ఠాణేలో ‘తెలుగు’ రైళ్లు ఆపండి సారూ..
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లను ఠాణే రైల్వేస్టేషన్లో నిలపాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక తెలుగు సంఘాలు తమ వంతు యత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల మహారాష్ట్ర టైలర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల బృందం సెంట్రల్ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ మెనేజర్‌తో భేటీ అయ్యింది.
ఈ సందర్బంగా వీరు ముఖ్యంగా కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు (17221-17222)ను ఠాణే రైల్వేస్టేషన్లో నిలపాలని డిమాండ్ చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) - కాకినాడ పోర్ట్‌ల మధ్య నడిచే ఈ రైలుతోపాటు ఎల్టీటీ - విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌లకు ఠాణేలో హాల్ట్ లేదు. జిల్లా కేంద్రమైన ఠాణే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.అయితే ఇక్కడ రైళ్లు ఆగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై స్పందించి వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లు ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఠాణేలో నిలపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు వినతి పత్రాన్ని సెంట్రల్ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ మేనేజర్‌కు అందచేశారు. మానవహక్కుల సంఘం సభ్యుడు సురేష్ కుమార్‌తోపాటు మహారాష్ట్ర టైలర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు దాసర్ భాస్కర్‌రావు, ప్రధాన కార్యదర్శి కడలి రామలింగేశ్వర్రావు, గుత్తుల సాహెబ్రావు, శ్రీనివాస్, గోపాలకృష్ణ, డి.రమణ, బాలం సత్యనారాయణ తదితరులున్నారు.