బైక్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరి దుర్మరణం
కీసర, న్యూస్‌లైన్: చిన్ననాటి నుంచి మురిపెంగా పెంచిన పెద్దమ్మను, అంతే బాధ్యతగా ఆమె బాగోగులు చూసిన కుమారుణ్ని.. కారు రూపంలో మృత్యువు కబళించింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట మండలం తూంకుంట గ్రామానికి చెందిన ఆవుల రమేష్‌యాదవ్(43) బతుకుదెరువు నిమ్తితం ఆరే ళ్లక్రితం కీసర మండలం రాంపల్లి గ్రామానికి వలస వచ్చాడు. ఇక్కడి ఆర్ఎల్ నగర్లో పశుపోషణ చేపట్టి కాలం వె ళ్లదీస్తున్నాడు. కాగా ఆదివారం ఇంట్లో ఓ శుభకార్యం ఉండగా తూంకుంటలో ఉంటున్న రమేష్ యాదవ్ పెద్దమ్మ వెంకటమ్మ (63) అతని ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం వెంకటమ్మను శామీర్‌పేట తూంకుంట వద్ద దింపేందుకు తన బైక్‌పై ఆర్‌ఎల్‌నగర్ నుంచి బయలుదేరాడు.
కాగా కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే అక్కడ ఉన్న ఓ మలుపువద్ద ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మ, రమేష్యాదవ్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ‘108’లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో వారిద్దరు మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా రమేష్‌యాదవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, వెంకటమ్మకు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా రమేష్‌యాదవ్‌ను వెంకటమ్మే పెంచి పెద్ద చేసిందని, వీరిద్దరూ ఒకేరోజు మృత్యువాత పడడం తమను కలచివేసిందని స్థానికులు కంటతడిపెట్టారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని తెలిపారు.
ప్రమాదాలకు నిలయం
కీసర- శామీర్‌పేట ర హదారిలో తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఉన్న రోడ్డు మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మలుపుల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ప్రయాణికులు మృత్యువాతపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మలుపులు తగ్గించాలని, రోడ్డుకిరువైపులా పెంచిన హుడా చెట్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.