CEO post
-
ఎయిరిండియా సీఈవో పోస్టుకు ఇల్కర్ తిరస్కరణ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో, ఎండీగా చేరాలంటూ టాటా గ్రూప్ ఇచ్చిన ఆఫర్‌ను ఇల్కర్ అయిజు తిరస్కరించారు. భారత మీడియాలోని కొన్ని వర్గాలు .. అవాంఛనీయ కథనాలతో తన నియామకంపై సందేహాలు రేకెత్తించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘ఒక వ్యాపార నాయకుడిగా నేను ఎప్పుడూ ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇస్తాను. నా నియామకాన్ని ప్రకటించినప్పటి నుంచి దానికి అవాంఛనీయ రంగులు అద్దేలా భారత మీడియాలోని కొన్ని వర్గాలు అభ్యంతరకమైన కథనాలను ప్రచారం చేస్తుండటాన్ని పరిశీలించాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు చేపట్టడం సరికాదనే నిర్ణయానికి వచ్చాను‘ అని ఇల్కర్ తెలిపారు. ఎయిరిండియాకు సారథ్యం వహించే అవకాశాన్ని ఆఫర్ చేసినందుకు టాటా గ్రూప్, దాని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాను టాటా సన్స్ గతేడాది అక్టోబర్‌లో రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి సీఈవో, ఎండీగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్‌ను నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించింది. -
బ్యాంక్ చీఫ్‌ల పదవీ కాలం 15 ఏళ్లు
ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని 15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్‌లలో కార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్ని షరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటే తక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకు మించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదని ఆదేశించింది. -
అంతా రవిప్రకాశే చేసుకున్నాడా..!
సాక్షి, హైదరాబాద్ : మెరుగైన సమాజం కోసం.. కులం గోడలు కూల్చేద్దాం..! అంటూ భారీ ఆదర్శాలను వల్లెవేస్తూ ఒక సాధాసీదా జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన రవిప్రకాశ్ టీవీ9 సీఈవో స్థాయికి ఎదిగాడు. ఇంటా బయటా ఎన్నో ‘రాజీకీయాలు’ చేశాడు. 8 శాతం వాటాతో 90.5 శాతం షేర్లు కలిగిన అలందా వాటాదారులను నియంత్రించాలని చూశాడు. చివరకు అవమానకర రీతిలో అటు సీఈవో పదవిని ఇటు డైరెక్టర్ పదవిని కోల్పోయాడు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు. డెరెక్టర్లను నియమించుకోకుండా, యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించకుండా అలందా సంస్థకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని శుక్రవారం సాయంత్రం జరిగిన ఏబీసీఎల్ బ్రాడ్ కాస్టింగ్ డెరెక్టర్లు వెల్లడించారు. సంస్థలో అధికారం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ తన గోతి తనే తవ్వుకున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. (టీవీ9తో రవిప్రకాశ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్లు) ‘50కి పైగా షేర్లున్న వాటాదారుకు యాజమాన్య హక్కులు దఖలు పడాలి. మేమూ అదే చేశాం. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించాం. కంపెనీల చట్టం ప్రకారం డైరెక్టర్ల మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని షేర్ హోల్డర్ల మీటింగ్‌లో చర్చించి శుక్రవారం మీడియాకు వెల్లడించాం. వాటార్లందరి అభిప్రాయం మేరకే వారిని తొలగించాం. కానీ, రవిప్రకాశ్ నిన్న టీవీ9 లైవ్‌లోకొచ్చి తనపై ఎలాంటి ఆరోపణలు లేవని అన్నాడు. ఆరోపణలు లేకుంటే మంచిదే’ అని డెరెక్టర్ సాంబశివరావు అన్నారు. ఇక ఆదిపత్యం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇరుకున్నట్టు తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు డైరెక్టర్లు చెప్పారు. టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది. -
కుర్చీలాటలో పై‘చేయి’ ఎవరిదో?
=జిల్లా పరిషత్ సీఈవో పోస్టుకోసం పైరవీలు =సీఈవో, డిప్యూటీ సీఈవోలుగా ఇద్దరి నియామకం =వేరే ఇద్దరికి అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు =సుబ్బారావుకు మంత్రి అండ ! సాక్షి, మచిలీపట్నం : నిత్యం ప్రజాసమస్యల పరిష్కారంలో తలమునకలయ్యే జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం ఇప్పుడు వివాదాలకు వేదికైంది. కార్యాలయ పరిపాలనాపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో), డిప్యూటీ సీఈవో పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఈ పోస్టుల్లో ఇద్దరిని నియమించిన ఉన్నతాధికారులు తమ పని అయిందనిపించారు. ఇంతలోనే వేరే ఇద్దరికి ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ వివాదం ముదురుపాకాన పడింది. వీరితో నిమిత్తం లేకుండా ఇదే జిల్లాలో ఆర్డీవోగా పనిచేసిన ఉద్యోగి ఒకరు రాజకీయ అండతో తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెరసి జెడ్పీ సీఈవో పోస్టు కోసం సాగుతున్న పైరవీలపై కొద్ది రోజులుగా రసవత్తర చర్చ జరుగుతోంది. జెడ్పీ సీఈవోగా పనిచేస్తున్న సీఎస్.కొండయ్యశాస్త్రికి బదిలీ రావడంతో సెప్టెంబర్ 1న రిలీవ్ అయ్యారు. దీంతో జెడ్పీ సీఈవోగా జిల్లా రెవెన్యూ ఆధికారి (డీఆర్వో) ఎల్.విజయ్‌చందర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అదే సమయంలో నందివాడ ఎంపీడీవోగా పనిచేసిన చింతా కళావతికి డిప్యూటీ సీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లాలోని సీనియర్ ఎంపీడీవోలకే సీఈవోగా బాధ్యతలు అప్పగించాలని, ఇతర శాఖలకు చెందిన వారికి ఆ బాధ్యతలు ఇవ్వడం సరికాదంటూ జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీవోలు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి బి.నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. పూర్తికాలపు సీఈవో లేకపోతే అర్హులైన ఎంపీడీవోలకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని వారు కోరారు. వారి వాదనతో ఏకీభవించిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో డిప్యూటీ సీఈవోగా ఉన్న కళావతికి సీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఎంపీడీవో జి.వి.సూర్యనారాయణను డిప్యూటీ సీఈవోగా, ఎ.కొండూరు ఎంపీడీవో అనురాధకు జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 7న ఉత్తర్వులు జారీ చేశారు. అంత వరకు బాగానే ఉన్నా.. అదే సమయంలో తనకు సీఈవో పోస్టు ఇవ్వాలంటూ గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన సుబ్బారావు తనకు అనుకూలంగా జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ప్రజాప్రతినిధులు ఉన్నారని సిఫారసు లేఖలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో సుబ్బారావును జిల్లాలో సీఈవోగా నియమించుకోవాలంటూ రెవెన్యూ శాఖ సూచిం చింది. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి స్పందిస్తూ ఇతర శాఖలకు చెందిన వారికి జెడ్పీ సీఈవో ఇచ్చే అవకాశం లేదని, తమ శాఖకు చెందిన వారికే పదోన్నతి ఇచ్చి సీఈవోగా నియమించుకుంటామంటూ తేల్చి చెప్పారు. దీంతో సుబ్బారావు నియామకం నిలిచిపోయింది. ఇదే సమయంలో తాము సీనియర్లమని, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు తమకే ఇవ్వాలంటూ 1999 బ్యాచ్ డెరైక్ట్ రిక్రూట్ ఎంపీడీవో క్యాడర్‌కు చెందిన ఇద్దరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో ఇన్చార్జి సీఈవో, డెప్యూటీ సీఈవోలుగా నియమించిన కళావతి, సూర్యనారాయణ కంటే తామే సీనియర్లమంటూ రాజీవ్ విద్యామిషన్ ఏవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో జ్యోతిబసు, కృష్ణమోహన్‌లకు సీఈవో, డెప్యూటీ సీఈవోలుగా ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలంటూ అక్టోబర్ 24న ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ఆ ఆదేశాలను అమలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టుల కోసం కుర్చీలాట మరింత రసకందాయంలో పడింది. ముందు నియమించిన కళావతి, సూర్యనారాయణ ఇద్దరు తామే ఇన్చార్జులుగా కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇన్చార్జి బాధ్యతలు దక్కించుకునేందుకు జ్యోతిబసు, కృష్ణమోహన్ ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు సుబ్బారావు మరోమారు జెడ్పీ సీఈవో పోస్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు వేగిరం చేశారు. వీరిలో జెడ్పీ సీఈవో కుర్చీ ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయించాలి.