లి వంటి ప్రాంతాలలో 9 నివాస, వాణిజ్య ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని కొనుగోలుదారులను మాయమాటలతో నమ్మించినట్టు బయటపడింది. అసలు భూములను కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ముందస్తుగా డిపాజిట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సాహితీ ఇన్ఫ్రాపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలోని పలు ఠాణాలలో మొత్తం 50 కేసులు నమోదు కాగా.. ఇప్పటికే సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ సహా 22 మందిని అరెస్టు చేశారు. ఒక ప్రాజెక్టు సొమ్ముతో అనేకం..: టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. అమీన్పూర్లో కొనుగోలు అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబరు 343లో ఉన్న 23 ఎకరాలలో 18 ఎకరాలు ఫీనిక్స్ కంపెనీలో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద ఉండగా.. మిగిలిన ఐదెకరాలలో రెండు ఎకరాలు ఓమిక్స్ గ్రూప్, మూడు ఎకరాలను సాహితీ సంస్థ నేరుగా భూ యజమానుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులోనే సాహితీ శార్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని, 10 టవర్లు ఒక్కోటి 32 అంతస్తులలో ఉంటుందని కస్టమర్లను నమ్మించారు. 2019–22 మధ్య కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయకుండానే దాదాపు 1,752 మంది కొనుగోలుదారుల నుంచి రూ.504 కోట్లు వసూలు చేశారు. -
ఫేస్బుక్లో దిశపై అసభ్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశ కేసులో పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో బాధ్యతరాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలిని కించపరిచేలా, అత్యాచారాలను సైతం సమర్థించేలా కొందరు వికృతంగా కామెంట్లు పెడుతున్నారు. నీచంగా పెడుతున్న కామెంట్లు ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వాటిపై పోలీసులు కూడా సత్వరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన స్టాలిన్ శ్రీరామ్‌ను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో నిందితుడు ఆన్లైన్లో అసభ్య ప్రచారం చేశాడు. ఫేస్బుక్లో ఒక గ్రూప్‌గా ఏర్పడి దిశపై ఇష్టారీతిలో శ్రీరామ్ గ్యాంగ్ కామెంట్లు చేసింది. ఈ ఘటన తమ దృష్టికి రావడంతో సుమోటోగా పోలీసులు కేసును స్వీకరించారు. -
ఆపరేషన్ ఫ్రమ్.. హైదరాబాద్
► నైజీరియన్ల మోసాలకు నగరంలోనే ఖాతాలు! ► తమ అనుచరులను నగరానికి పంపిన ప్రధాన దళారి ► బోగస్ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచిన ద్వయం ► బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించేది వీటిలోనే ► ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లింపు... నెలకు రూ.20 వేల వేతనం... ‘వ్యాపారం’ రూ.5 లక్షలు దాటితే 5 శాతం కమీషన్... ఇదంతా ఏదైనా మార్కెటింగ్ జాబ్ వ్యవహారం అనుకుంటున్నారా..? కానే కాదు. వివిధ రకాలైన సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియన్లకు బోగస్ బ్యాంకు ఖాతాలు అందించిన వారికి దక్కే ‘ప్రతిఫలం’. ఢిల్లీకి చెందిన ఓ ప్రధాన దళారి నేతృత్వంలో పనిచేస్తున్న ఇద్దరు బిహారీలను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి విచారణలోనే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా నైజీరియన్లు, వారి దళారులు ఉత్తరాది, లేదా ఈశాన్య రాష్ట్రాల వారిని ‘మనీమ్యూల్స్’గా వాడుకుంటారు. అయితే తొలిసారిగా ఇద్దరు బిహారీలను హైదరాబాద్‌కు పంపించి, మనీమ్యూల్స్‌గా మార్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మనీమ్యూల్స్‌కు మహా డిమాండ్... వివిధ వీసాలపై భారత్‌కు వస్తున్న నైజీరియన్లు అనేక మెట్రోల్లో నివసిస్తున్నారు. సైబర్ నేరగాళ్లుగా మారుతున్న వీరిలో కొందరు ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్ ద్వారా వివిధ రకాలైన లాటరీలు, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు. నమ్మి వల్లో పడిన వారి నుంచి రకరకాల పేర్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలా బాధితుల నుంచి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు వీరికి బ్యాంకు ఖాతాలు అవసరం. నేరుగా తెలిస్తే పోలీసులకు చిక్కే, అనుమానం వచ్చే అవకాశం ఉండటంతో మనీమ్యూల్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. నైజీరియన్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలకు బోగస్ వివరాలతో తెరిచి అందించే వారిని మనీమ్యూల్స్‌గా పేర్కొంటారు. వీరికి కొంత ప్రతిఫలం అందజేస్తారు. ఢిల్లీకి చెందిన దళారి ద్వారా... ఢిల్లీ, ముంబైల్లో ఉంటున్న నైజీరియన్లు మనీమ్యూల్స్ ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటిలో డిపాజిట్ అయిన డబ్బును తమకు అందించడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన దళారిగా పని చేస్తున్న ఢిల్లీకి చెందిన కబీర్‌ఖాన్ అనే వ్యక్తి బిహార్‌కు చెందిన టైర్ల పంక్చర్లు వేసుకునే ఆదిత్య కుమార్, నిరుద్యోగి పర్వేజ్ మహ్మద్‌లను బోగస్ ఖాతాలు తెరవడం కోసం హైదరాబాద్‌కు పంపారు. కొన్నాళ్ల పాటు నాగోల్‌లో ఉన్న వీరు ప్రస్తుతం మాదాపూర్‌లో నివసిస్తున్నారు. బోగస్ వివరాలతో ఓటర్ ఐడీ, పాన్‌కార్డ్ పొందిన ఈ ద్వయం వివిధ బ్యాంకుల్లో 50 బోగస్ ఖాతాలు తెరిచింది. డిపాజిట్ అయిన నగదు అందిస్తూ... వీటి వివరాలను ఇద్దరూ కబీర్‌ఖాన్ ద్వారా నైజీరియన్లకు అందించారు. సైబర్ నేరాలకు పాల్పడే నైజీరియన్ల డబ్బు డిపాజిట్ చేయడానికి బాధితులకు ఈ ఖాతాల వివరాలే ఇస్తున్నారు. గత ఏడాదిగా ఆయా ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఈ సొమ్మును వీరు ఎప్పటికప్పుడు డ్రా చేసి నేరుగా వెళ్లి కబీర్ ఖాన్‌కు ఇవ్వడం లేదా అతడు పంపిన వ్యక్తికి అప్పగించడం చేసేవారు. దీనికి ప్రతిఫలంగా వీరికి నెలకు రూ.20 వేల జీతం ఇస్తున్న కబీర్‌ఖాన్ ఓ నెల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయితే దానికి 5 శాతం కమీషన్ కూడా ఇస్తున్నాడు. చిక్కింది ఇలా.. ఓ నైజీరియన్ నగరంలోని రెహ్మత్‌నగర్‌కు చెందిన పరమేశ్వర్‌రెడ్డికి స్టీఫెన్ పౌల్ పేరుతో మెయిల్ ఇచ్చాడు. అందులో లండన్‌లోని ఎస్సే హోటల్లో ఉద్యోగం అంటూ ఎరవేశాడు. పరమేశ్వర్ ఆసక్తి చూపడంతో రుసుముల పేరు చెప్పి రూ.1.3 లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ చేయించుకున్నారు. మళ్లీ వీసా ప్రాసెసింగ్ తదితరాల పేర్లు చెప్పి రూ.2 లక్షలు డిపాజిట్ చేయమన్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ పి.రవికిరణ్ ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు వివరాలను బట్టి ఆదిత్య, పర్వేజ్లను గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి బోగస్ ఓటర్ ఐడీ, పాన్‌కార్డ్‌తో పాటు బ్యాంకు పాస్‌పుస్తకాలు, చెక్కుబుక్స్, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కబీర్‌ఖాన్ చిక్కితేనే నైజీరియన్లు ఎవరన్నది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.