ఆపరేషన్‌ ఫ్రమ్.. హైదరాబాద్‌ | ccs cyber crime police arrested nigerians | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ఫ్రమ్.. హైదరాబాద్‌

Published Sat, Jun 17 2017 7:59 AM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

ఆపరేషన్‌ ఫ్రమ్.. హైదరాబాద్‌ - Sakshi

ఆపరేషన్‌ ఫ్రమ్.. హైదరాబాద్‌

నైజీరియన్ల మోసాలకు నగరంలోనే ఖాతాలు!
తమ అనుచరులను నగరానికి పంపిన ప్రధాన దళారి
బోగస్‌ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచిన ద్వయం
బాధితుల నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించేది వీటిలోనే
ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు


సాక్షి, సిటీబ్యూరో: నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లింపు... నెలకు రూ.20 వేల వేతనం... ‘వ్యాపారం’ రూ.5 లక్షలు దాటితే 5 శాతం కమీషన్‌... ఇదంతా ఏదైనా మార్కెటింగ్‌ జాబ్‌ వ్యవహారం అనుకుంటున్నారా..? కానే కాదు. వివిధ రకాలైన సైబర్‌ నేరాలకు పాల్పడే నైజీరియన్లకు బోగస్‌ బ్యాంకు ఖాతాలు అందించిన వారికి దక్కే ‘ప్రతిఫలం’. ఢిల్లీకి చెందిన ఓ ప్రధాన దళారి నేతృత్వంలో పనిచేస్తున్న ఇద్దరు బిహారీలను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి విచారణలోనే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా నైజీరియన్లు, వారి దళారులు ఉత్తరాది, లేదా ఈశాన్య రాష్ట్రాల వారిని ‘మనీమ్యూల్స్‌’గా వాడుకుంటారు. అయితే తొలిసారిగా ఇద్దరు బిహారీలను హైదరాబాద్‌కు పంపించి, మనీమ్యూల్స్‌గా మార్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మనీమ్యూల్స్‌కు మహా డిమాండ్‌...
వివిధ వీసాలపై భారత్‌కు వస్తున్న నైజీరియన్లు అనేక మెట్రోల్లో నివసిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లుగా మారుతున్న వీరిలో కొందరు ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌ ద్వారా వివిధ రకాలైన లాటరీలు, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు. నమ్మి వల్లో పడిన వారి నుంచి రకరకాల పేర్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలా బాధితుల నుంచి డబ్బు డిపాజిట్‌/ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేందుకు వీరికి బ్యాంకు ఖాతాలు అవసరం. నేరుగా తెలిస్తే పోలీసులకు చిక్కే, అనుమానం వచ్చే అవకాశం ఉండటంతో మనీమ్యూల్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. నైజీరియన్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలకు బోగస్‌ వివరాలతో తెరిచి అందించే వారిని మనీమ్యూల్స్‌గా పేర్కొంటారు. వీరికి కొంత ప్రతిఫలం అందజేస్తారు.

ఢిల్లీకి చెందిన దళారి ద్వారా...
ఢిల్లీ, ముంబైల్లో ఉంటున్న నైజీరియన్లు మనీమ్యూల్స్‌ ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటిలో డిపాజిట్‌ అయిన డబ్బును తమకు అందించడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన దళారిగా పని చేస్తున్న ఢిల్లీకి చెందిన కబీర్‌ఖాన్‌ అనే వ్యక్తి బిహార్‌కు చెందిన టైర్ల పంక్చర్లు వేసుకునే ఆదిత్య కుమార్, నిరుద్యోగి పర్వేజ్‌ మహ్మద్‌లను బోగస్‌ ఖాతాలు తెరవడం కోసం హైదరాబాద్‌కు పంపారు. కొన్నాళ్ల పాటు నాగోల్‌లో ఉన్న వీరు ప్రస్తుతం మాదాపూర్‌లో నివసిస్తున్నారు. బోగస్‌ వివరాలతో ఓటర్‌ ఐడీ, పాన్‌కార్డ్‌ పొందిన ఈ ద్వయం వివిధ బ్యాంకుల్లో 50 బోగస్‌ ఖాతాలు తెరిచింది.

డిపాజిట్‌ అయిన నగదు అందిస్తూ...
వీటి వివరాలను ఇద్దరూ కబీర్‌ఖాన్‌ ద్వారా నైజీరియన్లకు అందించారు. సైబర్‌ నేరాలకు పాల్పడే నైజీరియన్ల డబ్బు డిపాజిట్‌ చేయడానికి బాధితులకు ఈ ఖాతాల వివరాలే ఇస్తున్నారు. గత ఏడాదిగా ఆయా ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ఈ సొమ్మును వీరు ఎప్పటికప్పుడు డ్రా చేసి నేరుగా వెళ్లి  కబీర్‌ ఖాన్‌కు ఇవ్వడం లేదా అతడు పంపిన వ్యక్తికి అప్పగించడం చేసేవారు. దీనికి ప్రతిఫలంగా వీరికి నెలకు రూ.20 వేల జీతం ఇస్తున్న కబీర్‌ఖాన్‌ ఓ నెల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ అయితే దానికి 5 శాతం కమీషన్‌ కూడా ఇస్తున్నాడు.

చిక్కింది ఇలా..
ఓ నైజీరియన్‌ నగరంలోని రెహ్మత్‌నగర్‌కు చెందిన పరమేశ్వర్‌రెడ్డికి స్టీఫెన్‌ పౌల్‌ పేరుతో మెయిల్‌ ఇచ్చాడు. అందులో లండన్‌లోని ఎస్సే హోటల్‌లో ఉద్యోగం అంటూ ఎరవేశాడు. పరమేశ్వర్‌ ఆసక్తి చూపడంతో రుసుముల పేరు చెప్పి రూ.1.3 లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ చేయించుకున్నారు. మళ్లీ వీసా ప్రాసెసింగ్‌ తదితరాల పేర్లు చెప్పి రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయమన్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ పి.రవికిరణ్‌ ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు వివరాలను బట్టి ఆదిత్య, పర్వేజ్‌లను గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి బోగస్‌ ఓటర్‌ ఐడీ, పాన్‌కార్డ్‌తో పాటు బ్యాంకు పాస్‌పుస్తకాలు, చెక్కుబుక్స్, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కబీర్‌ఖాన్‌ చిక్కితేనే నైజీరియన్లు ఎవరన్నది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement