బాబాయ్.. అబ్బాయ్.. ఓ మేనల్లుడు
రాజకీయాల్లో బంధాలు...అనుబంధాలు మిథ్య. కరీంనగర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత సిహెచ్.విద్యాసాగర్‌రావు కుటుంబంలో ఇలాంటి పోరే కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విద్యాసాగర్‌రావు పోటీ చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడైన చెన్నమనేని రమేష్‌బాబు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. బాబాయ్, అబ్బాయ్‌ల పోటీలో అబ్బాయినే విజయం వరించింది.
ఆ సమయంలోనే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి విద్యాసాగర్‌రావు మేనల్లుడు, బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ మరోసారి ఈ ముగ్గురు ఎన్నికల బరిలో దిగారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థులుగా బీజేపీ నుంచి విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీపడుతుండగా, వేములవాడ అసెంబ్లీ స్థానంలో చెన్నమనేని రమేశ్‌బాబు ఈసారి టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అసెంబ్లీ బరిలో అబ్బాయి చేతిలో ఓడిపోయిన విద్యాసాగర్‌రావు, ఇపుడు మేనల్లుడి సవాలు నెగ్గుకొస్తారా.. అనేది ఆసక్తిగా మారింది.
-న్యూస్‌లైన్,కరీంనగర్ సిటీ