ఇక సెల్కాన్ ఎల్ఈడీ టీవీలు!
సెల్కాన్ సీఎండీ వై. గురు
* సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి తయారీకి రూ.100 కోట్లు వ్యయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రంగంలో ఉన్న సెల్కాన్ త్వరలో ఎల్ఈడీ టీవీల తయారీలోకి అడుగుపెడుతోంది. 14 అంగుళాల నుంచి 50 అంగుళాల సైజులో ఉండే టీవీలను రూపొందిస్తారు. దీనికోసం అంతర్జాతీయ బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేస్తున్న చైనా, తైవాన్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలతో సెల్కాన్ చేతులు కలిపింది.
హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్‌లో ఉన్న మొబై ల్స్ అసెంబ్లింగ్ ప్లాంటులోనే టీవీలను కూడా తయా రు చేస్తారు. ఈ విషయాన్ని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్కాన్ సీఎండీ వై. గురు ధ్రువీకరించారు. సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి టీవీలను ప్రవేశపెడతామన్నారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు.
ఇంటర్వ్యూ విశేషాలివీ..
టీవీల తయారీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి తొలి కంపెనీగా రాబోతున్నారు. ఈ విభాగంలో మీ భవిష్యత్ వ్యూహమేంటి?
అందుబాటు ధరలో ఆకర్షణీయ మోడళ్లను అందించడం ద్వారా మొబైల్స్ మార్కెట్లో సెల్కాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే ఊపుతో ఇప్పుడు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశిస్తున్నాం. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలోకి ప్రవేశించిన తొలి కంపెనీ మాదే అవుతుంది. టీవీ విడిభాగాల తయారీలో పేరున్న లిస్టెడ్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం.
సంక్రాంతికి సెల్కాన్ టీవీలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ముందుగా ఈ-కామర్స్ వేదికగా విక్రయిస్తాం. ఆ తర్వాత రిటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి. టీవీల తయారీ కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తున్నాం.
మరో రెండు మొబైల్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నారు కదా! ఎక్కడివరకూ వచ్చింది?
రేణిగుంట ప్లాంటుకు ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాబ్‌సిటీలో మరో ప్లాంటును నెలకొల్పుతున్నాం.
ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 11.5 ఎకరాలను కేటాయించింది. ఈ రెండు ప్లాంట్లలో మార్చికల్లా తయారీని ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలతోపాటు ఎల్ఈడీ టీవీలను సైతం వీటిల్లో ఉత్పత్తి చేస్తాం. ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లను భవిష్యత్తులో రూపొందిస్తాం.
నిధుల సమీకరణ సంగతో..?
ముందుగా ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకోవాలి. ఆ తర్వాత విస్తరణకు పీఈ ఫండ్ల నుంచి నిధులు సేకరించాలనే ఆలోచన ఉంది. అయితే ఎంత మొత్తం సమీకరించేదీ ఇంకా నిర్ణయించలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు, భాగస్వామ్యానికి ఈ రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.
మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాథ హంతో సెల్కాన్లో విదేశీ కంపెనీలు పెట్టుబడికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. జేవీకి సైతం ప్రతిపాదనలు చేస్తున్నాయి. ప్రస్తుతం మాకు బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి మద్దతుంది. నిధులకు ఢోకా లేదు.
4జీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తున్నారు?
ట్యాబ్లెట్ పీసీల విపణిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు మోడళ్లున్నాయి. రెండు మూడు నెలల్లో అయిదు మోడళ్లు రానున్నాయి. ఇందులో 4జీ వేరియంట్ కూడా తెస్తున్నాం. ఇంటెల్ చిప్సెట్తో ఒక ట్యాబ్లెట్‌ను కొద్ది రోజుల్లో ఆవిష్కరిస్తాం. ఈ మోడల్‌ను ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తాం. ఇప్పటి వరకు 3జీ స్మార్ట్ఫోన్లకే పరిమితమయ్యాం. డిసెంబరులో 4జీ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ప్రవేశిస్తాం.