సాక్షి, కరీంనగర్: రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని పార్టీ నేతలు సంబరపడుతున్నారు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1998 నుంచి కరీంనగర్ జిల్లా నుంచి సీహెచ్.విద్యాసాగర్‌రావు అటు ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇన్నేళ్లకు అదే సీన్ రిపీట్ అయింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన సంజయ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. విద్యాసాగర్‌రావు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలవగా, బీజేపీ నుంచి పెద్దపల్లి, మెట్‌పల్లి ఎమ్మెల్యేలుగా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో కరీంనగర్ జిల్లాలో అప్పట్లో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగింది. 2004 ఎన్నికల నాటి నుంచి శాసనసభలో కరీంనగర్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌లో ప్రబలమైన శక్తిగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని నిలబడేలా బీజేపీని తీర్చిదిద్దాలి్సన బాధ్యత సంజయ్‌పై పడింది.
స్వయం సేవకుడే.. కమలం సారథి
తొలి నుంచి బీజేపీకి పట్టున్న కరీంనగర్ జిల్లా
1982లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తరువాత కరీంనగర్ జిల్లా నుంచి సీహెచ్.విద్యాసాగర్‌రావు తొలి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో మెట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్‌జీ 1989, 1994 వరకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడమే గాకుండా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 1999 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా విజయం సాధించడమే గాకుండా తాను ఖాళీ చేసిన మెట్‌పల్లి నుంచి తుమ్మల వెంకట రమణారెడ్డిని గెలిపించారు. పెద్దపల్లి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి అప్పుడే గెలిచారు. కరీంనగర్‌తోపాటు పలు పట్టణాల్లో, గ్రామాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ లభించింది. 2004 తరువాత పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. 2014, 2019లో దేశమంతా మోదీ హవా కొనసాగినా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఒక్క స్థానం గెలవలేకపోయింది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే బండి సంజయ్ ఈ రెండుసార్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు గట్టిపోటీ ఇచ్చి, రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ హవాకు తోడు సంజయ్‌కుమార్ పట్టుదల, ప్రజల సానుభూతి కలగలిసి భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతూనే ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో ఏకంగా బీజేపీ రాష్ట్ర పీఠాన్ని అధిరోహించారు. వచ్చే ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
తెలంగాణ, ఏపీకి నూతన బీజేపీ అధ్యక్షులు!
క్షేత్రస్థాయిలో దృష్టి పెడితే...
కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసిన వ్యూహం తరువాత జరిగిన స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో పనిచేయలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట మెజారిటీ సాధించిన బీజేపీ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం కరీంనగర్, హుజూరాబాద్‌లో కొంత ప్రభావం చూపింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పుంజుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీని బలమైన శక్తిగా రూపొందించాల్సిన బాధ్యత సంజయ్ పైనే ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో మురళీధర్ రావు, విద్యాసాగర్‌రావు వంటి నేతలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాస్ లీడర్లుగా ఉన్నది కొందరే. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. నాలుగేళ్ల వరకు ఏ ఎన్నికలు లేకపోవడంతో ప్రతీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి బూత్, గ్రామ, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని క్యాడర్ గుర్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment