గాంధీజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :ప్రజలందరూ మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. గాంధీ జయంతిని పురస్కరించుకోని బుధవారం నల్లగొండలోని రామగిరిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విశాల భారతావని వికాసానికి గాంధీజీయే మూలమని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావం పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలని కోరారు. గాంధీ కలలుగన్న సమాజం కోసం యువత పాటుపడాలన్నారు.
నేడు ఎక్కడ చూసినా అహింస చోటుచేసుకుంటుందని, దానిని రూపుమాపడానికి మరోగాంధీ రావాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, డీఆర్వో అంజయ్య, జెడ్పీ సీఈవో వెంకట్రావ్, హౌసింగ్ పీడీ శరత్‌బాబు, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, మార్కెటింగ్ ఏడీ ప్రసాదరావు, డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, డీఎంహెచ్ఓ ఆమోస్, ఆర్ఐఓ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బొర్ర సుధాకర్, మాలె శరణ్యారెడ్డి, సూరెడ్డి సరస్వతి, స్వాతంత్య్ర సమరయోధుడు పాశం చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు వున్నారు.