సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్‌ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది.
హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్) ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని అమీన్‌పూర్, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొంపల్లి, బంజారాహిల్స్, నిజాంపేట, బాచుపల్లి వంటి ప్రాంతాలలో 9 నివాస, వాణిజ్య ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని కొనుగోలుదారులను మాయమాటలతో నమ్మించినట్టు బయటపడింది.
అసలు భూములను కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ముందస్తుగా డిపాజిట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సాహితీ ఇన్‌ఫ్రాపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలోని పలు ఠాణాలలో మొత్తం 50 కేసులు నమోదు కాగా.. ఇప్పటికే సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ సహా 22 మందిని అరెస్టు చేశారు.
ఒక ప్రాజెక్టు సొమ్ముతో అనేకం..: టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు.
ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు.
అమీన్‌పూర్‌లో కొనుగోలు
అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నంబరు 343లో ఉన్న 23 ఎకరాలలో 18 ఎకరాలు ఫీనిక్స్ కంపెనీలో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద ఉండగా.. మిగిలిన ఐదెకరాలలో రెండు ఎకరాలు ఓమిక్స్ గ్రూప్, మూడు ఎకరాలను సాహితీ సంస్థ నేరుగా భూ యజమానుల నుంచి కొనుగోలు చేసింది.
ఇందులోనే సాహితీ శార్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని, 10 టవర్లు ఒక్కోటి 32 అంతస్తులలో ఉంటుందని కస్టమర్లను నమ్మించారు. 2019–22 మధ్య కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయకుండానే దాదాపు 1,752 మంది కొనుగోలుదారుల నుంచి రూ.504 కోట్లు వసూలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment