చట్టం వచ్చినా... మనకు పట్టదా?
ప్రేమగా చెవి మెలిపెట్టి, తియ్యగా లడ్డూ తినిపించే చట్టం...
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్!
ఆర్‌నుంచి పద్నాలుగేళ్ల వయసు పిల్లలంతా చదివి తీరాల్సిందే.
డబ్బుల్లేవా? ప్రభుత్వం ఇస్తుంది.
సీట్లు లేవా? ప్రభుత్వమే ఇప్పిస్తుంది.
చదవడం ముఖ్యం.
పిల్లలంతా చదువుకుని పైకి రావడం ముఖ్యం.
ఇదే మన ప్రభుత్వం ధ్యేయం, లక్ష్యం, ఆశ, ఆకాంక్ష కూడా.
ఇదెంత గొప్ప చట్టమో తెలుసా?
మూడేళ్ల క్రితం - ఈ చట్టం అమలుకు ముందు మన్మోహన్ సింగ్ పెద్ద స్పీచ్ ఇచ్చారు!
భారతదేశ చరిత్రలోనే ఇలా ఒక కొత్త చట్టం గురించి
దేశ ప్రధాని ప్రసంగించడం అదే మొదటిసారి!!
చట్టం రానైతే వచ్చింది.
కంప్లైంట్లే ఎక్కువయ్యాయి.
‘ఉచిత నిర్బంధ విద్య’ బాలల హక్కు అయినప్పుడు...
ఆ హక్కుకు భంగం వాటిల్లినప్పుడు ఫిర్యాదు ఎవరికి చేయాలన్నదే అసలు ఫిర్యాదు!
దీనిపై ‘సాధన’ చేస్తున్న నిర్విరామ పోరాటమే ఈవారం ‘ప్రజాంశం’.
ఇప్పటికీ కొన్ని గ్రామాలకెళితే...అమ్మానాన్నలతోపాటు పిల్లలు కూడా పొలానికెళ్లే దృశ్యాలు మన కంటపడతాయి. కొన్ని ఊళ్లలో అయితే బడి పక్కనే ఉన్న కల్లుదుకాణాలు కనిపిస్తాయి. గిరిజన తండాలకెళితే బడి ఆవరణలోనే కట్టేసి ఉన్న బర్రెలు, బడి వరండాల్లోనే ఏర్పాటు చేసిన సంతలు కూడా కనిపిస్తాయి. ‘విద్యాహక్కు చట్టం’ వచ్చాక కూడా ఇదేం దుస్థితి అని ప్రశ్నిస్తారు సిహెచ్ మురళీమోహన్. గత ఇరవైఏళ్లుగా ఆయన ‘సాధన’ పేరుతో విద్యాహక్కు చట్టం కోసం పోరాడి... ఇప్పుడు చట్టం వచ్చాక దాని అమలు కోసం పోరాడుతున్నారు!
‘‘2010 ఏప్రిల్ 1 తేదీని సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు. ఆ రోజు విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు. ప్రపంచమంతా ఒక్క గొడుగుకిందకు చేరుతున్న తరుణంలో అక్షరజ్ఞానం లేని వ్యక్తిని వింతపశువుతో కూడా పోల్చలేం. విద్యాహక్కు చట్టం కోసం ఉన్నికృష్ణన్ కోర్టులో కేసు వేసినపుడు తీర్పుసమయంలో న్యాయమూర్తి మాట్లాడుతూ...‘ప్రస్తుతం మన దేశంలో చదువుకున్నవారే జీవించినట్టు...మిగతావారంతా మృతజీవులే’ అన్నారు.
అంతటి ప్రాధాన్యత గల చట్టం వచ్చాక లెక్క ప్రకారం మన విద్యావిధానాల్లో గొప్ప మార్పులు రావాలి. అయితే పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రానికి మాత్రం ఆ చట్టం అందని ద్రాక్ష చందాన తయారయింది’’....అని అంటోన్న మురళీమోహన్ ఆవేదన వెనకున్న సత్యాలు వింటే అక్షర జ్ఞానం లేనివారికి కూడా ఆవేశం వస్తుంది. చదివించుకునే స్తోమత ఉంటేనే పిల్లల్ని చదివించాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ చట్టం పుణ్యాన దేశంలోని బాలలందరూ బడుల్లోనే ఉండాలి.
ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఒక్క రూపాయి కూడా విద్యార్థి నుంచి ఆశించకుండా విద్యబోధించాలన్నది ఆ చట్టం లక్ష్యం. విద్య ఒక్కటే కాదు దానికి సంబంధించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ విషయంలో ఏమైనా తేడా వస్తే విద్యాచట్టం కళ్లెర్రజేస్తుంది. అవసరమైతే కర్ర పట్టుకుంటుంది కూడా. ఈ అవగాహననంతటినీ ప్రతి ఇంటి ముంగిటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మురళీమోహన్.
‘సాధన’ లక్ష్యం...
బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘సాధన’ సంస్థ హైదరాబాద్‌లో 1992లో స్థాపించారు. 2010 వరకూ బాలలకు ఏ అన్యాయం జరిగినా... వీధుల్లోకి వెళ్లి ధర్నాలు, ర్యాలీలు చేసి పోరాడిన మురళీమోహన్ ఇప్పుడు నేరుగా ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నారు. ఇప్పటివరకూ సాధన లక్షమంది బాలకార్మికుల్ని బడుల్లో చేర్పించింది. మెదక్, కర్నూలు, నిజామాబాద్ జిల్లాలోని 700 గ్రామాల్లో సాధన సిబ్బంది పని చేస్తున్నారు. ఆ గ్రామాల్లో పిల్లలెవరూ పనుల్లోకి వెళ్లరు. ఒకవేళ అలా జరిగితే...సాధన వెంటనే స్పందిస్తుంది. సంబంధిత అధికారులకు చెప్పి దగ్గరుండి అక్షరాలు దిద్దిస్తోంది. ‘‘గ్రామాల్లో బాలకార్మికుడిని బడికి పంపడం అంటే చిన్న విషయం కాదు. ముందు తల్లిదండ్రుల్ని ఒప్పించాలి.
తర్వాత ఆ చిన్నారి ఎవరిదగ్గరయితే పనిచేస్తున్నాడో ఆ పెద్దమనిషిని ఒప్పించాలి. పోలీసుల్ని, మమ్మల్ని చూసి భయపడి స్కూల్లో చేర్పించినా...ఆ కుర్రాణ్ని మళ్లీ పనిలో పెట్టేవరకూ నిద్రపోరు కొందరు. ‘అక్షరం అన్నం పెట్టాలంటే పదేళ్లు పడుతుంది. అదే వాడు పనిలోకి పోతే...వాడి పొట్టకి వాడు తెచ్చుకుంటాడు’ అనే పేద తల్లిదండ్రుల్ని ఒప్పించడం తేలికే గాని...వారి పిల్లల్ని బడిలో కొనసాగించడం మాత్రం చాలా కష్టం. అందుకే డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవడాన్ని కూడా ‘సాధన’ తన బాధ్యతగా తీసుకుంది. అలాగే పల్లెబడుల్లో ఆడపిల్లలకు రక్షణ కల్పించడంకోసం ఉద్యమిస్తోంది.
హక్కుల పెట్టె...
‘‘బాలలు ఏడు, ఎనిమిది తరగతులు దాటగానే రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి విషయాన్ని నేరుగా వచ్చి మాకు చెప్పలేరు. దీనికోసం మేం వంద పాఠశాలలో ‘బాలల హక్కుల పెట్టె’ పెట్టాం. పదిరోజులకొకసారి మా సిబ్బంది వెళ్లి అందులో పిల్లలు వేసిన చిట్టీలు తీసి చదివి... వారికి న్యాయం జరిగేలా చూస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య మామూలే. ఇప్పుడు ఈ చట్టం వచ్చాక... తేలిగ్గా తీసుకోవడం కుదరదు. మా కంటపడ్డ ఏ పాఠశాలనూ మేం వదల్లేదు. అన్నింటిపై ఫిర్యాదు చేసి దగ్గరుండి కట్టించేవరకూ ఊరుకోలేదు.
అలాగే సంస్థ పెట్టిన కొత్తలో ‘సాధన’ పేరుతో మాసపత్రికను నడిపించాం. అందులో మన విద్యావిధానంలో రావాల్సిన మార్పులు, దేశంలో ఇతర ప్రాంతాల్లో విద్యలో వచ్చిన మార్పులు...వంటి విషయాలు ఉండేవి. ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గరున్న సిలబస్ బతకడానికి ఉపయోగపడేది కాదంటూ మేం రాసిన కథనాలు చాలామంది ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని ఆలోచింపజేశాయి’’ అంటూ మురళీమోహన్ తమ సంస్థ కార్యకలాపాల గురించి వివరంగా చెప్పారు. బాలల హక్కుల గురించి సాధన లాంటి సంస్థలు చాలా ఉన్నప్పటికీ విద్యాహక్కు చట్టం గురించి ప్రచారం చేసే పనిమాత్రం ‘సాధన’ స్థాయిలో జరగడం లేదనే చెప్పాలి.
బస్సు యాత్ర...
విద్యాహక్కు చట్టంపై అవగాహన పెంచేందుకు సాధన కొత్త పథకం తయారుచేసింది. సేవ్ ద చిల్డ్రన్‌తో చేయి కలిపి ‘విద్యా హక్కు ప్రచార రథం’ పేరుతో ఒక బస్సుని మెదక్ జిల్లా మొత్తం తిప్పుతోంది. విద్యాహక్కు చట్టం అనే ఆయుధం ప్రతి ఒక్కరు చేతబడితే మన విద్యావ్యవస్థలోనే కాదు సమాజంలో కూడా ఊహకందని మార్పులొస్తాయని అంటున్నారు మురళి.
‘‘ఈ చట్టంలో ప్రధానమైన విషయం ఎస్సి, ఎస్టి పిల్లల్లో ఇరవై అయిదుశాతం పిల్లలకు కార్పోరేట్ బడులు ఉచితంగా విద్య చెప్పాలి. ఆ పనిని ప్రభుత్వ అధికారులు దగ్గరుండి చేయించాలి. చట్టంవచ్చి మూడేళ్లవుతున్నా...మన రాష్ట్రంలో ఒక్క ఎస్సి, ఎస్టి విద్యార్థి కూడా ఉచితంగా కార్పోరేట్ బడిలో అక్షరం నేర్చుకోలేదు. అదొక్కటేనా...బడుల్లో పిల్లల్ని గురువులు దండించడంపై రాష్ర్టంలో ఏదో ఒక పాఠశాల నుంచి రోజుకో వార్త వినిపిస్తోంది. అలాంటి సంఘటనల్లో ఉపాధ్యాయుడ్ని యాజమాన్యం మందలించడం, లేదంటే ఉద్యోగం నుంచి తీసేయడం వంటివి చేసి ఊరుకుంటున్నారు.
అలాకాకుండా... కొన్ని సీరియస్ కేసుల్లో సెక్షన్ 17 చట్టం కింద కేసు పెట్టొచ్చు అన్న విషయం కూడా ఈ చట్టంకిందకే వస్తుంది. దీని గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియకపోతే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కాని దురదృష్టవశాత్తు ఉపాధ్యాయుల్లో కూడా చాలామందికి తెలియదు.
ఈ అవగాహన సమస్యలన్నీ తీరాలంటే...మన రాష్ర్టంలో స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ రావాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఢిల్లీస్థాయిలో ధర్నాలు, ర్యాలీలు చేశాం. దాంతో తాత్కాలికంగా రాజీవ్ విద్యా మిషన్ కింద ‘రైట్ టు ఎడ్యుకేషన్ సెల్’ ఏర్పాటు చేశారు కాని దానివల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు. దాంతో మేం ప్రతి చిన్న విషయానికి జాతీయ బాలల హక్కుల కమిషన్ని ఆశ్రయిస్తున్నాం.
మానవ హక్కులతో సమానంగా విద్యాహక్కుకి ప్రచారం పెరగాలి. ఈ చట్ట ప్రయోజనాల్ని ప్రజలు పూర్తిస్థాయిలో పొందేవరకూ మా ‘సాధన’ పోరాటం ఆగదు’’ అంటూ ముగించారు మురళీమోహన్. దేశాభివృద్ధికి విద్యకి మించిన పెట్టుబడి మరొకటిలేదు. ప్రపంచపటంలో మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోకూడదంటే దేశంలో విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలవ్వాలి. అందరికీ అక్షరం ఉంటే...అభివృద్ధి మన దేశానికి టాగ్ లైన్ అవుతుంది. దీనికోసం మురళీమోహన్లాంటివారు చాలామంది కృషిచేయాలి. అలాంటివారు ఎదురైతే వారితో చేయి కలపడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి.
- భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
‘‘విద్యాహక్కు చట్టం వచ్చి మూడేళ్లు అవుతున్నా...మన రాష్ర్టంలో దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ని ఏర్పాటుచేయలేకపోయింది ప్రభుత్వం. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చట్టం వచ్చిన వెంటనే ‘స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్’ని ఏర్పాటు చేసుకున్నారు. విద్యాపరంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. మన దగ్గర మాత్రం చట్టాన్ని తీసుకెళ్లి అందనంత దూరంలోనే ఉంచారు.
నేనంటే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాను కాబట్టి నేరుగా ఢిల్లీలోని ‘బాలల హక్కుల జాతీయ కమిషన్’కి ఫిర్యాదు చేస్తున్నాను. మరి గ్రామాల్లోని సామాన్యులు ఫిర్యాదు చేయాలంటే ఎలా?చేసేది లేక...మా సంస్థ సిబ్బంది తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని ఇంగ్లీషులోకి మార్చి ఢిల్లీకి పంపిస్తున్నాం. వాళ్లు వెంటనే స్పందించి సంబంధిత జిల్లా కలెక్టర్‌కి సమన్లు పంపిస్తున్నారు. అదే కమిషన్ ఇక్కడ ఉంటే ఇంకా చాలా సమస్యలు బయటకి వస్తాయి. చాలామంది సామాన్యులకు న్యాయం జరుగుతుంది’’