ఖమ్మంలోనే భద్రాచలం!
జీవోఎంను కోరిన తెలంగాణ కేంద్ర మంత్రులు
పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాచలం ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆ ప్రాంత కేంద్ర మంత్రులు జీవోఎంను కోరారు. ఆర్టికల్ 371(డీ)ని కొనసాగించాలని, రాజ్యాంగ సవరణ అవసరంలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సొంత విద్యుత్ ప్లాంట్లు నిర్మించుకునే వరకు ఇప్పుడున్న పద్దతిలోనే కేంద్రం విద్యుత్‌ను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడ జీవోఎంతో భేటీ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
జైపాల్‌రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడున్న భద్రాచలం ఖమ్మం జిల్లాలో భాగం. భద్రాచలంతో పాటు పూర్తి తెలంగాణ కావాలి.
హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగం. చారిత్రకంగా హైదరాబాద్‌లో అన్ని మతాలు, భాషల వారికి స్థానం ఉంటూ వచ్చింది. హైదరాబాద్‌పై కృత్రిమమైన ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ అందరికీ వ్యాపారం, వ్యాపకాలు పెంచుకునే అవకాశం ఉంది. ఉండాలి. ఈ సంస్కృతి నైజాం కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇక ముందూ కొనసాగిస్తాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుచ్ఛక్తి కొరత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు ఏ తప్పుడు విధానాల వల్ల విద్యుచ్ఛక్తి కొరత వచ్చిందో చరిత్రలోకి వెళ్లడం లేదు. ఈ దశలో అన్యాయం జరిగిందని చెప్పుకోవడం తగదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతగా విద్యుత్ ప్లాంట్లు పెట్టుకునేవరకు ఇప్పుడున్న ఫార్ములా ప్రకారం ఐదు, పదేళ్ల వరకు కేంద్రమే తెలంగాణకు విద్యుత్ ఇచ్చేలా చూడాలి.
ఆర్టికల్ 371(డీ) విషయంలో సీమాంధ్రప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. 371(డీ) కొనసాగాలి. ఈ విధానాన్ని రెండు ప్రాంతాల్లో అమలు చేయాలి. మేం ముగ్గురం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాం. ఆర్టికల్ 371(డీ)ని కొనసాగించడానికి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు.
కృష్ణా నదీజలాలపై ట్రిబ్యునల్ సరిపోతుంది. గోదావరిపై అక్కర్లేదు. మిగులు జలాలు చాలానే ఉన్నాయి. ఎవరికీ ఆందోళన అవసరం లేదు..
బలరాం నాయక్ ఏమన్నారంటే..
మహబూబాబాద్ లోక్‌సభ స్థానం(ఎస్టీ)లో భద్రాచలం ఉంది. 1959 నుంచీ ఇది తెలంగాణలోనే ఉంది. గిరిజనులు, కొండరెడ్లు ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఇక్కడ గుడికట్టిన తహశీల్దారు రామదాసును నిజాం జైలులో పెట్టారు.. వంటి వివరాలతో భద్రాచలం చరిత్రను జీవోఎంకు వివరించాను. భద్రాచలానికి అన్యాయం జరిగితే గిరిజనులు, ప్రజలు ఒప్పుకోరు. భద్రాచలం గుడే కాకుండా డివిజన్ మొత్తం తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా.
సర్వే ఏమన్నారంటే..
కొత్త రాజధాని నిర్మాణం ఎప్పటిలోపు పూర్తి చేస్తారనేదానిపై నిర్దిష్ట కాలవ్యవధి నిబంధన (సన్‌సెట్ క్లాజ్) విధించాలి. పదేళ్ల వరకు రాజధాని కట్టుకోకుంటే.. ఇక్కడే ఉండే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా సన్‌సెట్ క్లాజ్ పెట్టుకోవాలి. 10 ఏళ్లలోపు రాజధానిని కట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ల రాజధాని వారికి, మా రాజధాని మాకు ఉంటుంది అని చెప్పాను. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ఎక్కడా లేదు.. సోనియాగాంధీ మాటకు గౌరవించి అంగీకరించాం. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ చరిత్ర, 2004, 2009 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టడం మొదలు సీడబ్ల్యూసీ నిర్ణయం వరకు సంబంధించిన విషయాలన్నీ జీవోఎంకు వివరించాము.
హైదరాబాద్ రెవెన్యూ జిల్లా సరిపోతుంది..
రాష్ట్ర విభజనను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, సీఎం కిరణ్ కూడా వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్నకు.. పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని జైపాల్‌రెడ్డి చెప్పారు. జాతీయ పార్టీలు కూడా విభజనకు సహకరిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పెట్టడమే అపూర్వమని, 65 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పాటైనా ఎక్కడా ఇలా జరగలేదన్నారు. హైదరాబాద్ రెవెన్యూ పంపిణీ సాధ్యపడదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇద్దరు గవర్నర్లు, ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు ఉండేందుకు, హైకోర్టుల ఏర్పాటుకు హైదరాబాద్ రెవెన్యూ జిల్లా సరిపోతుందన్నారు. గవర్నర్లకు స్వయంప్రతిపత్తి అథారిటీ అక్కర్లేదని జీవోఎంకు చెప్పామన్నారు. ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలేర్పడి రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలుంటాయన్నారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు. ‘ఒకే రాష్ట్రంలో ఎన్నిక లు జరిగే పరిస్థితి లేదు. అది అనూహ్యం. అసంభవం’ అని చెప్పారు. సీమాంధ్ర నుంచి 9 మంది కేంద్ర మం త్రులు వెళ్లగా, ముగ్గ్గురే ఉన్న మీకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా.. అని ప్రశ్నించగా.. న్యాయమనేది మెజార్టీ, మైనార్టీపై ఆధారపడి ఉండదు. న్యాయాన్యాయాలు పార్లమెంట్ చూస్తుంది. ప్రజల కోరిక, న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుంటుందని బదులిచ్చారు.