ఖాతాదారులందరి నుంచి ‘పాన్’ తీసుకోండి
బ్యాంకులను ఆదేశించిన కేంద్రం
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులకు ముకు తాడు వేసే చర్యలకు కేంద్రం నడుం బిగించింది. బ్యాంకు ఖాతాలన్నింటికీ పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. ఇందులోభాగంగా ఖాతాదారులందరి నుంచి ‘పర్మినెంట్ అకౌంట్ నంబర్’ (పాన్)ను తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. పాన్ లేనట్లయితే.. వారి నుంచి ఫారమ్–60ను తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఫిబ్రవరి 28వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధన జన్ధన్తోపాటు జీరో బ్యాలెన్స్ ఖాతాలైన సాధారణ పొదుపు ఖాతాలకు వర్తించదు.
జీఎస్టీలో నమోదుకు పాన్ తప్పనిసరి
ప్రస్తుతం ఎక్సైజ్, సేవా పన్ను చెల్లిస్తున్నవారు జీఎస్టీ వ్యవస్థకు మారేందుకు పాన్ నంబర్ కలిగి ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) పేర్కొంది. పాన్ ఆధారంగానే జీఎస్టీ పన్ను గుర్తింపు నెంబరు జారీ చేస్తారని తెలిపింది.