ch vidhyasagar rao
-
ఇన్నేళ్లకు మళ్లీ అదే సీన్ రిపీటైంది!
సాక్షి, కరీంనగర్: రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని పార్టీ నేతలు సంబరపడుతున్నారు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1998 నుంచి కరీంనగర్ జిల్లా నుంచి సీహెచ్.విద్యాసాగర్‌రావు అటు ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్నేళ్లకు అదే సీన్ రిపీట్ అయింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన సంజయ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. విద్యాసాగర్‌రావు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలవగా, బీజేపీ నుంచి పెద్దపల్లి, మెట్పల్లి ఎమ్మెల్యేలుగా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో కరీంనగర్ జిల్లాలో అప్పట్లో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగింది. 2004 ఎన్నికల నాటి నుంచి శాసనసభలో కరీంనగర్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్లో ప్రబలమైన శక్తిగా ఉన్న అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొని నిలబడేలా బీజేపీని తీర్చిదిద్దాలి్సన బాధ్యత సంజయ్‌పై పడింది. స్వయం సేవకుడే.. కమలం సారథి తొలి నుంచి బీజేపీకి పట్టున్న కరీంనగర్ జిల్లా 1982లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తరువాత కరీంనగర్ జిల్లా నుంచి సీహెచ్.విద్యాసాగర్‌రావు తొలి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్జీ 1989, 1994 వరకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడమే గాకుండా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 1999 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా విజయం సాధించడమే గాకుండా తాను ఖాళీ చేసిన మెట్పల్లి నుంచి తుమ్మల వెంకట రమణారెడ్డిని గెలిపించారు. పెద్దపల్లి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి అప్పుడే గెలిచారు. కరీంనగర్‌తోపాటు పలు పట్టణాల్లో, గ్రామాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ లభించింది. 2004 తరువాత పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. 2014, 2019లో దేశమంతా మోదీ హవా కొనసాగినా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఒక్క స్థానం గెలవలేకపోయింది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే బండి సంజయ్ ఈ రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు గట్టిపోటీ ఇచ్చి, రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ హవాకు తోడు సంజయ్‌కుమార్ పట్టుదల, ప్రజల సానుభూతి కలగలిసి భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతూనే ఆర్ఎస్ఎస్ మద్దతుతో ఏకంగా బీజేపీ రాష్ట్ర పీఠాన్ని అధిరోహించారు. వచ్చే ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తెలంగాణ, ఏపీకి నూతన బీజేపీ అధ్యక్షులు! క్షేత్రస్థాయిలో దృష్టి పెడితే... కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసిన వ్యూహం తరువాత జరిగిన స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో పనిచేయలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట మెజారిటీ సాధించిన బీజేపీ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం కరీంనగర్, హుజూరాబాద్‌లో కొంత ప్రభావం చూపింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పుంజుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీని బలమైన శక్తిగా రూపొందించాల్సిన బాధ్యత సంజయ్ పైనే ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో మురళీధర్ రావు, విద్యాసాగర్‌రావు వంటి నేతలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాస్ లీడర్లుగా ఉన్నది కొందరే. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. నాలుగేళ్ల వరకు ఏ ఎన్నికలు లేకపోవడంతో ప్రతీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి బూత్, గ్రామ, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని క్యాడర్ గుర్తు చేస్తోంది. -
తెలంగాణ, ఏపీకి నూతన బీజేపీ అధ్యక్షులు!
సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. ఆయన గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ..‘ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి నూతన అధ్యక్షులు రాబోతున్నారు. ఎవరు అధ్యక్షుడు అయినా అందరిని కలుపుకుని ముందుకు వెళతాం. తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా అవతరించాం. అలాగే ఏపీలోనూ త్వరలో మార్పులు రాబోతున్నాయి. (మార్చి 15న రాష్ట్రానికి అమిత్‌షా) (ఫైల్ ఫోటో) తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోంది. సీఏఏలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ రాజకీయ అవసరాల కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్‌లు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టికల్ 370, రామ మందిరం, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలలో ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణ చూడలేకే సీఏఏపై వివాదం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. జాతి సమైక్యతకు ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అవసరం ఎంతో ఉంది. ముస్లిం యువత జాతీయ జెండాతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమణ ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా? (సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం) తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పోరాటం చేస్తుంది. కర్ణాటక, మహారాష్ట్రలో జరుగుతున్నప్పటికీ తెలంగాణలో జరగకపోవడం సరికాదు. అంతర్జాతీయ మాతృభాషను ఘనంగా జరుపుకుని తెలుగు భాషను పరిరక్షించుకోవాలి. మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్ వేదికగా కార్యక్రమం జరుగుతోంది. ఇంట్లో ఒక భాష, పాఠశాలలో ఒక భాష ...ఇలా విద్యార్థులలో సంఘర్షణ లేకుండా చూడాలి’ అని అన్నారు. (సీఏఏపై వెనక్కి వెళ్లం) -
పురాణపండ శ్రీనివాస్‌కు ఘన సత్కారం
హైదరాబాద్: మానసిక వ్యవస్థ విరాజిల్లడానికి అద్భుతమైన గ్రంథాల్ని రచించడంలో, ప్రచురించడంలో సత్యాన్వేషణతో కూడిన కొత్త సొగసుల్ని సృష్టించి వేలాదిమందికి ఆకట్టుకుంటున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని హైదరాబాద్ త్యాగరాయగానసభలో అపురూప విలువల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం శ్రీనివాస్ మాట్లాడిన ప్రతీ పలుకూ సభికుల్ని తన్మయత్వానికి గురిచేశాయి. తెలంగాణా రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే.వి.రమణాచారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వారం రోజులపాటు జరిగిన తెలంగాణా సాంస్కృతిక సప్తాహ వేడుకల ముగింపు ఉత్సవాన్ని శ్రీనివాస్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పురాణపండ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఉత్సవానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీమంత్రి సి.హెచ్.విద్యాసాగరరావు గౌరవ అతిధిగా హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. రమణాచారి వంటి ప్రతిభాశాలి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పురాణపండ శ్రీనివాస్ వంటి తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన రచయిత రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు మాట్లాడుతూ ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసి , సమర్ధ సేవలతో జాతీయ స్థాయిలో పేరుపొందిన రమణాచారి వంటి సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. భక్తి పారవశ్యపు మహా స్వరూప అత్యద్భుత గ్రంధంగా పురాణపండ శ్రీనివాస్ ఏడవసారి ప్రచురించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహాగ్రంధాన్ని విద్యాసాగర్ రావు ఆవిష్కరించి, పురాణపండ శ్రీనివాస్ ప్రయత్నం, లక్ష్యం , దశ, దిశ, గమనం, గమ్యం అన్నీ అద్భుతంగా వుంటాయని శ్రీనివాస్ భాషలోని సొగసులు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయన్నారు. తెలుగు వాకిళ్ళలో ఇలాంటి నిస్వార్ధ ప్రతిభామూర్తిని ఎక్కడో గానీ చూడమన్నారు. ఈ వేడుకలో సంస్కృత పండితులు , ఆచార్యలు చలమచర్ల వేంకట శేషాచార్యుల్ని రమణాచారి తండ్రి రాఘవాచార్యుల స్మారక పురస్కారంతోను , ప్రముఖ లలిత సంగీత గాయకులు, లిటిల్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ రామాచారిని రమణాచారి స్ఫూర్తి పురస్కారంతోను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఏ.ఎస్.అధికారి కె.వి. రమణాచారి మాట్లాడుతూ- తన జన్మదిన వేడుకను ఇంత అందంగా , అద్భుతంగా నిర్వహించిన కళా జనార్ధనమూర్తిని అభినందించారు. సభా సమావేశాలకూ దూరంగా వుండే పురాణపండ శ్రీనివాస్ వంటి మానవవిలువల ప్రతిభాసంపన్నమైన ప్రజ్ఞ కలిగిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తన వేడుకకు ముఖ్య అతిధిగా రావడంపట్ల తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొంటూ విద్యాసాగర్‌రావు వంటి రాజకీయ వ్యక్తిత్వం మూర్తీభవించిన శిఖరం హాజరవవ్వడం పట్ల ప్రశంసలు వర్షించారు. ఈ వేడుకలో అందరినీ విస్మయపరిచే ప్రసంగం చేసి ఆకర్షించిన అరుదైన అతిధి పురాణపండ శ్రీనివాస్ ని సభపక్షాన విద్యాసాగర్ రావు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఇంత చక్కని సభను ఏర్పాటుచేసిన కళా జనార్ధనమూర్తిని జంట నగరాల సాంస్కృతిక సంస్థలు, తెలంగాణా ప్రభుత్వ అధికారులు అభినందించారు. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మేనల్లుడు
రాజకీయాల్లో బంధాలు...అనుబంధాలు మిథ్య. కరీంనగర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత సిహెచ్.విద్యాసాగర్‌రావు కుటుంబంలో ఇలాంటి పోరే కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విద్యాసాగర్‌రావు పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడైన చెన్నమనేని రమేష్‌బాబు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. బాబాయ్, అబ్బాయ్‌ల పోటీలో అబ్బాయినే విజయం వరించింది. ఆ సమయంలోనే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి విద్యాసాగర్‌రావు మేనల్లుడు, బోయిన్పల్లి వినోద్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ మరోసారి ఈ ముగ్గురు ఎన్నికల బరిలో దిగారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థులుగా బీజేపీ నుంచి విద్యాసాగర్‌రావు, టీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీపడుతుండగా, వేములవాడ అసెంబ్లీ స్థానంలో చెన్నమనేని రమేశ్‌బాబు ఈసారి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ బరిలో అబ్బాయి చేతిలో ఓడిపోయిన విద్యాసాగర్‌రావు, ఇపుడు మేనల్లుడి సవాలు నెగ్గుకొస్తారా.. అనేది ఆసక్తిగా మారింది. -న్యూస్‌లైన్,కరీంనగర్ సిటీ -
ప్రాసిక్యూషన్ విభాగం డెరైక్టర్‌గా విద్యాసాగర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగం డెరైక్టర్(డీవోపీ)గా సీహెచ్ విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. ఈ మేర కు న్యాయశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యాసాగర్‌రావు 1983లో ప్రాసిక్యూషన్ విభాగంలో ఏపీపీగా నియమితులయ్యారు. ఏసీబీ, ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించారు. గత రెండేళ్లుగా ప్రాసిక్యూషన్ విభాగం ఇన్చార్జ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా, సీనియర్ జిల్లా జడ్జిలను మాత్రమే డీవోపీగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రాసిక్యూషన్ విభాగానికి చెందిన అధికారులను డీవోపీగా నియమించడం ఇదే ప్రథమం. -
'చంద్రబాబు తప్పించుకోవడం ఖాయం'
హైదరాబాద్ : రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి రాష్ట్రపతికి పంపాలని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదని విద్యాసాగర్ రావు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పించుకోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యర్థం ఆదివారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాసాగర్ రావు తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి 'రన్ ఫర్ యూనిటీ' ప్రారంభం అవుతుందన్నారు.