పెళ్లి పేరుతో రూ.2.32 లక్షలు స్వాహా
పెళ్లి పేరుతో రూ.2.32 లక్షలు స్వాహా
Published Wed, Jul 26 2017 8:39 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
♦ అమెరికా వాసినంటూ ఎర వేసిన నైజీరియన్
♦ సహకరించిన వ్యక్తినీ పట్టుకున్న సైబర్ కాప్స్
హైదరాబాద్: మాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకుని, తాను అమెరికాలో పని చేస్తున్న ఇంజినీర్‌గా నమ్మించి, అందినకాడికి దండుకుని మోసం చేసిన నైజీరియన్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి సహకరించిన ఢిల్లీ వాసినీ పట్టుకున్నట్లు ఏసీపీ కేసీఎస్ రఘువీర్ మంగళవారం తెలిపారు. నైజీరియాకు చెందిన పైస్ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన పేరును దీపక్‌పటేల్‌గా పేర్కొంటూ జీవన్‌సాథి. కామ్ అనే మాట్రిమోనియల్ సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు.
దీని ఆధారంగా సిటీకి చెందిన ఓ యువతికి రిక్వెస్ట్ పంపాడు. కొన్ని రోజుల పాటు ఫోన్లు, వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపిన తరువాత ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రులు ఎన్‌ఆర్‌ఐలని, తాను అమెరికాలోనే పుట్టానని, ప్రస్తుతం అక్కడే ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు యువతిని నమ్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఫోన్ చేసిన పైల్ తాను హైదరాబాద్ వస్తున్నానని, కలుద్దామంటూ చెప్పాడు. ఆ మరుసటి రోజు కాల్ చేసిన నైజీరియన్ తాను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చానని, తన వెంట భారీ లగేజ్ ఉండటంతో అధికారులు అడ్డుకున్నట్లు తెలిపాడు. వివిధ పన్నుల నిమిత్తం రూ.45 వేలు చెల్లించాలని కోరిన అతను తాను తిరిగి వచ్చాక ఇచ్చేస్తాంటూ ఓ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయించుకున్నాడు. సదరు ఖాతా తన వ్యవహారాలను పర్యవేక్షించే ఏజెంట్‌కు చెందినదని నమ్మించాడు.
మరుసటి రోజు సదరు యువతికి ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారిగా చెప్పుకుని దీపక్‌పటేల్ తన వెంట భారీ మొత్తం డబ్బు తీసుకువచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని, విడిచిపెట్టడానికి పన్ను చెల్లించాలంటూ రూ.55 వేలు డిమాండ్ చేసింది. దీనిని పైల్ కూడా ఖరారు చేయడంతో బాధితురాలు వారు చెప్పిన ఖాతాలో మరో రూ.55 వేలు డిపాజిట్ చేసింది. ఇలా అనేక కారణాలు చెబుతూ నైజీరియన్ నగర యువతి నుంచి మొత్తం రూ.2.32 లక్షలు వివిధ ఖాతాల్లో డిపాజిట్ చేయించాడు.
ఎట్టకేలకు మోసపోయినని గుర్తించిన బాధితురాలు సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎస్‌సైలు కృష్ణ, మధుసూదన్, కానిస్టేబుళ్లు సతీష్, విజయ్‌కుమార్, సలీం దర్యాప్తు చేపట్టి బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రత్యేక బృందం తొలుత పైల్‌కు సహకరించిన ఢిల్లీని తిలక్‌నగర్ వాసి హరిసింగ్‌ను పట్టుకుంది. ఇతడు చెప్పి వివరాల ఆధారంగా పైల్‌ను అరెస్టు చేశారు.
Advertisement
Advertisement